72 వేల పైన సెన్సెక్స్‌‌

72 వేల పైన సెన్సెక్స్‌‌

ముంబై: సెన్సెక్స్ గురువారం 225 పాయింట్లకు పైగా లాభపడి 72 వేల మార్క్‌‌ను తిరిగి అందుకుంది. నిఫ్టీ 22 వేల లెవెల్‌‌కు చేరువయ్యింది. ఎం అండ్ ఎం, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌, ఎస్‌‌బీఐ వంటి ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లలో బయ్యింగ్ రావడంతో బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు పాజిటివ్‌‌గా ట్రేడయ్యాయి. వీటికి తోడు ఆటో, ఎనర్జీ, యుటిలిటీ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. సెన్సెక్‌‌ 228 పాయింట్ల (0.32 శాతం) లాభంతో 72,050 దగ్గర క్లోజయ్యింది.  నిఫ్టీ 71 పాయింట్లు పెరిగి 21,911 దగ్గర ముగిసింది. హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ షేర్లు 2 శాతం ర్యాలీ చేశాయి. గ్లోబల్ మార్కెట్‌‌లు పాజిటివ్‌‌గా ట్రేడవ్వడంతో  మన మార్కెట్‌‌ కూడా పెరిగిందని జియోజిత్‌‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. 

యూరో జోన్‌‌లో ఇన్‌‌ఫ్లేషన్‌‌ తగ్గడం, కంపెనీల రిజల్ట్స్ బాగుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడిందని అన్నారు. ఇన్వెస్టర్లు క్వాలిటీ లార్జ్‌‌ క్యాప్ షేర్లకు మొగ్గు చూపుతున్నారని,  స్మాల్‌‌, మిడ్‌‌ క్యాప్ షేర్లపై జాగ్రత్త పడుతున్నారని చెప్పారు. సెన్సెక్స్‌‌లో ఎం అండ్ ఎం, ఎన్‌‌టీపీసీ, పవర్ గ్రిడ్‌‌, ఎస్‌‌బీఐ, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌, ఏషియన్ పెయింట్స్‌‌, విప్రో షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్‌‌, ఐటీసీ, హిందుస్తాన్ యూనిలీవర్‌‌‌‌, నెస్లే ఇండియా, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి.  జపాన్‌‌, హాంకాంగ్‌‌ మార్కెట్‌‌లు లాభాల్లో,  సౌత్‌‌ కొరియా మార్కెట్ నష్టాల్లో ముగిశాయి. లూనార్‌‌‌‌ న్యూ ఇయర్ కావడంతో చైనీస్ మార్కెట్‌‌లకు హాలిడే. యూరోపియన్ మార్కెట్‌‌లు పాజిటివ్‌‌గా ట్రేడయ్యాయి.