
- యోనోతో భారీగా పెరిగిన లాభం
- గ్లోబల్ టాప్ 100 కంపెనీల్లో చోటు
- రూరల్ ఏరియాల్లోనూ పెరుగుతున్న ఆన్‌లైన్ బ్యాంకింగ్
- సరిగ్గా వాడని బ్రాంచులు, ఏటీఎంలను తొలగిస్తే బ్యాంక్ ఆపరేటింగ్ ఖర్చులు మరింత దిగొస్తాయని ఎనలిస్టుల సలహా
- ఎస్‌బీఐ పీబీ రేషియో 1.4
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అదరగొట్టింది. సుమారు 9.2 బిలియన్ డాలర్ల (రూ.79 వేల కోట్ల) నికర లాభాన్ని సాధించింది. నికర లాభం ప్రకారం, గ్లోబల్ టాప్ 100 కంపెనీల్లో చోటు దక్కించుకుంది. ఇండియా నుంచి అత్యధిక లాభాన్ని సాధించిన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ తర్వాత మూడో స్థానం పొందింది. ఎస్‌బీఐకి డిజిటల్ యూజర్ల నుంచి ఎక్కువ రెవెన్యూ వచ్చిందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ బ్యాంక్ ప్రాఫిట్ భారీగా పెరగడానికి కారణం యోనోనని అన్నారు. యోనో ప్లాట్‌ఫామ్‌ను 2017 నవంబర్‌లో లాంచ్ చేశారు. ఆన్‌లైన్‌లో లోన్లు, అకౌంట్స్ ఓపెన్ చేయడం వంటి వివిధ సర్వీస్‌లను యోనో ద్వారా ఎస్‌బీఐ అందిస్తోంది. ప్రస్తుతం యోనోకు 7.4 కోట్ల రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇప్పటివరకు రూ.3.2 లక్షల కోట్ల విలువైన లోన్లను ఇచ్చింది. ఇందులో రిటైల్ లోన్లు ఎక్కువగా ఉన్నాయి. రోజూ కోటి లాగిన్స్ దాటుతుండగా, ఎస్‌బీఐకి చెందిన 65 శాతం సేవింగ్స్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ యోనో ద్వారా జరుగుతున్నాయి. యోనో ద్వారా యూజర్స్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇన్సూరెన్స్ కొనొచ్చు, ఆన్‌లైన్ షాపింగ్ చేయొచ్చు, ట్రావెల్ బుక్ చేయొచ్చు, లోన్స్‌కు అప్లై చేయొచ్చు, గవర్నమెంట్ సర్వీసెస్‌ను కూడా పొందొచ్చు. ఈ ఆల్- ఇన్ -వన్ స్ట్రాటజీతో ఎస్‌బీఐ బాగా లాభపడుతోంది.
హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ కంటే ఎస్‌బీఐ షేర్లు చౌకే
“ఎస్‌బీఐ సుమారు 50 కోట్ల అకౌంట్స్‌కు సర్వీస్‌లు అందిస్తోంది. కస్టమర్ బేస్ పరంగా ఇది వరల్డ్‌లోనే అతిపెద్ద బ్యాంక్. కానీ వీటిలో కేవలం 7.4 కోట్లు (సుమారు 14 శాతం) మాత్రమే యోనో యూజర్లు. ఎస్‌బీఐ ప్రాఫిట్స్‌లో ఎక్కువ భాగం చిన్న డిజిటల్ గ్రూప్ నుంచి వస్తోంది. మిగిలిన 37 కోట్ల అకౌంట్లు ‘లో -మార్జిన్, హై-కాస్ట్ లయబిలిటీ’ సర్వీస్ సెగ్మెంట్‌కు చెందినవి ” అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) మాజీ డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ పేర్కొన్నారు. పనిచేయని, తక్కువ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్స్, ప్రభుత్వ స్కీమ్‌ల కింద ఓపెన్ అయిన అకౌంట్లతో ఎస్‌బీఐకి ఆపరేటింగ్ కాస్ట్ పెరుగుతోందన్నారు. గ్రామాల్లో కూడా ప్రజలు ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ద్వారా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్‌బీఐ తన ఫిజికల్ బ్రాంచులను రూరల్ ఏరియాల్లో ఆపరేట్ చేయడంపై మరోసారి పరిశీలించాలని శ్రీవాస్తవ సలహా ఇచ్చారు. “రికార్డ్ లెవెల్లో లాభం పొందినప్పటికీ, ఎస్‌బీఐ ప్రైస్- టు- బుక్ (పీ/బీ) రేషియో 1.4 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులతో పోలిస్తే ఇది తక్కువ. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (2.8), ఐసీఐసీఐ బ్యాంక్ (3.3) మార్కెట్ వాల్యూయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి” అని ఆయన చెప్పారు. వీటి ఆపరేటింగ్ కాస్ట్ తక్కువగా ఉండడమే కారణమని అన్నారు. యోనోపై ఎస్‌బీఐ మరింత ఫోకస్ పెట్టాలని సలహా ఇచ్చారు. సరిగ్గా వాడని బ్రాంచులు, ఏటీఎంలను ఆపేయాలని అన్నారు.
ఎస్‌బీఐ ఎఫ్‌డీలపై తగ్గిన వడ్డీ
ఎస్‌బీఐ తన అన్ని టెనార్ల (కాలపరిమితి గల) ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీల) పై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ నెల16 నుంచి సవరించిన రేట్లను పరిగణనలోకి తీసుకుంటారు. 2 –3 ఏళ్ల మధ్య టెనార్ కోసం ఎఫ్‌డీ చేసినవారికి గరిష్టంగా 6.7 శాతం వడ్డీ అందుతుంది. ఆ తర్వాత 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల మధ్య టెనార్ కోసం చేసిన డిపాజిట్లపై గరిష్టంగా 6.55 శాతం వడ్డీ ఇస్తారు. అయితే ఒక ఏడాది నుంచి 2 ఏళ్ల కాల పరిమితి గల ఎఫ్‌డీలకు 6.5 శాతం వడ్డీ ఉంటుంది. “అమృత్ వృష్టి” (444 రోజులు) వంటి నిర్ధిష్ట కాలపరిమితి కోసం తెచ్చిన ఎఫ్‌డీ స్కీమ్‌లపై కూడా వడ్డీ రేటు తగ్గింది. ఇటువంటి ఎఫ్‌డీలపై వడ్డీ 7.05 శాతం నుంచి 6.85 శాతానికి సవరించారు. గత నెలలో ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఎస్‌బీఐ డిపాజిట్ రేట్లకు 10-25 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది.