ఎక్సైజ్​ఆఫీసర్లు, లిక్కర్ వ్యాపారుల ములాఖత్​పై టాస్క్​ఫోర్స్​ నజర్

ఎక్సైజ్​ఆఫీసర్లు, లిక్కర్ వ్యాపారుల ములాఖత్​పై టాస్క్​ఫోర్స్​ నజర్

ఎక్సైజ్​ఆఫీసర్లు, లిక్కర్ వ్యాపారుల ములాఖత్​పై టాస్క్​ఫోర్స్​ నజర్

ఎనిమిది జిల్లాల్లో మెరుపుదాడులు..ఒకే ఒక్క కేసు నమోదు

వరంగల్ జిల్లాలో ‘రహస్య ఒప్పందం’ లీక్​ కావడంతోనే..

కేసులు పెట్టొదంటూ ఎమ్మెల్యేలు, మంత్రుల ఒత్తిడి

నల్గొండ, వెలుగు : రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎక్సైజ్​అధికారులు, లిక్కర్​ వ్యాపారులు కలిసి  దందా చేస్తున్నారన్న సమాచారంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మార్పీ రేట్లకు మించి లిక్కర్ అమ్ముకునేందుకు ముగ్గురు ఉన్నతాధికారులకు, లైసెన్సీలకు మధ్య జరిగిన రహస్య ఒప్పందం లీక్ కావడంతో ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. చాలా చోట్ల ఎంఆర్​పీకి మించి వసూళ్లు చేయడం, బెల్ట్​షాపులకు ఎక్కువ ధరకు హోల్​సేల్​గా లిక్కర్​సరఫరా చేయడంపై స్థానిక ఎక్సైజ్​అధికారులకు సమాచారం ఉన్నా ముందుగా డీల్​ చేసుకోవడంతో స్పందించడం లేదు. వ్యాపారులకు రూలింగ్ పార్టీ నేతల మద్దతు కూడా ఉండడంతో జిల్లా స్థాయిలో అధికారులు పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లాకు చెందిన ఎస్​హెచ్​ఓకు ..జిల్లా ఉన్నతాధికారులు ఆఫర్​ఇవ్వగా ఆయన తిరస్కరించడంతో దందా బయటపడింది. దీంతో స్టేట్​టాస్క్​ఫోర్స్​ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దాడులు చేసింది. అయితే మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడితో ఒకే ఒక్క కేసు మాత్రమే పెట్టి చేతులు దులుపుకున్నట్టు తెలుస్తోంది.  

తనిఖీల విషయం లీకైందా? 

టాస్క్​ఫోర్స్​ టీమ్స్​ ఆదివారం సుమారు ఎనిమిది జిల్లాల్లో దాడులు చేసినా కేవలం భూపాలపల్లి జిల్లాలోని ఒక్క వైన్స్ పై మాత్రమే కేసు ఫైల్​ చేసి సీజ్​ చేసింది. టేకుమట్ల మండలం వెలిశాలలోని లక్ష్మీ నరసింహ స్వామి వైన్స్​ను రూల్స్​కు విరుద్ధంగా మండల కేంద్రానికి తరలించారు. అంతేగాక అక్కడి నుంచి మద్యాన్ని బెల్ట్ షాపులకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విషయం బయటపడగా రూ. 3 లక్షల ఫైన్​వేసి షాప్​ సీజ్ చేశామని ఎక్సైజ్ శాఖ డీఎస్పీ వెంకట్రాంరెడ్డి తెలిపారు. చాలా చోట్లా టాస్క్​ఫోర్స్ ​దాడుల విషయం జిల్లా అధికారుల ద్వారా వ్యాపారులకు ముందే లీక్ అయినట్టు తెలుస్తోంది. దీంతో సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో హోల్​సేల్​కౌంటర్లు బంద్ పెట్టారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో కేసులు పెట్టొదంటూ, తనిఖీలు ఆపేయాలని రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్సైజ్ అధికారులపైన ప్రెజర్​ తీసుకొచ్చినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తనిఖీలు చేసేందుకు యత్నించిన ఆఫీసర్లకు రాజకీయ ఒత్తిళ్లు రావడంతో ఆపేసినట్టు తెలిసింది.  

ఎమ్మార్పీకి మించి లిక్కర్ సేల్స్

రాష్ట్రంలోని పలు జిల్లాలో ఎమ్మార్పీ రేట్లకు మించి లిక్కర్ సేల్స్ జరుగుతున్నాయన్నది ఓపెన్​ సీక్రెట్​. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ ​జిల్లాల్లో లిక్కర్ సేల్స్ రెండు పద్ధతుల్లో జరుగుతున్నాయి. హోల్​సేల్, రిటైల్ పేరుతో ప్రతి షాపు వద్ద రెండు కౌంటర్లు ఉంటాయి. ఈ ఏడాదే ఎన్నికలు ఉండడం, వ్యాపారుల లైసెన్సీ గడువు కూడా ఈ ఏడాదితో ముగుస్తుండడంతో  ఎన్నికల టైంలో మద్యం సేల్స్ పైన ఎన్నికల సంఘం ఆంక్షలు ఉంటాయన్న ఆలోచనతో ఇప్పటి నుంచే వ్యాపారులు జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఇష్టమున్నంత ధరలకు  అమ్ముకుంటున్న వ్యాపారులు మెట్రో సిటీలు, కార్పొరేషన్లు, పొలిటికల్ హడావిడి ఎక్కువగా కనిపించే జిల్లాలో కోట్లకు పడగలెత్తారు. ఆఫీసర్లే స్వయంగా ఈ దందాను తెరవెనక నుంచి ప్రోత్సహిస్తుండటంతో  ప్రభుత్వానికి రాబడి రాకపోగా, వ్యాపారులు, అధికారులకు కాసుల వర్షం కురుస్తోంది. 

మార్జిన్​ ఎక్కువ వచ్చేవే అమ్ముతరు

ఆదాయం తెచ్చి పెట్టే బీర్లు, లిక్కర్ బ్రాండ్లనే వైన్స్​లోని కౌంటర్లలో పెట్టి సేల్ చేస్తున్నారు. వీటి పైన డిస్కౌంట్లు, పర్సంటేజీ ఎక్కువగా వస్తుండటం తో జనాలు కోరుకున్న బ్రాండ్లు వైన్​ షాపుల్లో  దొరకడం లేదు. జగిత్యాల జిల్లా కేంద్రంలో చాలా కాలంగా ఓ బీర్​ బ్రాండ్​ దొరకడం లేదని కొంతమంది మందు ప్రియులు ఫిబ్రవరి 27న సాక్షాత్తు ప్రజావాణిలో కంప్లయింట్​ చేశారు. ఆ కంపెనీ బీర్లు అమ్మితే ఎక్కువ లాభం రాదని సిండికేటైన వ్యాపారులు ఇష్టమున్న బ్రాండ్లను అమ్ముతున్నట్టు తెలిసింది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో కూడా ఓ బీర్​బ్రాండ్, మరో రకం విస్కీ దొరకడం లేదు. కానీ ఇవన్నీ బెల్టుషాపుల్లో మాత్రం దొరుకుతున్నాయి. అదేవిధంగా హైదరాబాద్​, వరంగల్ లాంటి జిల్లా కేంద్రాల్లో  లిక్కర్ షాపుల పక్కన కొత్తగా లిక్కర్ మార్ట్స్​ఓపెన్ చేశారు. వీటిల్లో ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తుండడంతో చాలామంది ఈ మార్టులకే వెళ్తున్నారు. దీంతో గిరాకీ తగ్గి  గ్రామీణ ప్రాంతాలపై వ్యాపారులు ఫోకస్ పెట్టి హోల్​సేల్​ దందా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జిల్లా అధికారులతో పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నారు.  

వరంగల్​లో బయటపడిన హోల్​సేల్​ అగ్రిమెంట్..

వైన్స్ నుంచి బెల్టుషాపులకు హోల్​సేల్​లో లిక్కర్ అమ్ముకునేందుకు ఉమ్మడి వరంగల్​జిల్లాలో వ్యాపారులకు, అధికారులకు మధ్య ఒప్పందం జరిగింది. హోల్​సేల్​ వ్యాపారులకు పర్మిషన్ ఇచ్చినందుకు నెలకు రూ.50 వేల చొప్పున జిల్లా అధికారులకు, ఎస్​హెచ్​ఓలకు నెలకు రూ.12 వేల చొప్పున ఇవ్వాలన్నది ఆ ఒప్పంద సారాంశం. ఈ వ్యవహారంలో భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ అధికారి..ఉన్నతాధికారులతో విభేదించడంతో విషయం బయటకు వచ్చింది. ఆ ఆఫీసర్ ​ఏఈఎస్ ప్రమోషన్ లిస్టులో ఉండడంతో అధికారులతో చేతులు కలపలేదని తెలిసింది. డీల్ గురించి పై అధికారులకు తెలిస్తే తనకు చార్జీ మెమో వస్తదన్న భయంతో అగ్రిమెంట్​ను నిరాకరించినట్టు సమాచారం. దీంతో అతడిని దారిలోకి తెచ్చుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు లిక్కర్ ​వ్యాపారులను ఉసిగొల్పారు. ‘మీ జిల్లా ఆఫీసర్ ఒప్పుకోవడం లేదయ్యా? మీరే తేల్చుకోండి’ అని రెచ్చగొట్టినట్లు తెలిసింది. ఈ పంచాయితీ చివరకు రాష్ట్ర స్థాయి అధికారులకు చేరడంతో ఆదివారం టాస్క్​ఫోర్స్ ​టీమ్స్​రంగంలో దిగాయి. వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, హన్మకొండ, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్​నగర్ ​నియోజకవర్గాల్లో దాడులు చేశాయి. 

ఎక్సైజ్​ మంత్రి జిల్లాలో అంతా ఓపెన్

ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ప్రాతినిధ్యం వహిస్తున్న పాలమూరు జిల్లాలో లిక్కర్ దందా ఓపెన్​గా నడుస్తున్నట్లు తెలిసింది. హోల్​సేల్, రిటైల్ కలిపి ఎమ్మార్పీ పై రూ.5 ఎక్కువ తీసుకుంటున్నారు. ఇంతా ఓపెన్​గా కౌంటర్ దందా జరుగుతున్నా స్థానిక అధికారులు గానీ, ప్రతిపక్షపార్టీలు గానీ నోరు మెదపడం లేదు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా అధికారులు  యాక్షన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది.