- వృద్ధ యాచకురాలిపై దుండగుడి లైంగిక దాడి
- ప్రతిఘటించడంతో తలను నేలకు కొట్టి దాడి
- రక్తపు మడుగులో గమనించి దవాఖానకు తరలించిన స్థానికులు
- ఇబ్రహీంపట్నం బస్టాండ్ ప్రాంగణం వెనుక ఘటన
- సీసీ ఫుటేజీలో లైంగిక దాడి దృశ్యాలు
ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బస్టాండ్ వెనక ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి 60 ఏండ్ల వృద్ధురాలిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి అత్యాచారం చేశాడు. సదరు మహిళ కొద్ది రోజులుగా ఇబ్రహీంపట్నం బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అడుక్కుంటూ బస్టాండ్వెనక ఉన్న షాపింగ్కాంప్లెక్స్ముందు పడుకుంటోంది. ఇవి మెయిన్‌రోడ్డుకు పక్కనే ఉంటాయి. సోమవారం అర్ధరాత్రి ఆమె నిద్రపోతున్నప్పుడు గమనించిన ఓ దుండగుడు ముందు దాడి చేశాడు. చేతులతో తలను నేలకు గట్టిగా బాదడంతో తీవ్రంగా గాయపడింది.
అయినా, వదలకుండా లైంగిక దాడి చేసి అలాగే వదిలేసి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి లేచిన వృద్ధురాలు తిరిగి అక్కడే పడిపోయింది. తెల్లవారుజామున అక్కడికి వచ్చిన కొందరికి రక్తపు మడుగులో ఉన్న వృద్ధురాలు కనిపించింది. 108కు ఫోన్‌చేసి దవాఖానకు తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఓ 40 ఏండ్ల యువకుడు లైంగికదాడి చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, దుండగుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు.
