మద్యం మత్తులో పెరిగిపోతున్న నేరాలు

మద్యం మత్తులో పెరిగిపోతున్న నేరాలు
  • ఏడేండ్లలో మూడింతలైన పబ్‌‌లు
  • రెండేండ్లలో మూడు రెట్లు పెరిగిన రేప్‌‌లు
  • ఇష్టారాజ్యంగా బార్లు, వైన్స్‌‌కు అనుమతులు
  • అర్ధరాత్రి దాకా తాగుడు... అడ్డగోలుగా పర్మిట్‌‌ రూంలు.. ఊరూవాడా బెల్ట్‌‌ షాపులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆదాయమే లక్ష్యంగా ఇష్టారీతిన పబ్బులు, బార్లు, వైన్స్‌‌కు పర్మిషన్లు ఇస్తూ అఘాయిత్యాలకు ఆజ్యం పోస్తున్నది. ఆమ్దానీ కోసం వెనుకాముందు ఆలోచించకుండా ఇస్తున్న అనుమతులే అత్యాచారాలు, హత్యలకు కారణమవుతున్నాయి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా పబ్బులు మూడు రెట్లు పెరిగిపోయాయి. రాష్ట్రంలో అడ్డగోలుగా వైన్స్‌‌, బార్లు పుట్టుకొచ్చాయి. వాటి నిర్వహణ కూడా సరిగ్గా ఉండటం లేదు. బార్లు, పబ్బులపై నిఘా ఉంచి, నియంత్రించిన వ్యవస్థలు.. మైనర్లు వెళ్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయి. మరోవైపు సిటీలో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ దందా భారీగా సాగుతోంది. మత్తు పదార్థాల కట్టడికి స్పెషల్‌‌‌‌‌‌‌‌ వింగ్‌‌‌‌‌‌‌‌ తెస్తామని చెప్పినా.. తర్వాత ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. ఫలితంగా రాష్ట్రంలో క్రైం రేటు పెరిగిపోతున్నది. మూడేండ్లలో రేప్‌‌‌‌‌‌‌‌ కేసులు మూడింతలు కావడం ఆందోళన కలిగిస్తున్నది.

నిబంధనలు, నిఘా గాలికి..

రాష్ట్ర ప్రభుత్వం అడిగినోళ్లకు అడిగినట్లు పబ్‌‌‌‌‌‌‌‌లకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇస్తోంది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 30 వరకు పబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య 100 దాటింది. కొన్నిచోట్ల అనుమతులు లేకుండానే పబ్‌‌‌‌‌‌‌‌లు నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పబ్‌‌‌‌‌‌‌‌ల్లో ఎక్కువగా అధికార పార్టీకి చెందిన లీడర్లో, వాళ్ల అనుచరులో నడిపిస్తున్నారు. పబ్‌‌‌‌‌‌‌‌లకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన సర్కారు వాటిపై నిఘా గాలికొదిలేసింది. పబ్‌‌‌‌‌‌‌‌లకు మైనర్ల అనుమతి, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ అమ్మకాలు, టైమింగ్స్‌‌‌‌‌‌‌‌ పాటించకపోయినా పట్టించుకోవట్లేదు. ఇటీవల రాడిసన్‌‌‌‌‌‌‌‌ బ్లూ పబ్‌‌‌‌‌‌‌‌లో ఏకంగా డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మంత్రి మనవడు పబ్‌‌‌‌‌‌‌‌లో పార్టీ ఇవ్వగా.. 70 శాతం వరకు మైనర్లే ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ వచ్చినపుడు 2,216 వైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండగా, ఇపుడు వాటి సంఖ్య 2,620కి చేరింది. 2014లో 1,060 బార్లు ఉండగా, ఇటీవల 159 కొత్త బార్లకు పర్మిషన్ ఇచ్చారు. వీటి సంఖ్య 1,219కు పెరిగింది. బడా నేతల రిఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎప్పటికప్పుడు ఎలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బార్లతోపాటు, వైన్స్‌‌‌‌‌‌‌‌లకు పర్మిట్, రూమ్‌‌‌‌‌‌‌‌లకు అధికారులు పర్మిషన్లు ఇస్తూనే ఉన్నారు. ఆదాయం కోసం ఆబ్కారీ ఆఫీసర్లకు టార్గెట్లు పెడుతున్నారు.

అర్ధరాత్రి దాకా ఖుల్లా

రాష్ట్రంలో ఆదాయం పెంచుకునేందుకు మద్యం దుకాణాలు అర్ధరాత్రి వరకు తెరిచేందుకు అధికారులు అనుమతించారు. గతంలో వైన్స్‌‌‌‌‌‌‌‌ ఉదయం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు మూసివేసేవాళ్లు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 11 గంటలకు పొడిగించారు. సాధారణ రోజుల్లో బార్ల క్లోజింగ్‌‌‌‌‌‌‌‌ టైం రాత్రి 12 గంటలకు ఉంటే.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మాత్రం శుక్ర, శని, ఆదివారాల్లో ఒంటి గంట వరకు పెంచారు. పబ్‌‌‌‌‌‌‌‌ల్లో ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ కడితే 24 గంటలూ తెరుచుకునేందుకు సర్కారు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. 

ఊరికి ఐదారు బెల్ట్‌‌‌‌‌‌‌‌షాపులు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఊర్లలో విచ్చలవిడిగా బెల్ట్​షాపులు నడుస్తున్నాయి. చిన్న గ్రామాల్లో 2 నుంచి 4, పెద్ద గ్రామాల్లో 10 వరకు బెల్ట్‌‌‌‌‌‌‌‌ దుకాణాలు కొనసాగుతున్నాయి. దీంతో పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. కొన్ని చోట్ల ఏకంగా బెల్టుషాపులకు వేలం నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం అమ్ముతున్నారు. ఇదంతా ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసినా పట్టించుకోవడంలేదు. పైగా ఎంత తాగితే అంత ఆదాయం వస్తుందని చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఫలితంగా యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. కొన్నిసార్లు అడ్డదారి సంపాదన కోసం నేరాలకు పాల్పడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో మద్యం మత్తులో అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

లిక్కర్‌‌‌‌‌‌‌‌ ఆమ్దానీ మూడింతలు..

తెలంగాణ వచ్చినప్పటి సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు లిక్కర్ ఆదాయం మూడింతలు పెరిగింది. 2014లో రూ.10,880 కోట్ల ఆదాయం రాగా, 2022లో ఏకంగా రూ. 31 వేల కోట్లకు పెరిగింది. మొత్తంగా ఏడేండ్లలో రూ. 1,35,631 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అయినా సరే సర్కారు మాత్రం ఆదాయాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఏడాదికోసారి లిక్కర్‌‌‌‌‌‌‌‌ రేట్లను పెంచుకుంటూ పోతున్నది.

డ్రగ్స్, గంజాయ్.. అడ్డేలేదు

రాష్ట్రంలో డ్రగ్స్ దందా ఆగడంలేదు. విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి రవాణా జరుగుతూనే ఉంది.  గతంలో నెలకో, మూడు నెలలకో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయి వార్తలు వినిపించేవి. కానీ ఇప్పుడు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయి ముఠాలు పట్టుబడుతున్నాయి. వీటి అడ్డుకట్టకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఆదేశించినా పట్టించుకోవడంలేదు. ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, ఫ్లయింగ్‌‌‌‌‌‌‌‌ స్క్వాడ్స్‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేయాలని, విద్యాసంస్థల దగ్గర నిఘా పెట్టాలని, బార్డర్లలో చెక్‌‌‌‌‌‌‌‌ పోస్టుల సంఖ్య పెంచాలని, సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని సీఎం ఆదేశించారు. డీజీ స్థాయి ఆఫీసర్‌‌‌‌‌‌‌‌తో స్పెషల్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌, ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌లో స్పెషల్‌‌‌‌‌‌‌‌ వింగ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని సూచించారు. కానీ సీఎం ఆదేశించి ఆరు నెలలు దాటినా ఇందులో ఏ ఒక్కటీ ముందుకు పడలేదు. ఇటీవల సైఫాబాద్‌‌‌‌‌‌‌‌లో గంజాయి తీసుకొని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లాలో వరుసగా స్కూల్‌‌‌‌‌‌‌‌ పిల్లలను రేప్‌‌‌‌‌‌‌‌ చేసి బావిలో పడేసిన ఘటన అప్పట్లో సంచలంగా మారింది. అయితే నేరాలు జరుగుతున్నా సర్కారు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రజల్లో భయంలేకుండా పోతోందని వాదనలు వినిపిస్తున్నాయి.