పార్టీలు మారడంతో ..జాతకాలు తారుమారు

పార్టీలు మారడంతో ..జాతకాలు తారుమారు
  •     బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరిన వారిలో  సంబురం
  •     పదేళ్లుగా బీఆర్‌‌‌‌ఎస్‌‌ను నమ్ముకున్న నేతల్లో నైరాశ్యం

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతల జాతకాలను తారుమారు చేశాయి. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ మూడోసారి అధికారంలోకి వస్తే తప్పక పదవులు వస్తాయని భావించిన బీఆర్ఎస్ నేతల ఆశలు గల్లంతయ్యాయి. జిల్లా కాంగ్రెస్​ నాయకత్వం మీద తిరుగుబాటు చేసి చివరి నిమిషంలో బీఆర్ఎస్​లో చేరిన నేతల పరిస్థితి అయితే మరింత ఆగమ్యగోచరంగా మారింది.  అదే బీఆర్ఎస్​ హైకమాండ్​పై నమ్మ కం లేక చివరి నిమిషంలో కాంగ్రెస్​లో చేరిన నాయకులు మాత్రం తెగ సంబరపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో  ఐదేళ్ల వరకు తమకు తిరుగులేదని వారు భావిస్తున్నారు. 

పదేళ్ల నుంచి పదవుల కోసం పాకులాట

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు బీఆర్ఎస్​ పార్టీలో  తమకు తప్పక పదవి వస్తదని నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా నల్గొండలో చకిలం అనిల్​కుమార్, చాడ కిషన్​ రెడ్డి, కోదాడలో కన్మంత శశిధర్​ రెడ్డి, ఆలేరులో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్​, చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి బీఆర్​ఎస్​లో చేరిన డాక్టర్​ చెరుకు సుధాకర్​, భువనగిరిలో జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి నేతలు అనేక మంది  పదవుల కోసం పదేళ్ల నుంచి పాకులాడుతున్నారు. ఇందులో జిట్టా బాలకృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్​ సొంతంగా పార్టీలు స్థాపించి, చివరకు కాంగ్రెస్​లో విలీనం చేశారు.

అయితే తమకు ఆశించిన ప్రయోజనం పార్టీలో దక్కలేదన్న కోపంతో బీఆర్ఎస్​లో చేరారు. ఇక 2009లో ఆలేరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బూడిద భిక్షమయ్యగౌడ్​ బీఆర్​ఎస్​ నుంచి బీజేపీలోకి, తిరిగి మళ్లీ బీఆర్​ఎస్​లో చేరారు. మూడోసారి ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీ పదవి వస్తదని ఆశించారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​ రెడ్డి మీద తిరుగుబాటు చేసిన అనిల్​ కుమార్​, చాడ కిషన్​ రెడ్డి, హైకమాండ్ బుజ్జగించడంతో దారికొచ్చారు.

అధికారంలోకి వస్తే నామినేటెడ్​ పదవులు ఇస్తామని కేటీఆర్​హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్​లో కొనసాగారు. చివరి వరకు కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమైన కన్మంత శశిధర్​ రెడ్డి కూడా హైకమాండ్ జోక్యం చేసుకోవడంతో సైలెంట్ అయ్యారు. కానీ ఎన్నికల ఫలితాలు వీరిని నట్టేట ముంచాయి. 

వలసొచ్చిన నేతలకు కలిసొచ్చిన కాలం...

బీఆర్​ఎస్ హైకమాండ్​ పెద్దలు పదవులు ఇస్తామని ఆశపెట్టి చివరకు మోసపోయిన సీనియర్లు కాంగ్రెస్​లో చేరడం కలిసొచ్చింది. ముఖ్యంగా భువనగిరిలో కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి సీఎం కేసీఆర్​ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరిన కొద్దిరోజులకే మళ్లీ కాంగ్రెస్‌‌లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తుంగతుర్తిలో మందుల సామెల్ బీఆర్ఎస్‌కు  రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

నకిరేకల్​లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి రెండోసారి ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ దక్కింది. మండలి మాజీ డిప్యూటీ చైర్మన్​ నేతి విద్యాసాగర్​, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మునుగోడు, నల్గొండలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు హుజూర్​నగర్​, దేవరకొండ, నాగార్జునసాగర్​లో మున్సిపల్​ చైర్మన్​లు, కౌన్సిలర్లు, వైస్​ చైర్మన్లు గంప గుత్తగా కాంగ్రెస్​లో చేరారు. 

త్వరలో మరికొందరు ముఖ్యనేతలు కాంగ్రెస్ గూటికి..

త్వరలో మరికొంత మంది బీఆర్​ఎస్ ముఖ్యనేతలు కాంగ్రెస్​ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలకు 20 రోజుల ముందుగానే పార్టీలో చేరాలని భావించారు. కానీ,  బీఆర్ఎస్​లో ఉన్నత పదవులు అడ్డువస్తాయని ఆగిపోయారు. ఈ ఎన్నికల్లో పరోక్షంగా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు వారు దోహదపడినట్టు తెలిసింది.

గతంలో కాంగ్రెస్​ నుంచి బీఆర్​ఎస్​లో చేరిన వారే మళ్లీ సొంత గూటికి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు తెర వెనక గ ట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు సమాచారం. నల్గొండ, నకిరేకల్​, మిర్యాలగూడ, నాగార్జునసాగర్​, దేవరకొండ బీఆర్​ఎస్​లో ముఖ్యనేతలు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి.