నిరుటి యాసంగి వడ్లే..  మిల్లింగ్​ చెయ్యలే!

నిరుటి యాసంగి వడ్లే..  మిల్లింగ్​ చెయ్యలే!
  • ఎఫ్​సీఐకి ఇంకా 9.71 లక్షల టన్నుల బియ్యాన్ని ఇయ్యని సర్కార్​
  • ఏడేండ్లుగా బాయిల్డ్​ రైస్​ మిల్లింగ్​ కెపాసిటీనే పెంచుతున్న ప్రభుత్వం
  • రోజూ 41,166 టన్నుల ముడి బియ్యం, 72,120 టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్​
  • సర్కారు, మిల్లర్ల తీరుతో నష్టపోతున్న రైతులు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో పండిన వడ్లను కేంద్రం కొనబోమంటోందని ఆరోపిస్తున్న రాష్ట్ర సర్కారు.. రా రైస్​(ముడి బియ్యం) మిల్లింగ్​కెపాసిటీని మాత్రం పెంచట్లేదు. ఏడేండ్లుగా బాయిల్డ్​ రైస్​ మిల్లింగ్​నే పెంచుతోంది. దీంతో రా రైస్​గానీ, పోషకాలను కలిపి తయారు చేసే ఫోర్టిఫైడ్​ బియ్యాన్ని కానీ అందించాలన్న ఎఫ్​సీఐ నిబంధనలకు తగినట్టు బియ్యాన్ని ఇవ్వలేకపోతోంది. అసలు, ఈ యాసంగి వడ్లు కొనాలంటున్న సర్కారు.. పోయిన యాసంగి, వానాకాలం పంటనే పూర్తిగా కేంద్రానికి ఇవ్వలేదు. ప్రభుత్వం కొనుగోలు చేసిన దాంట్లో కొన్ని లక్షల టన్నుల వడ్లను కనీసం మిల్లింగ్​ చేయనేలేదు. మిల్లింగ్​లో కొత్త టెక్నాలజీలు వచ్చినా అందుకు అనుగుణంగా సర్కారు మార్పులు చేసుకోలేదన్న విమర్శలూ వస్తున్నాయి. ఇటు మిల్లర్లుకూడా వడ్లను రా రైస్​గా పట్టిస్తే లాభం ఉండదన్న కారణంతో.. బాయిల్డ్​రైస్​ కెపాసిటీనే పెంచుకున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఇటు ప్రభుత్వం, అటు మిల్లర్ల తీరుతో నడిమిట్ల రైతులు నష్టపోతున్నారు.  

ఏడాదైనా మిల్లింగ్​ కాలే...
నిరుడు యాసంగిలో 92.34 లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్లకు ఎఫ్​సీఐ అనుమతించింది. ఆ వడ్లను మిల్లింగ్​ చేసి 62.53 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్​సీఐకి సర్కారు ఇవ్వాల్సి ఉంది. అయితే, ఏడాదైపోతున్నా ఇప్పటికీ వడ్ల మిల్లింగ్​ పూర్తిగా కాలేదు. ఇప్పటికీ రా రైస్​ 6.63 లక్షల టన్నులు, బాయిల్డ్​ రైస్​ 3.08 లక్షల టన్నులు కలిపి మొత్తం.. 9.71 లక్షల టన్నుల బియ్యాన్ని అందించాల్సి ఉంది. అంతేగాకుండా నిరుడు వానాకాలానికి సంబంధించిన 3 వేల టన్నుల బియ్యాన్నీ ఎఫ్​సీఐకి సర్కారు ఇవ్వలేదు.  

మిల్లింగ్​ కెపాసిటీ తక్కువే
రాష్ట్రంలో 2,476 రైస్​ మిల్లులున్నాయి. వాటితో రోజుకు రెండు షిఫ్టుల్లో కేవలం 41,166 టన్నుల రా రైస్​ మిల్లింగ్​ చేసుకునే సామర్థ్యం ఉంది. బాయిల్డ్​ రైస్​ మిల్లింగే ఎక్కువగా జరుగుతోంది. రోజూ రెండు షిఫ్టుల్లో 72,120 టన్నుల బాయిల్డ్​ రైస్ ను మిల్లింగ్​ చేస్తున్నారు. ఏడేండ్లుగా ఇదే పరిస్థితి ఉంది. బాయిల్డ్​ రైస్​ మిల్లింగ్​ కెపాసిటీని పెంచారే తప్ప.. రారైస్​ కెపాసిటీని మాత్రం పెంచలేదు. ఇటు ఫోర్టిఫైడ్​ రైస్​ బియ్యాన్ని పట్టే మిల్లులు 200 మాత్రమే ఉండడం గమనార్హం. రాష్ట్రంలో పెరుగుతున్న దిగుబడికి తగ్గట్టు మిల్లింగ్​ సామర్థ్యం లేకపోవడం, ప్రస్తుత అవసరాలకు తగ్టట్టు మార్పులు చేసుకోకపోవడంతో ఆ ప్రభావం రైతులపై పడుతోందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మిల్లింగ్​ కెపాసిటీని పెంచుకుంటే రైతులకు ఇబ్బందులు తప్పుతాయని సూచిస్తున్నారు. 

పంజాబ్​ ఇస్తున్నది ముడి బియ్యమే 
పంజాబ్​ ఇస్తున్న ధాన్యం కొంటున్నరు..మేం ఇచ్చే ధాన్యాన్ని ఎందుకు కొనరని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ప్రశ్నిస్తోంది. నిజానికి పంజాబ్​లో వానాకాలం మాత్రమే వరి సాగు చేస్తారు. ఎఫ్​సీఐ నిబంధనలకు అనుగుణంగా కేంద్రానికి పంజాబ్​ ముడి బియ్యాన్నే ఇస్తున్నది. రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి పోయిన ప్రతిసారీ కేంద్రం చెప్తున్న మాట కూడా ఇదే. పంజాబ్​లాగానే యాసంగిలో ముడి బియ్యాన్నిస్తే తీసుకుంటామని స్పష్టం చేస్తోంది. ఇటీవలి సమావేశంలోనూ కేంద్రమంత్రి పీయూష్​ గోయెల్​ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర సర్కారు బాయిల్డ్​ రైస్​ మాత్రమే ఇస్తామని, ఆ బియ్యాన్నే కొనాలని డిమాండ్​ చేస్తోంది.