డబుల్ బెడ్రూం ఇండ్లు కొత్తవి కట్టుడు బంద్

డబుల్ బెడ్రూం ఇండ్లు కొత్తవి కట్టుడు బంద్

డబుల్ బెడ్రూం ఇండ్లు కొత్తవి కట్టుడు బంద్
ఏడాదిన్నరగా ఒక్కదానికీ సర్కారు అనుమతియ్యలే
ఇప్పటిదాకా పర్మిషన్లు ఇచ్చిన వాటికే పరిమితం
వాటిని కట్టేసి.. పంచుడు పూర్తి చేయాలని నిర్ణయం
జాగా ఉన్నోళ్లకు ఆర్థిక సాయంతో సరిపెట్టాలని ప్లాన్

హైదరాబాద్, వెలుగు : డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై రాష్ట్ర సర్కార్ వెనకడుగు వేసింది. కొత్తగా ఇండ్లు కట్టేది లేదని పరోక్షంగా తేల్చేసింది. అందులో భాగంగానే ఏడాదిన్నరగా కొత్త డబుల్ బెడ్రూం ఇండ్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఇప్పుడున్న వాటికి అదనంగా పెంచే ప్రపోజల్స్ కూడా అవసరం లేదని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సొంత జాగా ఉన్నోళ్లకు ఇండ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడంతో.. దాన్నే అమలు చేయనున్నట్లు తెలుస్తున్నది. దీనివల్ల తక్కువ నిధులు ఎక్కువ మందికి పంచే అవకాశం ఉంటుందనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రజల నుంచి వ్యతిరేకతతో..

డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభించి ఏడేండ్లు అవుతున్నది. మొదట్లో రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తొలుత 6 లక్షల ఇండ్లు కట్టాలని అనుకోగా.. ఇప్పుడు అది సగంతో ఆగిపోయింది. అందులోనూ నిర్మాణాలు మొత్తం పూర్తి చేయలేదు. కడుతామని అనుకున్న దాదాపు 70 వేల ఇండ్లకు టెండర్లు కూడా పిలవలేదు. మరోవైపు ఇండ్లు లేని అర్హులైన వారి నుంచి లక్షల సంఖ్యలో అర్జీలు వస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం అనుకున్నంతగా ఎక్కువ ఇండ్లు సమయానికి నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వలేకపోయింది. దీంతో రాష్ట్ర సర్కార్‌‌‌‌కు మైలేజ్ రాకపోగా జనంలో వ్యతిరేకత వచ్చింది. మరోవైపు ఈ ఇండ్ల విషయంలో స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరిగింది. అది కాస్త ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచింది. దీంతో డబుల్ బెడ్రూం ఇండ్ల జోలి పెట్టుకోవద్దని రెండేండ్ల కిందటే సీఎం కేసీఆర్ దగ్గర చర్చ వచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగానే 2021–22 బడ్జెట్‌‌లో సొంత జాగాలో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే ఆ ఏడాది అమల్లోకి తీసుకురాలేదు.

సాయమైనా అందుతదా?

గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లోనూ మళ్లీ సొంత జాగా ఉన్నోళ్లకు ఆర్థిక సాయంపై సర్కారు ప్రకటన చేసింది. 4 లక్షల మందికి సాయం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున లబ్ధిదారులను ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తారని గైడ్​లైన్స్ రెడీ చేశారు. దీనికోసం రూ.12 వేల కోట్ల కేటాయించారు. ఈ స్కీంకు సంబంధించి కొన్ని ప్రపోజల్స్‌‌ను ప్రభుత్వం ఓకే చేసింది. ఇది మొదలైతే ఎమ్మెల్యేలకు కాస్త ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. ఎలక్షన్ ఇయర్ కావడంతో 3 వేల మందిలో సగం మందికైనా సాయం చేయడం మొదలుపెట్టాలని ఎమ్మెల్యేలు సీఎంకు విన్నవించుకున్నారు. ఇక డబుల్ బెడ్రూం ఇండ్ల కొత్త శాంక్షన్లపై ఆఫీసర్లు ప్రతిపాదించగా.. ‘చుద్దాంలే’ అని పక్కన పెట్టినట్లు తెలిసింది.

ఇండ్లు లేని కుటుంబాలు 35 లక్షలకు పైనే

2014 సమగ్ర సర్వే ప్రకారమే ఇండ్లు లేని కుటుంబాలు 26.31 లక్షల దాకా ఉన్నట్లు తేలింది. ఇప్పుడు ఈ సంఖ్య పెరిగింది. ప్రస్తుతం సొంతిండ్లు లేని కుటుంబాల సంఖ్య 35 లక్షలకు పైనే ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఒక్క కామారెడ్డి మున్సిపాలిటీలోనే డబుల్ ఇండ్ల కోసం 6 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. కానీ అక్కడ కేవలం 600 ఇండ్లే కడుతున్నారు. ఇలా ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండటం, ఇండ్లు తక్కువగా ఉండటం.. వాటిని సమయానికి నిర్మించి ఇవ్వపోవడంతో ఎమ్మెల్యేలను స్థానికులు నిలదీస్తున్నారు. కొన్నిచోట్ల తుదిదశ నిర్మాణంలో ఉన్న ఇండ్లలో వెళ్లి ఉంటున్నారు.

ఏండ్లుగా నిర్మాణం

రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఏడాది కొన్ని ఇండ్లు నిర్మించడం మొదలుపెట్టారు. అయినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఏటా కొన్ని ఇండ్లకు శాంక్షన్లు ఇచ్చుకుంటూ వచ్చిన ప్రభుత్వం.. గతేడాది నుంచి కొత్త డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయలేదు. ఇప్పటి వరకు మొత్తం 2,92,057 ఇండ్లు శాంక్షన్ చేశారు. ఇందులో 2,28,520 నిర్మాణం ప్రారంభించగా..1.36 లక్షల ఇండ్లు పూర్తి చేశారు. ఇంకా 92 వేల ఇండ్లు నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయి. తుది దశ నిర్మాణంలో ఉన్న కొన్ని ఇండ్లను పూర్తి చేసి ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలోగా పంపిణీ చేసి చేతులు దులుపుకోవాలని సర్కారు భావిస్తున్నది. ఇప్పటిదాకా లబ్ధిదారులకు అందజేసిన ఇండ్లు 21 వేలు మాత్రమే. మొత్తంగా డబుల్ ఇండ్లకు రూ.19,328.32 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.11,614.95 కోట్లు సర్కారు ఖర్చు చేసింది.

లేనోళ్లందరికీ కట్టియ్యాలె

డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తమని ఏండ్ల సంది ప్రభుత్వం చెప్తున్నది. పోయినేడు దరఖాస్తులు తీసుకున్నరు. ఇప్పుడేమో లక్కీ డ్రా తీస్తమని అంటున్నారు. అందరికీ ఇండ్లు రావు అంటున్నరు. మళ్లీ కడుతరా అంటే లేదంటున్నారు. గరీబోళ్లందరికీ ప్రభుత్వమే డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇయ్యాలె. ఒకలకు ఇచ్చి.. ఇంకొకలకు ఇయ్యకుంట ఎట్లా ఉంటరు. 

- శాంతమ్మ, కామారెడ్డి జిల్లా