
మందమర్రి, వెలుగు: దేశీయ బొగ్గుకు అనూహ్యంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను మరింత పెంచుకునే పనిలో పడింది. ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి వచ్చే ఓపెన్‌కాస్ట్ గనులపై ఆశలు పెట్టుకుంటోంది. ప్రస్తుతం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ నిర్దేశించుకున్న సింగరేణి మరోవైపు ఏటా ఉత్పత్తిని పెంచుకుంటూ రానున్న నాలుగేండ్ల కాలంలో 100 మిలియన్ టన్నులకు చేరుకోవడంపై దృష్టి సారించింది. 2022–-23ఆర్థిక సంవత్సరం చివరలో కొత్తగా నైనీ బ్లాక్, వికే 7 ఓసీపీలను అందుబాటులోకి తీసుకురానుంది. సింగరేణి ప్రస్తుతం 19 ఓసీపీలు, 23 అండర్గ్రౌండ్మైన్ల ద్వారా ఉత్పత్తి చేపడుతోంది. కొత్తగా ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌తో పాటు వీకే-7 ఓపెన్‌కాస్ట్ గనులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు నైనీకి సంబంధించిన అన్ని పనులూ పూర్తి చేసింది. వీకే -7 ఓసీపీకి సంబంధించిన పనులు వేగవంతం చేసేందుకు నిర్ణయించింది. వీటితోపాటు సింగరేణిలో మరికొన్ని కొత్త గనులను ప్రారంభించేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. మూసివేసిన అండర్గ్రౌండ్గనులను ఓసీపీలుగా మార్చి వాటి ద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచుకోవడానికి సింగరేణి ప్రణాళికలు చేస్తోంది.
నైనీ నుంచి 10 మిలియన్‌టన్నులు
సింగరేణి తొలిసారిగా మరో రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనుంది. తెలంగాణ కేంద్రంగా వందేళ్లకు పైగా బొగ్గు వెలికితీస్తున్న సంస్థ ఒడిశాలో ఓసీపీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ పొందింది. కేంద్ర ప్రభుత్వం ఒడిశా రాష్ట్రం అంగూల్ జిల్లా మహానది కోల్ఫీల్డ్స్పరిధిలోని నైనీ కోల్‌బ్లాక్‌ను కేటాయించగా 2015 ఆగస్టు 13న సింగరేణితో అగ్రిమెంట్ జరిగింది. గనిలో మొత్తం 9.12 చదరపు కిలోమీటర్ల పరిధిలో 340 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను గుర్తించింది. నైనీ కోల్‌బ్లాక్‌లో 20 నుంచి 30 మీటర్ల లోతులో బొగ్గు నిక్షేపాలుండటంతో టన్ను బొగ్గు ఉత్పత్తికి 2.58 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగిస్తే సరిపోతుంది. సింగరేణిలోని ప్రస్తుత ఓసీపీల్లో టన్ను బొగ్గు ఉత్పత్తికి 6 నుంచి 7 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి వస్తోంది. అందుకే నైనీ కోల్బ్లాక్సింగరేణికి లాభదాయకంగా మారనుంది. గని కోసం సేకరించిన 783.275 హెక్టార్ల అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలోని ఖమ్మం, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భూమిని కేటాయించనున్నారు. గని ఏర్పాటుకు అవసరమైన పర్మిషన్ల కోసం ఆరేండ్లుగా నిరీక్షించిన సంస్థకు తాజాగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ(ఎంఓఈఎఫ్) నుంచి ఎన్విరాన్మెంట్పర్మిషన్రావడంతో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఏటా 10 మిలియన్‌టన్నుల ఉత్పత్తి టార్గెట్పెట్టుకున్నారు. తక్కువ ఖర్చుతో వెలికితీసే చాన్స్ఉన్న నైనీ బొగ్గు బ్లాక్‌ను 40 ఏళ్ల పాటు నడపనుంది. ఇందులో 2,400 మంది పర్మినెంటు, కాంట్రాక్ట్ కార్మికులు పనిచేయనున్నారు. గనిలో ఉత్పత్తి చేసిన బొగ్గును రైలు మార్గం ద్వారా మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్‌పవర్ ప్లాంట్‌కు సరఫరా చేయనుంది.
ఇతర గనుల నుంచి...
శ్రీరాంపూర్ ఓసీపీ, భూపాలపల్లిలోని కేటీకే ఓసీ, కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్ ఓసీ -2 గనులకు సంబంధించి కొత్త ఓబీ కాంట్రాక్టులను సింగరేణి యాజమాన్యం ఖరారు చేసింది. బెల్లంపల్లిలో గతంలో మూసివేసిన గోలేటీ1,1ఏ అండర్ గ్రౌండ్ మైన్లు, బెల్లంపల్లి ఓసీపీ- 2 ఎక్స్టెన్షన్మైన్, అబ్బాపూర్ఓసీపీ ప్రాంతాలను కలిపి కొత్తగా గోలేటీ ఓసీపీగా చేసేందుకు గతనెల 20న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. అన్ని పర్మిషన్లు వస్తే గని నుంచి ఏటా 3.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనుంది. ఒడిశాలో కొత్తగా కేటాయించిన న్యూపాత్రిపాద బొగ్గు బ్లాక్‌కు సంబంధించిన ప్రక్రియ సాగుతోంది. సింగరేణికి చెందిన కోయగూడెం బ్లాకు-3, కేకే-6, శ్రావణపల్లి బ్లాకు, సత్తుపల్లి -3 గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ఇటీవల రెండుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. ఒక్క కోయగూడెం బ్లాకు-3కి మాత్రమే ఒకే ఒక టెండరు వచ్చింది. దీంతో ఈ గనిని ఆ సంస్థకు కేటాయిస్తారా లేదా అన్నది స్పష్టత లేదు. మిగితా మూడు బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయిస్తే బొగ్గు ఉత్పత్తి పెంచుకునే ఆస్కారం ఉంది. వీటి ద్వారా ఏటా 20 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి వచ్చే చాన్స్ఉంది.