ఇండ్ల లెక్కలు తీస్తున్న సర్కారు

ఇండ్ల లెక్కలు తీస్తున్న సర్కారు

రెగ్యులరైజేషన్​ చేయడానికా..స్వాధీనం చేసుకోవడానికా?
గ్రామ కంఠం, ఫారెస్ట్​ , పట్టా, దేవాదాయ, వక్ఫ్​ భూములెన్ని?
ఇండ్ల సంఖ్య, విస్తీర్ణం ఎంత?  
ఇందిరమ్మ, డబుల్ బెడ్​రూం ఇండ్ల వివరాలు చెప్పండి
పంచాయతీ సెక్రటరీలకు రాష్ట్ర సర్కారు ఆదేశాలు 
ఇంటింటికీ తిరగవద్దన్న ప్రభుత్వం
హౌస్ ట్యాక్స్ రిజిస్టర్ తో కుస్తీ  

కరీంనగర్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మళ్లీ ఇండ్ల లెక్కలు తీస్తోంది. ఇంటి ఓనర్ పేరు, ఇంటి నంబర్ సహా ఇల్లు, ఇంటి స్థలానికి సంబంధించిన సమగ్ర వివరాలను సేకరిస్తోంది. గ్రామకంఠంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి ? ఫారెస్ట్ భూముల్లో ఉన్నవెన్ని ? దేవాదాయ, వక్ఫ్  భూముల్లోని ఇండ్ల సంఖ్య ఎంత ? పట్టాలున్న ఇండ్లెన్ని.. లేనివెన్ని ? రిజిస్ట్రేషన్ పేపర్లున్న ఇండ్లు ఎన్ని ? నోటరీ, తెల్లకాగితాలపై రాసుకున్నవి ఎన్ని ? అనే వివరాలను మూడు రోజుల్లోగా పంపాలని పంచాయతీ సెక్రటరీలకు ఆదేశాలు వచ్చాయి. గ్రామకంఠం, ఫారెస్ట్, దేవాదాయ, వక్ఫ్ భూములు ఊరిలో ఎక్కడెక్కడున్నాయో, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో తహసీల్దార్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఇంటింటికి తిరిగి కొలతలు తీసుకోవద్దని, కేవలం అందాద ఎంత విస్తీర్ణం ఉంటుందో లెక్క వేసి పంపాలని సూచించడంతో సెక్రటరీలు హౌస్ ట్యాక్స్ రిజిస్టర్ దగ్గర పెట్టుకొని కుస్తీలు పడుతున్నారు.  

రెండు ప్రొఫార్మాల్లో.. 

ఇండ్ల వివరాలు సేకరించేందుకు పంచాయతీ సెక్రటరీలకు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రొఫార్మాలు పంపింది. ఫ్రొఫార్మా 1లో అసెస్ మెంట్ నంబర్, హౌస్ నంబర్, గ్రామం, ఓనర్, తండ్రి/భర్త పేరు, ఇల్లు ప్రైవేట్ బిల్డింగా, ప్రభుత్వ బిల్డింగా, హౌసింగ్ కాలనీ బిల్డింగా.. అనే కాలమ్స్ ఉన్నాయి. ల్యాండ్ టైప్ విభాగంలో పట్టా ఉన్న ఇల్లు అనే కాలమ్ ఉంది. ఇందులో గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్న ఇండ్లు, భూమి పట్టా ఉన్న ఇండ్లు, పొజిషన్ సర్టిఫికెట్ ఉన్న ఇండ్లు, ఆక్యుపేషన్​సర్టిఫికెట్ ఉన్న ఇండ్లను నమోదు చేయాలని పేర్కొన్నారు. పట్టా లేని ఇండ్ల కేటగిరీలో ప్రభుత్వ స్థలం, సోషల్ వెల్ఫేర్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్, అబాదీ/ గ్రామకంఠం, దేవాదాయ శాఖ స్థలం, వక్ఫ్ ల్యాండ్, శిఖం/ఎఫ్ టీఎల్ ల్యాండ్, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన ల్యాండ్, లీజుకు తీసుకున్న ల్యాండ్ అనే కాలమ్స్ ఉన్నాయి.  ప్రైవేట్ పట్టా భూమిలోని ఇండ్ల స్థలాలకు సంబంధించి నోటరీ, స్టాంప్ పేపర్ మీద కొనుగోలు చేసినవి, సాదా బైనామా/తెల్ల కాగితంపై మీద రాసుకుని కొన్నవి అనే రెండు కాలమ్స్ ఉన్నాయి. ఆయా కేటగిరీల్లో రాకుండా పట్టా లేని ల్యాండ్ కోసం మరో కాలమ్ ఉంది. వీటితోపాటు ఇల్లు లొకేట్ అయి ఉన్న సర్వే నంబర్, ప్లాట్ ఏరియా(గజాల్లో), ప్లింత్ ఏరియా(కన్ స్ట్రక్షన్)తోపాటు ఆ ఇంటికి నలుదిక్కుల ఉన్న హద్దుల వివరాలు పొందుపరిచేందుకు కాలమ్స్ ఇచ్చారు. ఫారెస్ట్ భూమిలోని ఇండ్ల సంఖ్యను ప్రత్యేకంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. మరో ప్రొఫార్మాలో పంచాయతీల వారీగా పర్మిషన్ లేని నిర్మాణాల సంఖ్యను నమోదు చేసేందుకు 18 కాలమ్స్ ఇచ్చారు. ఇందులో జిల్లా పేరు, అసెంబ్లీ నియోజకవర్గం, మండలం, గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ ఎల్ జీడీ(లోకల్​గవర్నమెంట్​డైరెక్టరీ) కోడ్ తోపాటు గవర్నమెంట్ ల్యాండ్​లో ఉన్న ఇండ్ల సంఖ్య, సోషల్ వెల్పేర్ డిపార్ట్ మెంట్ సేకరించిన స్థలం, సీలింగ్ ల్యాండ్, అబాదీ/గ్రామకంఠం, ఎండోమెంట్, వక్ఫ్, శిఖం, ఇతర ప్రభుత్వ శాఖల భూమి, గవర్నమెంట్ లీజుడ్ ల్యాండ్స్, నోటరైజ్డ్ పట్టా ల్యాండ్స్, సాదాబైనామా పట్టాల్యాండ్స్ లో ఉన్న ఇండ్లను నమోదు చేయాలని సూచించారు.  

సర్వే ఎందుకు చేస్తున్నట్టు ? 

రాష్ట్రంలోని వేల గ్రామాల్లో భూ సంబంధిత సమస్యతో ఇండ్లకు అనుమతులు లేక, ఇంటి నంబర్లు రాక ఓనర్లు అవస్థలు పడుతున్నారు. గ్రామాలు ఏర్పడిన సమయంలో ఇండ్ల కోసం కేటాయించిన స్థలాలను గ్రామకంఠం/ఆబాదీ అనే పేర్లతో రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. ఈ భూముల్లో ఉన్న ఇండ్లకు ఇంటి పన్ను రశీదులు తప్పా వేరే పత్రాలు లేవు. రాష్ట్రంలో 31,093 సర్వే నంబర్లలో గ్రామకంఠం, ఆబాదీ భూములు ఉన్నట్లు ప్రభుత్వం గతంలోనే అంచనా వేసింది. అలాగే ప్రభుత్వ భూములు, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, శిఖం భూముల్లోనూ పేదలు ఇండ్లు కట్టుకుని దశాబ్దాలుగా జీవిస్తున్నారు. వీటికి ఇంటి నంబర్లు, కరెంట్ మీటర్లు, నల్లా కనెక్షన్లున్నాయి. కానీ పట్టాలు, ఇతర పత్రాలు లేవు. ఈ స్థలాల్లో నిర్మించిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు కూడా కావడం లేదు. దీంతో స్టాంప్ పేపర్లు, తెల్లకాగితాలపైనే అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి స్థలాలను ఎన్నికల ముందు రెగ్యులరైజేషన్ చేసేందుకే ప్రభుత్వం వివరాలు సేకరిస్తోందనే వాదన వినిపిస్తోంది. అలాగే రెగ్యులరైజేష్ చేయడానికి వీల్లేని దేవాదాయ, వక్ఫ్, ఫారెస్ట్ భూముల్లోని ఇండ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా.. హక్కులు కల్పిస్తుందా అనే విషయంలో మాత్రం ఉన్నతాధికారుల వద్ద క్లారిటీ లేదు.  

గతంలోనూ వివరాల సేకరణ.. 

2020 సెప్టెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే గ్రామాలతోపాటు పట్టణాలు, నగరాల్లోనూ ఇంటింటి సర్వే చేపట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. 50కి పైగా ప్రశ్నలతో సర్వే నిర్వహించింది. అప్పట్లో ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు డిటెయిల్స్​కూడా అడగడం వివాదాదస్పమైంది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో ఈ వివరాలు పొందుపరిచారు. ప్రభుత్వం ఎందుకు సర్వే చేస్తుందో తెలియక అప్పట్లో చాలా చోట్ల ప్రజలు సర్వే సిబ్బందిని నిలదీశారు. హైకోర్టు ఆదేశాలతో సర్వేను ప్రభుత్వం నిలిపివేసింది. అప్పుడు అడిగిన కొన్ని వివరాలనే ప్రభుత్వం మళ్లీ సేకరించడం చర్చనీయాంశంగా మారింది. 

మరో రూపంలో స్వామిత్వ స్కీమ్ 

బ్యాంకు లోన్లు రాని స్థలాలకు రుణం వచ్చేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్వామిత్వ’ ప్రాపర్టీ కార్డులను జారీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీ, ఛత్తీస్​గఢ్​, కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈ స్కీం పైలట్ ప్రాజెక్ట్ దశను దాటింది. సగం గ్రామాల్లో డ్రోన్ సర్వే, మ్యాపుల డిజిటలైజేషన్ పూర్తి కావొస్తుండగా..మన రాష్ట్రంలో మాత్రం ఇంకా బాలారిష్టాలు దాటడం లేదు. 2025 వరకు దేశంలోని అన్ని ఆబాది స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మన రాష్ట్రంలోనూ ఇలా ప్రాపర్టీ కార్డులు అందజేయాల్సి ఉండడంతో  ఈ క్రెడిట్ కేంద్రం ఖాతాలో పడకుండా ఉండేందుకు స్వామిత్వ స్కీమ్ నే మరో రూపంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్వామిత్వ స్కీంలో ప్రాపర్టీ కార్డులు జారీ చేస్తే ప్రధాని ఫొటో పెట్టాల్సి ఉండడంతో ఆ స్కీంను మరో పేరుతో అమలు చేసి సీఎం కేసీఆర్ ఫొటోతో కూడిన కార్డులు అందజేయాలని భావిస్తున్నట్లు సమాచారం.