ఓ యువత మేలుకో.. ఓటుందో లేదో తెలుసుకో!

ఓ యువత మేలుకో..  ఓటుందో లేదో తెలుసుకో!
  • ఓ యువత మేలుకో..  ఓటుందో లేదో తెలుసుకో!
  • ఓటు హక్కుపై ఆకట్టుకుంటున్న మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ పాట

మంచిర్యాల, వెలుగు : 

‘‘రండి రండి దండేపల్లి అన్నల్లారా..
ఓటేద్దాం బెల్లంపల్లి తమ్ముల్లారా..
కదిలిరండి చెన్నూరు చెల్లెల్లారా..
మనసున్నా మంచిర్యాల అక్కల్లారా..
పద్దెనిమి ఏండ్లు నిండిన ప్రతివాళ్లందరు..
ఓటుహక్కు దారులని తెలుసుకో తమ్ముడా..’’ అంటూ మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) బి.రాహుల్ ఓటు హక్కుపై రాసిన పాట ఆకట్టుకుంటున్నది. ఓటరు జాబితాలో పేరు నమోదు, ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడానికి ఆయన ఈ పాటను రాశారు. ‘‘ఓ యువత నువ్ మేలుకో.. ఓటుందో లేదో తెలుసుకో.. లేకుంటే నమోదు చేసుకో.. 
రాజ్యాంగపు హక్కులు సాధించి 
పొందడానికి.. ఓటే మన జన్మహక్కు తెలుసుకో తమ్ముడా’’ అంటూ సాగిన చరణం యువతలో చైతన్యాన్ని పెంచుతోంది. 
‘‘కులమత భేదాలు లేవు ఓటు వేయడానికి..
ధనవంతులు బీద వాళ్లు అందరూ సమానులే..
ధనము అపోహల మధ్య మనీ ఆశించకుండా..
మనస్సాక్షిగా మనం ఓటేద్దాం తమ్ముడా’’ అంటూ ఓటుకు కులమత బేధాలు, తారతమ్యాలు లేవని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. 
అలాగే ‘‘నా ఒక్క ఓటుతో ఏమి మారుతుంది అనుకోకు.. మీరేసే ప్రతి ఓటు రేపటి మార్పు కొరకు.. చేయి కలుపు ఓటు వేయడానికి..
జాతీయ ఓటరు పండుగ నిండుగా చేద్దాం’’ అంటూ ఓటు ప్రాధాన్యతను చాటారు. 
రాహుల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ 
అయినప్పటికీ తెలుగు భాషపై ఆయనకు ఎంతటి మమకారం ఉందో ఈ పాట ద్వారా అర్థమవుతోంది. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ డ్రైవర్ రాజన్న ఈ గీతాన్ని పాడగా, ఆయన టీమ్ మ్యూజిక్‌‌‌‌‌‌ను అందించింది. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌తో పాటు ఉన్నతాధికారులు రాహుల్, రాజన్నను అభినందించారు. ప్రస్తుతం ఈ పాట జిల్లాలో మారుమోగుతోంది.