థామస్‌ కప్‌ నెగ్గిన ఇండియా

థామస్‌ కప్‌ నెగ్గిన ఇండియా

థామస్‌‌‌‌ కప్‌‌. మెన్స్‌‌ బ్యాడ్మింటన్‌‌ టీమ్‌‌ ఈవెంట్లలో వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌. 73 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ మెగా టోర్నీలో ఇండియా 47 ఏండ్ల కిందట సెమీఫైనల్‌‌ చేరడమే బెస్ట్‌‌ పెర్ఫామెన్స్‌‌. ఇప్పటిదాకా మనకు ఒక్క పతకం కూడా రాలేదు..! ఈసారి పతకం వస్తుందన్న అంచనాలు లేవు..! కనీసం కాంస్యం సాధించినా గొప్ప ఘనతే అనుకుంటే.. మన కుర్రాళ్లు ఏకంగా ‘ స్వర్ణ చరిత్ర’ సృష్టించారు..! దేశ బ్యాడ్మింటన్‌‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు..! క్వార్టర్‌‌ ఫైనల్లో నాలుగుసార్లు విజేత మలేసియాకు ముకుతాడు వేసి.. సెమీఫైనల్లో వరల్డ్‌‌ టాప్‌‌ ప్లేయర్లతో కూడిన డెన్మార్క్‌‌కు చెక్‌‌ పెట్టిన కిడాంబి శ్రీకాంత్‌‌ నేతృత్వంలోని టీమిండియా.. ఫైనల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 సార్లు విజేతగా నిలిచిన ఇండోనేసియాను మట్టికరిపించింది. థామస్‌‌ కప్‌‌ను హస్తగతం చేసుకొని.. మన త్రివర్ణాన్ని రెపరెపలాడించింది. 

ఇంత గొప్ప ఘనత సాధించిన  ఇండియా జట్టులో శ్రీకాంత్‌‌ సహా నలుగురు తెలుగు ఆటగాళ్లు ఉండటం మరింత ప్రత్యేకం. 

బ్యాంకాక్‌‌‌‌: అంచనాలను తలకిందులు చేస్తూ.. సంచలన ఆటతో దూసుకెళ్లిన ఇండియా మెన్స్‌‌ బ్యాడ్మింటన్ టీమ్‌‌ థామస్‌‌ కప్‌‌లో జగజ్జేతగా నిలిచింది. ఫైనల్‌‌ చేరిన తొలిసారే కప్పు కైవసం చేసుకుంది. క్వార్టర్‌‌ ఫైనల్స్‌‌, సెమీఫైనల్స్‌‌ను మించిన ఆటను చూపెడుతూ ఆదివారం జరిగిన ఫైనల్లో 3–0తో ఇండోనేసియాను చిత్తుగా ఓడించింది.  కిడాంబి శ్రీకాంత్‌‌, లక్ష్యసేన్‌‌ డబుల్స్‌‌ ప్లేయర్లు సాత్విక్‌‌ సాయిరాజ్‌‌, చిరాగ్‌‌ షెట్టి సత్తా చాటడంతో మరో రెండు మ్యాచ్‌‌లు అవసరం లేకుండానే  21వ సారి ఫైనల్‌‌ ఆడుతున్న ఇండోనేసియాపై ఇండియా సులువుగా గెలిచింది.  కప్పు నెగ్గిన టీమ్‌‌లో వీరితో పాటు హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌, ప్రియాన్షు రావత్‌‌, ఎంఆర్‌‌ అర్జున్‌‌, ధ్రువ్‌‌ కపిల తెలుగు ప్లేయర్లు గరగ కృష్ణప్రసాద్‌‌, పంజాల విష్ణువర్దన్‌‌ గౌడ్‌‌ కూడా ఉన్నారు. ఈ టోర్నీలో ఆడిన ప్రతీ మ్యాచ్‌‌లోనూ  శ్రీకాంత్, ప్రణయ్ గెలవగా... డబుల్స్ జోడీ సాత్విక్, చిరాగ్ ఆరు మ్యాచ్ ల్లో ఐదింటిలో  గెలిచి సత్తా చాటింది. 

సేన్‌‌ ఆరంభం.. 

క్వార్టర్స్‌‌, సెమీస్‌‌లో నిరాశ పరిచిన యంగ్‌‌ సెన్సేషన్‌‌ లక్ష్యసేన్​ ఫైనల్లో మాత్రం ఇండియాకు అద్భుత ఆరంభం అందించాడు. తొలి సింగిల్స్‌‌లో సేన్‌‌ 8–21, 21–17, 21–16తో  ప్రపంచ ఐదో ర్యాంకర్‌‌ ఆంథోని సినిసుకను ఓడించాడు. ఈ మ్యాచ్‌‌ మొదటి గేమ్​ కోల్పోయిన సేన్‌‌ తడబడ్డాడు. అయినా, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వెంటనే పుంజుకున్నాడు. కోర్టు మారిన తర్వాత ఆటను మెరుగు పరుచుకున్న అతను సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ ప్రత్యర్థి తప్పులు చేసే వరకు వేచి చూసి ఫలితం రాబట్టాడు. రెండో గేమ్‌‌లో బ్రేక్‌‌ టైమ్‌‌కు 11–7తో ఆధిక్యంలో నిలిచాడు. గింటింగ్‌‌ ఎదురుదాడికి దిగి 11–12తో రేసులోకి వచ్చినా.. మరోసారి టాప్‌‌ గేర్‌‌లోకి వచ్చిన లక్ష్య గేమ్‌‌ నెగ్గి మ్యాచ్‌‌లో నిలిచాడు. మూడో గేమ్‌‌లో 1–5, 7–11తో వెనుకబడ్డ ఇండియా యంగ్‌‌స్టర్‌‌ పోరాటం వదల్లేదు. విరామం తర్వాత వరుస పాయింట్లతో 18–14తో ముందంజ వేశాడు. అదే జోరుతో నాలుగు మ్యాచ్‌‌ పాయింట్లపైకి వచ్చిన  అతను నెట్‌‌ షాట్‌‌తో మ్యాచ్‌‌ను ముగించాడు.

సాత్విక్‌‌‑చిరాగ్‌‌ పోరాటం

డబుల్స్‌‌లో సాత్విక్‌‌ సాయిరాజ్–చిరాగ్‌‌ షెట్టి 18–21, 23–21, 21–19తో అహ్‌‌సాన్‌‌–కెవిన్‌‌ జంటను ఓడించింది. కొద్దిలో తొలి గేమ్‌‌ను కోల్పోయిన ఇండియా జంట రెండో గేమ్‌‌లో నాలుగు మ్యాచ్‌‌ పాయింట్లను కాపాడుకొని గెలిచింది. మూడో గేమ్‌‌లోనూ ఆధిక్యం చేతులు మారుతూ హోరాహోరీ పోరు నడిచింది. 16–16తో సమంగా ఉన్న  దశలో ఇండియా జంట  వీడియో రెఫరల్‌‌ ద్వారా కీలక పాయింట్‌‌ నెగ్గింది. ఆపై, సాత్విక్‌‌ పదునైన స్మాష్‌‌ కొట్టగా.. కెవిన్​ షాట్‌‌ నెట్‌‌కు తగలడంతో ఇండియా జోడీ 20–18తో రెండు మ్యాచ్‌‌ పాయింట్లపై నిలిచింది. ఈ దశలో ప్రత్యర్థి ఓ మ్యాచ్‌‌ పాయింట్‌‌ కాపాడుకోగా.. సర్వీస్‌‌కు రెడీ అవడంలో ఆలస్యం అయిన సాత్విక్‌‌ ఎల్లో కార్డు ఎదుర్కోవడంతో  తీవ్ర ఉత్కంఠ రేగింది. కానీ, చిరాగ్‌‌ అద్భుతమైన క్రాస్‌‌ కోర్ట్‌‌ స్మాష్‌‌తో మ్యాచ్‌‌ను గెలిపించి ఇండియాను 2–-0తో ఆధిక్యంలో నిలిపాడు.

శ్రీకాంత్‌‌ ఆధిపత్యం

టోర్నీలో ఒక్క మ్యాచ్‌‌లో కూడా ఓడని శ్రీకాంత్‌‌ మూడో సింగిల్స్‌‌లో 21–15, 23–21తో జొనాథన్‌‌ క్రిస్టీని వరుస గేమ్స్‌‌లో ఓడించి టీమ్‌‌కు కప్పు అందించాడు. ఓపెనింగ్‌‌ గేమ్‌‌ను సులువుగా గెలిచిన శ్రీకాంత్‌‌కు రెండో గేమ్‌‌లో బ్రేక్‌‌ తర్వాత గట్టి పోటీ ఎదురైంది. 5–11తో వెనుకబడిన క్రిస్టీ వరుస పాయింట్లు గెలుస్తూ  18–18తో శ్రీకాంత్‌‌ను అందుకున్నాడు.  ఈ దశలో  తన మార్కు జంప్‌‌ స్మాష్‌‌తో శ్రీకాంత్‌‌ కీలక పాయింట్‌‌ నెగ్గినప్పటికీ.. క్రిస్టీ రెండు సార్లు గేమ్‌‌ పాయింట్‌‌ పైకి వచ్చాడు. ఈ రెండింటిని కాపాడుకున్న శ్రీకాంత్‌‌ మరో హై జంప్‌‌ స్మాష్‌‌తో మ్యాచ్‌‌ ముగించడంతో.. ఇండియా ప్లేయర్లంతా కోర్టులోకి వచ్చి శ్రీకాంత్​ను ఎత్తుకొని సంబరాలు చేసుకున్నారు.

సత్తా ఉందని నమ్మాం

ఈ టోర్నీ కోసం జట్టును ఎంపిక చేసిన వెంటనే టీమ్‌‌‌‌మేట్స్‌‌ అందరితో ఓ వాట్సప్‌‌ గ్రూప్‌‌ క్రియేట్‌‌ చేశాం. దీనికి ‘మేం ట్రోఫీని ఇంటికి తీసుకొస్తాం’ అని పేరు పెట్టాం. ఇది టోర్నీకి వారం రోజుల ముందు మాట. కాబట్టి కప్పు నెగ్గే సత్తా మాకుందని మేం ముందు నుంచే నమ్మాం.  ఒకరికొకరం సపోర్ట్‌‌ ఇచ్చుకుంటూ  ముందుకుసాగాం. ఈ టోర్నీలో నేను సాధించిన ప్రతి విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నా. థామస్‌‌ కప్‌‌ నెగ్గిన టీమ్‌‌లో భాగం అయినందుకు, జట్టు విజయానికి కృషి చేసినందుకు నాకు ఆనందంగా ఉంది. అయితే, ఇది ఏ ఒక్కరి విజయమో కాదు మొత్తం పది మంది ప్లేయర్లది. నేను సాధించిన గత విజయాలను దీనితో పోల్చను. కానీ, నా కెరీర్‌‌లో అత్యుత్తమ విజయాల్లో, నా బెస్ట్‌‌ పెర్ఫామెన్స్‌‌ల్లో  ఇది ఒకటి అని చెబుతాను. ఇండివిడ్యువల్‌‌ ఈవెంట్లతో పోలిస్తే టీమ్‌‌ ఈవెంట్లు పూర్తిగా భిన్నం. టీమ్‌‌ ఈవెంట్లలో ఎక్కువగా ఆడే అవకాశం లభించదు. థామస్‌‌ కప్‌‌ ఫైనల్స్‌‌ అనేది అతి పెద్ద టీమ్‌‌ ఈవెంట్‌‌. అంత గొప్ప టోర్నీ నెగ్గడం అంటే సాధారణ విషయం కాబోదు. కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌, ఏషియన్‌‌ గేమ్స్‌‌, థామస్‌‌–ఉబెర్‌‌ కప్‌‌, వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌ లాంటి మేజర్‌‌ ఈవెంట్లలో దేనికీ ప్రైజ్‌‌మనీ లేదు. కానీ, వీటిలో మేం గెలిస్తే  ఇండియా గెలిచిందంటారు. అంతేగాని శ్రీకాంత్‌‌ గెలిచాడనో.. ప్రణయ్‌‌ గెలిచాడనో అనరు. అదే చాలా ప్రత్యేక అనుభూతి కలిగిస్తుంది. అది కొందరికే దక్కుతుంది. 10 మంది ప్లేయర్లం, కోచింగ్‌‌ స్టాఫ్‌‌ ఆ అనుభూతిని ఆస్వాదించాం. మరిన్ని విజయాలకు ఇది స్ఫూర్తినిస్తుంది.
    ‑ కిడాంబి శ్రీకాంత్‌‌‌‌

ఇండియా బ్యాడ్మింటన్‌‌‌‌ టీమ్‌‌కు హృదయపూర్వక అభినందనలు.  భవిష్యత్తుకు అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పుతూ జట్టు చరిత్ర సృష్టించింది. చాంపియన్లను చూసి దేశం గర్వపడుతోంది.
‑ రాష్ట్రపతి రామ్‌‌నాథ్‌‌ కోవింద్‌‌

థామస్‌‌‌‌ కప్‌‌ నెగ్గిన టీమిండియాకు అభినందనలు. ఈ టోర్నీలో  ఇండియా ఓ జట్టుగా అద్భుతంగా రాణించింది. గొప్ప నైపుణ్యాలను చూపెట్టింది. ఈ చారిత్రక విజయంతో దేశం మొత్తం గర్వపడుతోంది. మన జట్టుకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. 
‑ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మన జట్టు కొత్త శిఖరానికి చేరుకుంది. 73 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన థామస్‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌లో విజేతగా నిలిచిన ఇండియాకు శుభాకాంక్షలు. మీరంతా మమ్మల్ని గర్వపడేలా చేశారు. మన దేశా పతాకాన్ని ఇలానే రెపరెపలాడించండి. 
‑ బ్యాడ్మింటన్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా అధ్యక్షుడు  హిమంత బిశ్వ శర్మ

బాయ్​, కేంద్ర క్రీడాశాఖ చెరో కోటి నజరానా

మెన్స్ బ్యాడ్మింటన్ టీమ్ కు కేంద్ర క్రీడా శాఖ, బ్యాడ్మింటన్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (బాయ్​) చెరో  రూ.కోటి బహుమతి ప్రకటించాయి. సపోర్ట్​ స్టాఫ్​కు రూ. 20 లక్షల ప్రోత్సాహం ఇస్తామని బాయ్​ వెల్లడించింది.  

టీమ్‌‌‌‌కు ప్రధాని ఫోన్‌‌

థామస్‌ కప్‌లో విజేతగా నిలిచిన జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్‌ చేసి స్వయంగా అభినందించారు.   ఇండియా సాధించిన గొప్ప విజయాల్లో ఇది ఒకటని ప్లేయర్లతో చెప్పారు. ప్లేయర్లను తన నివాసానికి ఆహ్వానించారు. దాదాపు 10 నిమిషాల ఫోన్‌ కాల్‌లో శ్రీకాంత్‌తో పాటు లక్ష్యసేన్‌, ప్రణయ్‌, చిరాగ్‌తో మోడీ మాట్లాడారు. ఫైనల్లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా గెలవడం విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిందన్నారు. టోర్నీ ప్రాముఖ్యత, గతంలో ఇండియా రికార్డు గురించి తెలిసిన మోడీ.. ట్రోఫీ సాధించగలమన్న నమ్మకం ఎప్పుడు కలిగిందని అడిగారు.   క్వార్టర్‌ఫైనల్లో మలేసియా విజయం తర్వాత ఈ సారి ఏదైనా ప్రత్యేకంగా చేయగలమనే నమ్మకం ఏర్పడిందని శ్రీకాంత్‌ చెప్పాడు.  ఈ చారిత్రక విజయంలో  కోచ్‌లకు క్రెడిట్‌ ఉందని మోడీ అన్నారు.  ప్రధాని మోడీకి శ్రీకాంత్‌, ఇతర ప్లేయర్లు కృతజ్ఞతలు తెలిపారు.