దయనీయంగా కోయిల్​సాగర్​ పరిస్థితి

దయనీయంగా కోయిల్​సాగర్​ పరిస్థితి

మహబూబ్​నగర్, వెలుగు: ఎండలు ముదరడంతో మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్రలోని కోయిల్​సాగర్​ పరిస్థితి దయనీయంగా మారింది. మార్చి రెండో వారం నాటికి ప్రాజెక్టులో ఒక టీఎంసీ నీరు తగ్గిపోయింది. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్​ 411.33 కాగా, 407.34 మీటర్లకు పడిపోయింది. 2.277 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 0.96 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎఫ్ఆర్ఎల్​ కంటే దాదాపు నాలుగు మీటర్ల దిగువకు నీటిమట్టం పడిపోయింది. నిరుడు ఏప్రిల్​ ఒకటి నాటికి ప్రాజెక్టులో 2.01 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ఏడాది మార్చి రెండో వారంలోనే ప్రాజెక్టు సగం ఖాళీ కావడంతో ప్రాజెక్టు కింద పంటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చివరి ఆయకట్టు రైతులు సాగునీరు అందక తిప్పలు పడుతున్నారు. 

చివరి ఆయకట్టు రైతుల అరిగోస..

కోయిల్​సాగర్​ కింద 51 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కాల్వల సామర్థ్యం పెంచకపోవడంతో అధికారికంగా 23 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. నిరుడు యాసంగిలో రైట్​ మెయిన్​ కెనాల్​కు​రిపేర్లు చేయగా, డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువలు, తూములకు మరమ్మతులు చేయలేదు. లెఫ్ట్  మెయిన్​ కెనాల్​ కింద పనులు చేయాల్సి ఉంది. ఈ కెనాల్​ కింద పిల్ల కాల్వలు, తూములు అధ్వానంగా మారాయి. ఏండ్లుగా రిపేర్లు లేకపోవడంతో పూడిపోయాయి. దీంతో ఈ యాసంగిలో రెండు కెనాల్స్​ కింద 12 వేల ఎకరాలకు మించి నీరు అందడం లేదు. నిరుడు ఇదే పరిస్థితి ఉండడంతో వేలాది ఎకరాల్లో సాగు చేసిన వరి ఎండిపోయింది. రైట్  కెనాల్ పరిధిలోని మరికల్, లెఫ్ట్  కెనాల్ పరిధిలోని పర్దిపూర్, దమగ్నాపూర్, వడ్డేమాన్, చిన్నవడ్డేమాన్, ఏదులాపూర్ గ్రామాల్లోని మూడు వేల ఎకరాల చివరి ఆయకట్టులో సాగు చేసిన వరి దెబ్బతింటోంది. గత అనుభవాలను దృష్టిలో  పెట్టుకొని ప్రస్తుతం ఈ గ్రామాల్లో కొందరు రైతులు పొలాలను పడావుగా వదిలేశారు.

అసంపూర్తిగా పనులు..

ప్రాజెక్టు లెఫ్ట్  మెయిన్​ కెనాల్​ కింద 1,400 స్ట్రక్చర్లను నిర్మించాల్సి ఉంది. పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్స్, సబ్​ మైనర్స్​ పనులు చేయాల్సి ఉంది. పాత కెనాల్​ 14.2 కిలోమీటర్ల వరకే ఉండగా, ఆయకట్టు పెంచడంతో ఈ కెనాల్​ను 30.3 కిలోమీటర్ల వరకు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం 28.3 కిలోమీటర్ల వరకే పనులు జరిగాయి. కాంట్రాక్టర్​ చేతులెత్తేయడంతో మిగిలిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ పనులు పూర్తి చేసేందుకు రూ.75.68 కోట్లతో ప్రపోజల్స్​ పంపగా, పర్మిషన్లు రావాల్సి ఉంది. 

10 రోజులకోసారి నీటి విడుదల..

వారబందీపై ఆఫీసర్లు రైతులకు సమాచారం ఇవ్వట్లేదు. నిరుడు ఐడీబీ సమావేశం నిర్వహించకుండానే కెనాల్స్​కు నీటి సప్లై చేయగా, ఎప్పుడు నీటి విడుదల చేస్తారో తెలియక రైతులు ఇబ్బంది పడ్డారు. ఈసారి కూడా సమావేశం నిర్వహించకుండానే జనవరిలో 15 రోజులకోసారి సాగునీటిని అందించారు. వరి నాట్ల దశలో ఉండడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో పది రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారు. 
ఈ సీజన్​లో రైతులు ప్రాజెక్టు కింద వరి నాట్లను ఆలస్యంగా వేశారు. ఏప్రిల్​ చివరి నాటికి పంటలు చేతికొచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు పంటలకు నీరు అవసరం కానుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు మార్చి నెలలో సగం ఖాళీ కావడం ఆందోళన కలిగిస్తోంది.

పంటలు ఎండిపోతయ్..

మా ఏరియాకు కోయిల్​సాగర్​ కాల్వ ఉంది. కానీ, నీళ్లు రావు. ఊరిపక్కనే చెరువు ఉంది. ఆ చెరువును కూడా కోయిల్​సాగర్​ నీటితో నింపట్లేదు. మా పొలాలకు మరో నెల వరకు నీళ్లు అవసరం ఉంది. నీళ్లు రాకుంటే.. వచ్చే నెల ఈ టైం వరకు పంటలు మొత్తం ఎండిపోతాయి.

- తెలుగు వెంకటేశ్, రైతు, పర్దిపురం, చిన్నచింతకుంట

పాత ఆయకట్టుకే నీళ్లు

ప్రాజెక్టు మొత్తం ఆయకట్టుకు నీరు ఇవ్వడం సాధ్యం కాదు. నీటి నిల్వలను బట్టి పంటలకు నీటిని విడుదల చేస్తున్నాం. ఈ సీజన్​లో పాత ఆయకట్టు 12 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నాం. 

- ప్రతాప్​సింగ్, ఈఈ, కోయిల్​సాగర్