లక్ష రుణమాఫీపై చేతులెత్తేసింది

లక్ష రుణమాఫీపై చేతులెత్తేసింది

అవసరం రూ.17,991 కోట్లు.. కేటాయింపు రూ.6,385 కోట్లే

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : రైతులకు రూ.లక్ష రుణమాఫీపై రాష్ట్ర సర్కారు చేతులెత్తేసింది. తాజా బడ్జెట్‌‌‌‌ కేటాయింపుల్లో పంట రుణాల మాఫీకి నామమాత్రపు నిధులు కేటాయించింది. ఇవి ఏమాత్రం సరిపోయేలా లేవు. దీంతో ఐదేండ్లలో దశల వారీగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పిన సర్కారు మాటలు ఉత్తవేనని తేలింది. ఏటా బడ్జెట్‌‌‌‌ లో కేటాయించిన మేరకు నిధులు విడుదల చేయకపోవడంతో నాలుగేండ్లలో రుణం మాఫీ కాక16 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో ఎగవేతదారులుగా మారారు. సీఎం సొంత జిల్లాలో రైతులకు పంట రుణాలు చెల్లించాలని కోర్టు నుంచి నోటీసులు వస్తున్నాయి. పాత బాకీ కట్టలేక కొత్త అప్పు పుట్టక లక్షల మంది రైతులు పెట్టుబడి ఖర్చులకు వడ్డీ వ్యాపారుల దగ్గర తెచ్చుకుని అప్పులపాలవుతున్నరు. క్రాప్‌‌‌‌ లోన్లను సర్కారు సరైన టైమ్​లో మాఫీ చేస్తే 7శాతం వడ్డీ పడేది నేడు 14 శాతంకు పైగా వడ్డీ భారం రైతులపై పడుతోంది. ప్రస్తుత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వ పదవీ కాలం ఈ ఏడాదితో ముగియనుంది. కానీ రుణమాఫీకి 2023–24 బడ్జెట్లో రూ.6,385 కోట్లే కేటాయించారు. ఇది రుణ మాఫీకి అవసరమైన సొమ్ములో మూడో వంతు మాత్రమే. 

31 లక్షల మంది రైతుల ఎదురుచూపు

ఎన్నికల హామీ ప్రకారం మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రుణాలు రూ.19,198 కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుందని బ్యాంకర్లు నిర్దారించారు. ఇప్పటివరకు 5.66 లక్షల మంది రైతుల లోన్లు మాఫీ చేయగా, మరో 31 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత కేటాయింపుతో ఎంతమంది రైతులు లబ్ధిపొందుతారన్నది స్పష్టం కావాల్సిఉంది. రూ.50 వేల వరకు మాఫీ చేయాలంటే 3.02 లక్షల మందికి సంబంధించి మరో రూ.1100 కోట్లు అవసరం. అది కాకుండా రూ.75వేల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయాలం టే 7 లక్షల మంది రైతుల రుణాల మాఫీకి  రూ.4 వేల కోట్లు అవసరం ఉంటుంది. అదే విధంగా రూ.లక్ష వరకు రుణాలు ఇంకా 21 లక్షల మందికి చెందిన రూ.13 వేల కోట్లు రుణాలు మాఫీ చేయాలి. ఇలా ఇంకా రూ.17991కోట్లు అవసరం అవుతాయి.రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని గతంలోనే ప్రభుత్వం భావించింది. కానీ బడ్జెట్లో దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.

రైతు బంధు, రైతు బీమాకే

ప్రభుత్వం ఈ సారి అగ్రికల్చర్​కు రూ.26831కోట్లు కేటాయించింది. నిరుడు 2022–23 బడ్జెట్‌‌‌‌ కంటే రూ.2576.65 కోట్లు ఎక్కువే కేటాయించింది. వ్యవసాయానికి కేటాయించిన నిధుల్లో రైతు బంధు, రైతు రుణమాఫీ,  రైతు బీమా పథకాలకే ఎక్కువ ఇచ్చా రు. ఈ మూడు పథకాలకే రూ.23,049 కోట్లు కేటాయించారు. ఇక మిగిలింది రూ.3,782 కోట్లు మాత్రమే. వ్యవసాయ విస్తరణ, ఈ రంగం అభివృద్ధికి కేటాయించింది స్వల్పమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఫామ్‌‌‌‌ మెకనైజేషన్​కు మొండిచేయి

ఫామ్ మెకనైజేషన్‌‌‌‌కు 2022–23లో రూ.500 కోట్లు, 2021–22లో రూ.1500 కోట్లు కేటాయించ గా ఈ సారి పూర్తిగా ఎత్తేసింది. మార్కెటింగ్​విభాగానికి కూడా ఈసారి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నిర్లక్ష్యానికి గురవుతున్న హార్టికల్చర్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ కు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా అరకొర కేటాయింపులే చేసింది. రూ.856.45 కోట్లు ప్రగతిపద్దులో చూపించింది. 

ఆయిల్‌‌‌‌ పామ్‌‌‌‌కు మళ్లీ వెయ్యి కోట్లు 

ఆయిల్‌‌‌‌ పామ్‌‌‌‌ సాగుకు సర్కారు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌‌‌‌ పామ్‌‌‌‌ సాగు కు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఇందుకు రూ.1000 కోట్లు కేటాయించారు. నిరుడు బడ్జెట్‌‌‌‌లో  రూ.1000 కోట్లు కేటాయించగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కేటాయింపులు చేస్తూ నిధులు రిలీజ్​ చేయకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులకు గండిపడే అవకాశం ఉంది.

మాఫీ చేసింది రూ.37 వేల లోపు లోన్లే

రుణ మాఫీ కోసం సర్కార్​ ఈ బడ్జెట్‌‌‌‌లో రూ.6,385 కోట్లు కేటాయించింది. గడిచిన నాలుగేండ్లలో రూ.20,164.20 కేటాయించింది. తాజా కేటాయింపులతో మొత్తం రూ.26549.20 కోట్లకు చేరాయి. కేటాయించిన నిధులన్నీ ఇస్తే ఇప్పటికే రుణమాఫీ పూర్తయ్యేది. అయితే, యేటా బడ్జెట్​లో రుణమాఫీకి నిధులు కేటాయింపు చేస్తున్నా.. వాటిని రిలీజ్ చేయడం లేదు. ఇప్పటివరకు రూ. 37 వేల లోపు రుణాలున్న రైతులకు రూ. 1,207 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. మొదటి దఫాగా రుణమాఫీ రూ.25 వేల వరకు 2.96లక్షల మంది రైతుల రుణాలు రూ.408.38కోట్లు, రెండో దఫాలో 2.70లక్షల మంది రైతులకు 36వేల వరకు ఉన్న రూ,770.40 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి.