
ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే.. జపాన్ చాలా స్పెషల్. జపాన్‌లో మనుషుల సగటు లైఫ్ స్పాన్ 86 ఏండ్లు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అలాగే జపాన్ వాళ్ల వయసు గుర్తించడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఐదు పదుల వయసులోనూ వాళ్ల స్కిన్ మెరుస్తుంటుంది. అందం, ఆరోగ్యం విషయంలోనే కాదు.. ఇంకా చాలా విషయాల్లో జపనీయుల లైఫ్‌స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది.
అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ జపనీస్ సీక్రెట్ హ్యాబిట్స్ ఇవి...
ప్రపంచంలోని క్లీనెస్ట్ దేశాల్లో జపాన్ ఒకటి. పరిసరాలు మాత్రమే కాదు. వ్యక్తిగత శుభ్రతలోనూ ఆ దేశం ముందుంటుంది. శుభ్రతకు జపాన్ వాళ్లు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే.. అక్కడి కరెన్సీ నోట్ల మీద భూతద్దం పెట్టి వెతికినా మురికి కనిపించదు. షాప్స్, హోటల్స్, ట్యాక్సీల్లో కూడా డబ్బులు చేత్తో ముట్టుకుని తీసుకోరు. ప్రతిచోటా డబ్బు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఒక ట్రే ఉంటుంది. అందులోనే డబ్బు వేస్తారు. అలాగే జపాన్‌లో ‘షింటో’ అనే సంప్రదాయం ఉంటుంది. దీని ప్రకారం ఇతరులను కలిసే ముందు శరీరం, మనసు శుభ్రంగా ఉండాలనేది వాళ్ల నమ్మకం.
క్రమశిక్షణే కట్టుబాటు
డిసిప్లిన్ (క్రమశిక్షణ) విషయంలో జపాన్‌తో మరే దేశం పోటీ పడలేదు. ఈ దేశంలో ఎక్కడికెళ్లినా.. చెప్పులు, షూస్ బయటే వదిలి లోపలికి వెళ్తారు. షూస్ బయట వదలడం అనేది జపనీస్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యే రూల్. మన దగ్గర కూడా ఇంటి దగ్గర ఇదే పద్ధతి ఉంటుంది.
వెళ్లాల్సిన టైం కంటే పది నిముషాలు ముందే వెళ్లడం జపనీయుల్లో కనిపించే అలవాటు. అంతేకాదు జపాన్‌లో ట్రైన్ లేదా బస్ లాంటివి ఎక్కితే చాలా సైలెంట్‌గా ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో సైలెంట్‌గా ఉండాలన్న రూల్‌ను వాళ్లు పక్కాగా పాటిస్తారు.
అలాగే టికెట్ కౌంటర్ల ముందు ఎంత పొడవైన లైన్ ఉన్నా, ఎంత టైం పట్టినా వెయిట్ చేస్తారే తప్ప... లైన్ తప్పడం అనేది ఉండదు. 2011లో సునామీ, భూకంపం లాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఫుడ్, వాటర్ కోసం జపనీస్ ‘క్యూ’ పాటించారే తప్ప ఒకరిమీద ఒకరు పడిపోలేదు.
ఆహారం పరబ్రహ్మ స్వరూపం
జపాన్ వాళ్లు అంత హెల్దీగా ఉండడానికి వాళ్లు తీసుకునే ఆహారమే కారణం. జపాన్ వాతావరణం వేడిగా, తేమగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో ఆహారం తొందరగా పాడవుతుంది. అందుకని ఆహారం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటారు. ప్యాక్డ్ ఫుడ్ లేదా ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు. పులియబెట్టిన ఆహారాలు ఎక్కువగా తింటారు. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. గ్రీన్ టీని ఎక్కువగా వాడే దేశాల్లో జపాన్ ముందు ఉంటుంది. ఈ అలవాటు అక్కడ క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తోంది.
మిగిలిన దేశాలతో పోలిస్తే జపనీయులు ఎక్కువ సీ ఫుడ్ తింటారు. దానివల్ల కొలెస్ట్రాల్ వంటి చాలా రకాల సమస్యలు తగ్గుతాయి. అలాగే జపాన్ వాళ్లు తినేటప్పుడు కడుపు నిండా తినరు. పొట్టలో కాస్త గ్యాప్ ఉంచుకుంటారు. భోజనానికి వాడే ప్లేట్లు చిన్నగా ఉంటాయి. అందుకే ఆ దేశంలో ఒబెసిటీ తక్కువ. వీటన్నింటితో పాటు తినే ముందు ఆహారానికి నమస్కరిస్తారు.
అందం వెనుక..
జపాన్ వాళ్లు ఫుడ్ విషయంలో ‘ఇచిజూ శాన్‌శాయ్’ అనే విధానాన్ని ఫాలో అవుతారు. దాని ప్రకారం ప్రతి రోజు వాళ్లు తినే ఆహారాన్ని మూడు భాగాలుగా డివైడ్ చేస్తారు. మొదటి భాగంలో ప్రొటీన్లు, ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో టాక్సిన్స్ తక్కువగా తయారవుతాయి. రెండో భాగంలో చేపలు తప్పనిసరి. మూడో భాగంలో కూరలు, సలాడ్స్ ఉంటాయి. ఇలా తినటం వల్ల బ్యాలెన్స్‌డ్ డైట్ అందుతుంది. ఇది చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సాయపడుతుంది.
సాయంత్ర స్నానాలు
మనకు ఉదయం లేవగానే స్నానం చేయడం అలవాటు. కానీ, జపాన్‌లో మాత్రం రాత్రిళ్లు మాత్రమే స్నానం చేస్తారు. స్నానం అంటే... పిట్ట స్నానంలా చేయరు. స్నానాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. అంటే గజ స్నానంలా అన్నమాట. ఇలా స్నానం చేయడం జపాన్ ప్రాచీన సాంప్రదాయంలో భాగం. స్నానం చేసేటప్పుడు మొదట షవర్ నీళ్లతో శరీరంపై ఉండే దుమ్ము, ధూళి కడిగేస్తారు. బాత్‌టబ్‌లో 40 డిగ్రీల టెంపరేచర్ మించకుండా వేడినీటిని నింపుతారు. చర్మం ఆరోగ్యం కోసం నీళ్లలో కొన్ని హెర్బ్స్ కలుపుతారు. అలా అరగంట నుంచి యాభై నిముషాల పాటు స్నానం చేస్తూ పూర్తిగా రిలాక్స్ అవుతారు.
కకెబో టెక్నిక్‌తో డబ్బు ఆదా
డబ్బు ఆదా చేయడం కోసం జపాన్‌లో ‘కకెబో’ అనే పద్ధతిని వాడతారు. కకెబో అంటే ‘ఇంటి పద్దు పుస్తకం’. ఇందులో డబ్బుని.. అవసరాలు, కోరికలు, లక్ష్యాలు, ఎమర్జెన్సీ.. ఇలా కేటగిరీలుగా డివైడ్ చేసుకుంటారు. దాని ప్రకారమే డబ్బు సేవ్ చేస్తారు. ప్రతీ ఖర్చు, ఆదాయం... చేత్తో రాయడం వల్ల అవసర, అనవసర ఖర్చుల గురించి కచ్చితంగా తెలుస్తుంది. అనవసర ఖర్చు కంట్రోల్ చేసుకోవడం ఈజీ అవుతుంది.
ప్రకృతితో మమేకం
జపనీస్ రెండు వారాలకొకసారైనా ఫారెస్ట్ బేతింగ్ చేస్తారు. అంటే అడవుల్లో లాంగ్ వాక్ చేయడం అన్నమాట. దీంతోపాటు రోజూ ఉదయాన్నే తప్పకుండా కొంత వ్యాయామం చేస్తారు. పరుపులకు బదులు నేలపై పడుకోవడానికే ఇష్టపడతారు. ఇలా చేయడం వల్లే అక్కడి ప్రజలకు వెన్ను, నడుము నొప్పి లాంటివి తక్కువ.
జపనీస్.. అంత త్వరగా ‘నో’ చెప్పరు. ‘నో’ చెప్పాల్సి వచ్చినప్పుడు నిక్కచ్చిగా, ముఖం మీద గుద్దినట్టు చెప్పకుండా ఉండేందుకు మరింకేదైనా అవకాశం ఉందా అని ఆలోచిస్తారు. ఆ తరువాతే ‘నో’ చెప్తారు