ఉత్తరాదిలో ఆగని మంచు బీభత్సం

ఉత్తరాదిలో ఆగని మంచు బీభత్సం

న్యూఢిల్లీ: ఉత్తరాదిలో మంచు బీభత్సం కొనసాగుతోంది. హిల్​ స్టేట్స్​లో భారీగా మంచు కురుస్తోంది. మంచుకుతోడు వర్షం కూడా పడుతోంది. దీంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన మంచు కారణంగా చాలా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లన్నీ మూతపడ్డాయి. విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. 

నిలిచిపోయిన శిథిలాల తొలగింపు

ఉత్తరాఖండ్​లో మంచుకుతోడు వర్షం కూడా పడుతుండటంతో జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జోషిమఠ్​లో తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. మంచు, చలికి తట్టుకోలేకపోతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జోషిమఠ్​లో శిథిలమైన భవనాల తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్లీ శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. జోషిమఠ్​లోనే కాకుండా సముద్రమట్టానికి 6 వేల అడుగుల ఎత్తులో ఉన్న చమోలీ, రుద్రప్రయాగ జిల్లాల్లో భారీగా మంచు కురుస్తోందని అంటున్నారు.

శ్రీనగర్​, జమ్మూ నేషనల్​ హైవే మూత

జమ్మూకాశ్మీర్​లో కూడా మళ్లీ మంచుకురవడం మొదలైంది. రోడ్లపై భారీగా మంచు పేరుకుపోవడంతో శ్రీనగర్​, జమ్మూ నేషనల్​ హైవే మూత పడింది. పొగ మంచు కారణంగా కాశ్మీర్​లోయలో విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. టూరిస్ట్​ స్పాట్స్​ అయిన పహల్గావ్, గుల్మార్గ్, అనంతనాగ్, కుల్గామ్, సోఫియాన్, పుల్వామా, బుడ్గామ్, కుప్వారా, శ్రీనగర్​ తదితర ప్రాంతాలన్నీ మంచులో కూరుకుపోయాయి. గుల్మార్గ్​లో మైనస్​ 7.6 డిగ్రీలు, అమర్​నాథ్​ యాత్రకు బేస్​ క్యాంప్​గా ఉపయోగించే పహల్గావ్​లో మైనస్​ 2.9, కుప్వారాలో మైనస్ 1.5, శ్రీనగర్​లో మైనస్ 0.1 డిగ్రీల మినిమం టెంపరేచర్​ నమోదైంది. జమ్మూకాశ్మీర్​లో మరో వారం రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక హిమాచల్​ ప్రదేశ్​లో 278 రోడ్లు మంచు, పొగ మంచు కారణంగా మూతపడ్డాయి. 

పెరుగుతున్న మినిమం టెంపరేచర్లు

ఢిల్లీలో 10.6 డిగ్రీల మినిమం టెంపరేచర్​ నమోదైంది. హర్యానా, పంజాబ్​ సహా పలు రాష్ట్రాల్లోని మైదాన ప్రాంతాల్లో మినిమం టెంపరేచర్లు క్రమంగా పెరుగుతున్నాయి. హర్యానాలోని నర్నవుల్​లో 7.5 డిగ్రీలు, హిస్సార్​లో 9.1, సిర్సాలో 9.2, కర్నాల్​లో 9.7, అంబాలాలో 10 డిగ్రీల మినిమం టెంపరేచర్లు రికార్డయ్యాయి. పంజాబ్​లోని భటిండాలో 7 డిగ్రీలు, పటియాలా 8.6, మొహలీ 9.4, ఫరీద్​కోట్​ 9.5, అమృత్​సర్, లూథియానాల్లో 10 డిగ్రీలు చొప్పున మినిమం టెంపరేచర్లు నమోదయ్యాయి.