‘బీసీ ఎమ్మెల్యే’ నినాదం తెరపైకి

‘బీసీ ఎమ్మెల్యే’ నినాదం తెరపైకి
  • మెజారిటీ ఓటర్లను ఆదరించని పార్టీలు
  • పార్టీలకతీతంగా ఏకవుతున్న బీసీ లీడర్లు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల నియోజకవర్గంలో ‘బీసీ ఎమ్మెల్యే’ నినాదం తెరపైకి వస్తోంది. నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు బీసీలే ఉన్నప్పటికీ ఏండ్ల నుంచీ వారికి రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తిలో ఉన్నారు. దీంతో ఈసారైనా ఏకమై బీసీ ఎమ్మెల్యేను ఎన్నుకొనేందుకు బీఆర్​ఎస్​తో పాటు ఇతర పార్టీల నుంచి బీసీ నాయకులు సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఆయా పార్టీల నుంచి పోటీ చేసే  అగ్రకుల నాయకులను ఓడిస్తామని తేల్చి చెబుతున్నారు. 

డెబ్బై ఏండ్లలో ఒక్కడే బీసీ ఎమ్మెల్యే..

1952 నుంచి లక్సెట్టిపేట నియోజకవర్గం ఉండగా.. ప్రస్తుత మంచిర్యాల నియోజకవర్గం 2009 లో ఏర్పడింది. 1978లో మాత్రమే బీసీ సామాజిక వర్గానికి చెందిన చుంచు లక్ష్మయ్య జనతాపార్టీ నుంచి గెలుపొందారు. లక్సెట్టిపేట నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఒకట్రెండు సామాజిక వర్గాల లీడర్లే ఎమ్మెల్యేలయ్యారు. ప్రతి ఎన్నికలోనూ వెలమలు, రెడ్లు ఎన్నికయ్యారు. స్థానికంగా బీసీ ఓటర్ల కీలకంగా ఉన్నప్పటికీ రెండు సామాజిక వర్గాల నాయకులే ఎన్నికవ్వడం పై ప్రస్తుతం బీసీ నాయకులు గుర్రుగా ఉన్నారు. రాజకీయ పార్టీలు తమను చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో బీసీలకే టికెట్లు ఇవ్వాలనే డిమాండ్​తో పార్టీలకు అతీతంగా లీడర్లు ఏకమవుతున్నారు. నెలన్నర కిందట బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన బీసీ లీడర్లు మంచిర్యాలలో రహస్యంగా మీటింగ్​ పెట్టుకున్నారు. ఇటీవల బీసీ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్​ టేబుల్​ మీటింగ్​ నిర్వహించారు. 

బీసీలకే టికెట్టు ఇవ్వాలని!

జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్​ నియోజకవర్గాలు ఉన్నాయి. బెల్లంపల్లి, చెన్నూర్​ ఎస్సీ రిజర్వుడ్​ కాగా, మంచిర్యాల జనరల్‌‌ కేటగిరీ కింద ఉంది. పై రెండు నియోజకవర్గాల నుంచి అవకాశాలు లేకపోవడం, బీసీల సంఖ్య అధికంగా ఉండడంతో మంచిర్యాల నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించాలనే పట్టుదలతో ఉన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కలిసికట్టుగా ఉండి టికెట్‌‌ సాధించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

2018లోనూ బీసీ నినాదం

2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ నినాదం తెరపైకి వచ్చింది. అన్ని పార్టీలు బీసీలకే టికెట్లు ఇవ్వాలంటూ నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించారు. ప్రత్యేక కమిటీలు వేసుకుని బీసీలకే మద్దతు ఇవ్వాలంటూ తీర్మానాలు కూడా చేశారు. తీరా ఎన్నికల సమయం దగ్గరపడ్డ కొద్దీ బీసీ నినాదం మరుగునపడింది

బీసీ ఓటర్లే కీలకం

మంచిర్యాల నియోజకవర్గంలో 2.42 లక్షల మం ది ఓటర్లకు గాను సుమారు 1.65 లక్షల మంది బీసీలు ఉన్నారు. ఎస్సీల ఓట్లు దాదాపు 55 వేలు ఉండగా, 15 వేలు ఎస్టీలు, మరో 15 వేలు క్రిస్టి యన్​ ఓటర్లున్నారు. నియోజకవర్గంలో రెడ్డి ఓటర్లు సుమారు 6వేలు కాగా, వెలమల ఓట్లు 2వేలు ఉన్నట్టు అంచనా. కాగా, ఒక ప్రధాన జాతీయ పార్టీ ఈసారి బీసీల వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. సామాజిక సమీకరణాల్లో భాగంగా మంచిర్యాల నుంచి బీసీని బరిలో నిలిపితే ఎట్లా ఉంటుందన్న విషయమై సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది.

అగ్రవర్ణాలకు టికెట్లు ఇస్తే ఓడిస్తాం

 అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలను అన్ని రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయి. బీసీ కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి. 50 శాతం టికెట్లు బీసీలకు కేటాయించాలి. మంచిర్యాలలో 70 ఏండ్లలో 65 సంవత్సరాలు అగ్రవర్ణాలకే టికెట్లు ఇచ్చారు. బీసీల ఓట్లతో గెలిచిన నాయకులు బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఈసారి బీసీలకు కాకుండా అగ్రవర్ణాలకు టికెట్లు ఇస్తే అందరం కలిసికట్టుగా ఓడిస్తాం. 

- డాక్టర్​ నీలకంఠేశ్వర్​రావు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు

గత 70 ఏండ్లలో ఎన్నికైన బీసీ ఏతర ఎమ్మెల్యేలు 

 1952 ద్విసభ నియోజకవర్గం నుంచి కోదాటి రాయమల్లు, విశ్వనాథరావు 
 1957, -1962 : జీవీ.పితాంబర్‌‌రావు 
 1967, 1972 : జేవీ.నర్సింగరావు 
 1983 : మురళీమనోహర్‌‌రావు 
 1985, 1989 : జీవీ.సుధాకర్‌‌రావు 
 1994 : గోనె హన్మంతరావు 
 1999, 2004 : నడిపెల్లి దివాకర్​రావు 
 2009, 2010 : గడ్డం అరవిందరెడ్డి 
 2014, 2018 : నడిపెల్లి దివాకర్‌‌రావు 
గత ఎన్నికల్లో పలువురు బీసీ నాయ కులు పోటీ చేసినప్పటికీ ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచినా.. ఓటమి చవిచూశారు.