ఎనిమిదేండ్లయినా పర్యాటక పాలసీ తీస్కురాని రాష్ట్ర సర్కార్

ఎనిమిదేండ్లయినా పర్యాటక పాలసీ తీస్కురాని రాష్ట్ర సర్కార్
  • పీపీపీ లీజులు రూ. 260 కోట్లు వసూలులోనూ ఫెయిల్ 
  • కేంద్రం నిధులతోనే కొంతమేరకు అభివృద్ధి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం వచ్చి ఎనిమిదేండ్లు అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పాలసీని పట్టాలెక్కించడం లేదు. ఏదో చేస్తున్నామంటూ ఊదరగొట్టడమే తప్ప టూరిస్టులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టడంలేదు. పైగా టూరిజం ప్లేస్​లను పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్​నర్​షిప్(పీపీపీ) విధానంలో పనులు చేపట్టడమే కాకుండా.. ఇప్పటికే ఉన్న హరిత హోటళ్లను ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తోంది. బోటింగ్ అండ్ వాటర్ గేమ్స్ ప్రైవేట్ గతంలో పీపీపీ విధానంలో చేపట్టిన అనేక ప్రాజెక్టుల నుంచి రావాల్సిన లీజు డబ్బులు, అడిషనల్ డెవలప్​మెంట్ ప్రీమియం సొమ్ము వందల కోట్లలో పేరుకుపోయింది. రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక సంపద, జలపాతాలు, ప్రకృతి సౌందర్యాలు, ఆలయాలను ప్రమోట్ చేయడంలో టూరిజం డిపార్ట్​మెంట్ విఫలమవుతోంది. ప్రభుత్వం నుంచి డెవలప్మెంట్ కాకుండా.. తమకు తెలిసిన వారికి ప్రైవేట్​లో టూరిజం ప్రాంతాలను ఎలా అప్పగించాలనే దానిపైనే దృష్టి పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి.  

చేసిన కొంత.. కేంద్రం నిధులతోనే

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి, సౌలతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా కేటాయించలేదు. అదే సమయంలో కేంద్రం తీసుకొచ్చిన స్వదేశీ దర్శన్, ప్రసాద్(పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిరిచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్) స్కీమ్ లు రాష్ట్ర టూరిజం అభివృద్ధికి కొంత ఊతమిచ్చాయి. స్వదేశీ దర్శన్‌‌‌‌ స్కీమ్‌‌‌‌లో భాగంగా తెలంగాణ ట్రైబల్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌(ములుగు జిల్లా, రూ. 83కోట్లు), తెలంగాణ ఎకో టూరిజం సర్క్యూట్‌‌‌‌ (మహబూబ్‌‌‌‌నగర్‌‌,‌‌ - రూ.91 కోట్లు), తెలంగాణ హెరిటేజ్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌ (హైదరాబాద్‌‌,‌‌ - రూ. 99 కోట్లు)కు కేంద్ర సర్కారు ఫండ్స్ కేటాయించింది.

వీటితో ఆయా జిల్లాల్లో టూరిస్ట్ స్పాట్‌‌‌‌లను డెవలప్ చేశారు. రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే(2014 -– 15) నీతిఆయోగ్ స్కీమ్​లో కరీంనగర్ ఎల్ఎండీ వద్ద థీమ్ పార్క్​కు రూ.15.17 కోట్లు, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ అభయారణ్యానికి రూ.10.77 కోట్లు, కొత్తగూడెంలో బడ్జెట్ హోటల్ నిర్మాణానికి రూ.12.36 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ఇప్పటికే ఈ స్కీమ్ లో మన్యంకొండ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.50 కోట్లు, అలంపూర్ జోగుళాంబ దేవి గుడికి రూ.37 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.