కొలంబో వీధుల్లో బలగాల గస్తీ

కొలంబో వీధుల్లో బలగాల గస్తీ

కొలంబో: హింసాత్మకంగా మారిన నిరసనలను అణిచేయడానికి శ్రీలంక ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా  కర్ఫ్యూను పొడిగించింది. రాజధాని కొలంబోలో ఆర్మీ బలగాలను దించింది. అల్లర్లు జరగకుండా వీధుల్లో సైనికులు గస్తీ నిర్వహిస్తోంది. సామాన్యుల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. మాజీ ప్రధాని మహింద మద్దతుదారులు దాడి చేయడంతో నిరసనకారులు రెచ్చిపోయారు. మంత్రులు, ఎంపీలు, రాజకీయ నేతల ఇండ్లపై దాడులు చేసి, వాహనాలు, ఇండ్లు తగలబెట్టారు. దీంతో నిరసనలను అణిచేయడానికి ఆర్మీకి, పోలీసులకు రక్షణ శాఖ ఎమర్జెన్సీ పవర్స్ కట్టబెట్టింది. వారెంట్​ లేకుండా ఎవరినైనా అదుపులోకి తీసుకునే అధికారమిచ్చింది. మరోవైపు, ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రధాని చీఫ్​ సెక్యూరిటీ ఆఫీసర్​కు నోటీసులు పంపి, ఆయన స్టేట్​మెంట్​ తీసుకున్నారు. మరోవైపు, ప్రధాని పదవికి మహింద రాజీనామా చేయడంతో ఆయన కేబినెట్​ కూడా రద్దయింది. దీంతో దేశం సైనిక పాలనలోకి వెళుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని రక్షణ శాఖ సెక్రెటరి గుణరత్నె కొట్టిపారేశారు. తర్వాతి ప్రధాని కోసం ప్రెసిడెంట్​ గోటబయ రాజపక్స ప్రతిపక్ష నేతలతో చర్చలు జరుపుతున్నారని చెప్పారు.