రెండు నెలల్లో కులగణన పూర్తి రెండు విధాలుగా చేపట్టాలని రాష్ట్ర సర్కార్ యోచన

రెండు నెలల్లో కులగణన పూర్తి రెండు విధాలుగా చేపట్టాలని రాష్ట్ర సర్కార్ యోచన
  • ఒకటి సెన్సస్ యాక్ట్​ ప్రకారం ప్రత్యేక ఫార్మాట్​లో..
  • రెండోది ఓటరు లిస్టు ఆధారంగా బీసీ సర్వే
  • త్వరలో కొత్త బీసీ కమిషన్.. నవంబర్​లో స్థానిక ఎన్నికలు!

హైదరాబాద్, వెలుగు: కులగణనను రెండు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. రెండు విధాలుగా దీన్ని చేపట్టాలని యోచిస్తున్నది. సెన్సస్​ యాక్ట్​ ప్రకారం ప్రత్యేక ఫార్మాట్‌లో కుల గణన చేయడంతోపాటు ఓటరు లిస్ట్​ ఆధారంగా బీసీ గణన కూడా చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

స్థానిక సంస్థల్లో ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నందున లోకల్​ బాడీ ఎన్నికల ముందు బీసీ గణన సాధ్యం కాదని ఒకదశలో ప్రభుత్వం భావించింది. కానీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కులగణనపై పిలుపునివ్వడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్  కూడా ఆ దిశగానే వేగంగా అడుగులు వేస్తున్నది. బీసీల లెక్క, రిజర్వేషన్లు తేల్చాకే లోకల్​బాడీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నది. 

కులగణన కోసం ఇతర రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులు,  బీసీలకు రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులు, ఎదురయ్యే లీగల్​ సమస్యలు, ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పులపై ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి రిపోర్ట్ తెప్పించుకున్నారు. అందుకు తగ్గట్టు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు యాక్షన్​ ప్లాన్  తయారు చేస్తున్నారు.  రాష్ట్రంలో కులగణన నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. 

ఇందుకోసం రూ.150 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఈ నిధులనే కులగణన కోసం వెచ్చించనున్నారు. మరోవైపు ఈ నెలఖారుకు బీసీ కమిషన్​ పదవీ కాలం ముగియనుంది. దీంతో కొత్త కమిషన్​ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ వెంటనే ప్రత్యేక ఫార్మాట్​లో క్యాస్ట్​ సెన్సస్​, ఓటర్ల జాబితాలో బీసీ గణన రెండూ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నామని సెక్రటేరియెట్​లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 

నవంబర్ చివరిలో స్థానిక ఎన్నికలు?

గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం స్పెషలాఫీసర్ల పాలన నడుస్తున్నది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సర్పంచ్​ల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నది. అయితే బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్స్​లో రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల్లో కాంగ్రెస్​ హామీ ఇచ్చింది. కులగణన కూడా చేపడుతామని తెలిపింది. 

ఇంకోవైపు స్పెషలాఫీసర్ల పాలన ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే ఫైనాన్స్​ కమిషన్​ గ్రాంట్లు, సెంట్రల్​ గ్రాంట్లు నిలిచిపోతాయి. దీంతో ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచిస్తున్నది. ఇప్పటికే ఎన్నికలు ఆలస్యమైనందున.. అక్టోబర్​ చివరి కల్లా క్యాస్ట్​ సెన్సస్​, ఓటర్ల జాబితాతో బీసీ గణను పూర్తి చేయాలనుకుంటున్నది. వాటి ఆధారంగా బీసీ రిజర్వేషన్లను పెంచాలని చూస్తున్నది. అంతా అనుకున్నట్లు జరిగితే  నవంబర్ చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సెక్రటేరియెట్​లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.