జీవో లేదు.. ప్రకటన లేదు సైలెంట్‌‌గా సర్వే

జీవో లేదు.. ప్రకటన లేదు సైలెంట్‌‌గా సర్వే
  • కనవడని హోర్డింగ్స్.. యాడ్స్​
  • ఇంటర్నల్ సర్క్యులర్లతోనే నడిపించేస్తున్నరు
  • జీవో ఇస్తే కోర్టులో నిలబడదనే భయం
  • ఎల్​ఆర్​ఎస్​కు మాత్రం ఏడ జూసినా ప్రకటనలే

హైదరాబాద్, వెలుగుప్రభుత్వం ఏదైనా ఒక  కొత్త  ప్రోగ్రామ్​చేపట్టాలనుకుంటే.. ముందుగా దాని గురించి సంబంధిత శాఖ పూర్తి వివరాలతో జీవో విడుదల చేస్తుంటుంది. ఆ ప్రోగ్రామ్​ ఎట్ల చేయాలి? ఏ విధంగా పూర్తి చేయాలి? ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలి? అనే వివరాలు  అందులో పేర్కొంటుంది. ఆ అధికారిక ప్రకటన ఆధారంగా సంబంధిత శాఖ హెచ్ వోడీ  జిల్లా ఆఫీసర్లకు ఆదేశాలు ఇస్తారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి మొదలైన వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక్క జీవో  కూడా విడుదల చేయలేదు.కానీ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి మొదలైన వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక్క జీవో  కూడా విడుదల చేయలేదు. ఎలాంటి ప్రకటనలు విడుదల చేయలేదు. రోడ్ల మీద హోర్డింగ్స్​ కూడా ఏర్పాటు చేయలేదు. అంతా ఇంటర్నల్ సర్క్యులర్లతోనే నడిపించేస్తున్నది. సీఎం ఆఫీసు నుంచి మొదలుకొని చీఫ్ సెక్రటరీ ఆఫీసు, మున్సిపల్, పంచాయతీ సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు, చివరకు గ్రామస్థాయి ఆఫీసర్ల వరకు అంతా ఇంటర్నల్​ ఆర్డర్స్​తోనే సర్వేపై ముందుకు వెళ్తున్నారు. ఇట్ల గప్​చుప్​గా కానిచ్చేయడం వెనుక మతలబేందనే  సందేహాలు జనంలో వ్యక్తమవుతున్నాయి. ఆఫీసర్లు, లీగల్​ ఎక్స్​పర్ట్స్​ మాత్రం.. ప్రజల ఆస్తుల వివరాలను సేకరించడమేనది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని, ప్రభుత్వం జీవో జారీ చేస్తే కోర్టుల్లో నిలబడదని అంటున్నారు. అందుకే అఫీషియల్​గా అనౌన్స్​ చేయకుండా రహస్యంగా కొనసాగిస్తున్నారని పేర్కొంటున్నారు.

రాజకీయ జోక్యం

ప్రభుత్వం బ్రోచర్ ముద్రించకుండా, హోర్డింగ్స్​ పెట్టకుండా, పత్రిక ప్రకటన జారీ చేయకుండా..  ప్రజల ఆస్తుల వివరాల నమోదు ప్రొగ్రాం నడిపిస్తున్నది. ఆఫీసర్ల  ప్రమేయంతో ప్రోగ్రామ్​ సక్సెస్  కాదన్న భావనతో రాజకీయ జోక్యానికి అవకాశం ఇచ్చింది. ఆస్తుల వివరాల నమోదుకు  ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యేలను, ఇతర లీడర్లను సీఎం కేసీఆర్​ ఆదేశించారు. ఈ మధ్య ప్రగతి భవన్ లో 6 జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల మీటింగ్ లో సీఎం.. ఆస్తుల నమోదుపై ప్రజలకు అనుమానాలు ఉంటే తొలగించాలని సూచించారు. వివరాలు నమోదు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఊళ్లు, పట్టణాల్లో పర్యటిస్తున్న పెద్ద లీడర్లు.. ఆస్తుల వివరాలు నమోదు కోసం ప్రజలను ఎంకరేజ్ చేయాలని లోకల్​ లీడర్లకు డైరెక్షన్స్​ ఇస్తున్నారు. ఇప్పుడు నమోదు చేయించుకోకపోతే భవిష్యత్ లో  ప్రభుత్వం ఎంట్రీ చేసుకోదని, ఆస్తుల అమ్మకానికి అడ్డంకులు వస్తాయని ప్రజలకు చెప్తున్నారు. వారసుల పేర్లు ఇవ్వకపోతే భవిష్యత్ లో వారికి ఆస్తిలో వాటా దక్కదని హెచ్చరిస్తున్నారు.

కోర్టులో నిలబడదనే..!

లీగల్​ లిటిగేషన్స్​ వస్తాయనే భయంతోనే ప్రభుత్వం ప్రజల ఆస్తుల వివరాల నమోదుపై ఎలాంటి జీవో జారీ చేయడం లేదని సీనియర్ ఆఫీసర్లు, లీగల్​ ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు. ప్రజల ఆస్తులను బలవంతంగా నమోదు చేయించడం అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని  అంటున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్​కు జీవో జారీ చేసి కొనసాగిస్తే.. ఎవరైనా కోర్టుకు వెళ్తే అంతా మొదటికి వస్తుందని చెప్తున్నారు. అందుకే ఇంటర్నల్ ఆర్డర్స్​తోనే రహస్యంగా నడిపిస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ‘‘ఆస్తుల వివరాలు బహిర్గతం చేయడం అనేది వ్యక్తి ఇష్టాఇష్టాల మేరకు ఉంటుంది. బలవంతంగా మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి? మీరు సంపాదించారా? తాతల ఆస్తినా? అనే వివరాలు ఆడగడం చట్ట వ్యతిరేకం. అవినీతి కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలు, అనుమానం వచ్చిన వ్యక్తుల నుంచి మాత్రం బలవంతంగా ఆస్తుల వివరాలు సేకరించవచ్చు’’ అని ఓ ఆఫీసర్​ చెప్పారు.

ఎల్​ఆర్​ఎస్ తరహాలో ప్రచారమేది?

ఎల్​ఆర్​ఎస్ విషయంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. జీవో కూడా విడుదల చేసింది. ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్ పెట్టింది. ఈ నెల 15 వరకు చివరి తేదీ అంటూ అందులో అన్ని వివరాలు పేర్కొంది.  అదే ఆస్తుల వివరాల నమోదు విషయంలో మాత్రం ఎలాంటి  ప్రచారం లేదు. జీవోలు లేవు.. హోర్డింగ్స్​ లేవు.  ఆస్తుల నమోదు అనేది అఫీషియల్ ప్రోగ్రాం అనుకుంటే జీవోలు లేకుండా చేపట్టడం ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు.