జీవో 59 దరఖాస్తులకు డిమాండ్ నోటీసులు

జీవో 59 దరఖాస్తులకు డిమాండ్ నోటీసులు

ఖమ్మం/ సత్తుపల్లి, వెలుగు: ఏళ్ల తరబడి ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకుని ఉంటున్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం షాక్​ఇస్తోంది. రెగ్యులరైజేషన్​ కోసం జీవో. 59 కింద దరఖాస్తు చేసుకున్నవారిని డిమాండ్​నోటీసులతో భయపెడుతోంది. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ఉన్నవారికి ప్రస్తుతం నోటీసులు అందుతున్నాయి. రెగ్యులరైజేషన్​ కోసం దాదాపుగా మార్కెట్​రేటు చెల్లించాలని డిమాండ్​ నోటీస్​ఇవ్వడంతో ఏం చేయాలో పాలుబోక దరఖాస్తుదారులు తలపట్టుకుంటున్నారు. రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు చెల్లించాలంటూ పలువురికి డిమాండ్ నోటీసులు అందాయి. మూడు నెలల్లోగా నెలకో విడత చొప్పున చెల్లించాలని పేర్కొంటున్నారు. మూడు నెలల్లో అంత డబ్బు కట్టే స్థోమత ఉంటే ఎప్పుడో ప్రైవేట్ వెంచర్లలో ఇంటి స్థలాలు కొనుక్కునేవాళ్లం కదా అని నోటీసులు అందుకున్నవారు వాపోతున్నారు. 

ఖమ్మంలో 15 వేల అప్లికేషన్లు

58, 59 జీవోల కింద రెగ్యులరైజేషన్​ కోసం ఖమ్మం జిల్లాలో 15 వేల దరఖాస్తులు అందాయి. వీటిలో అత్యధికంగా ఖమ్మం అర్బన్​ ప్రాంతంలోనే ఏడు వేల వరకు అప్లికేషన్లు ఉండగా 59 జీవో కింద 3 వేలు వచ్చాయి. గత ఏడాది మార్చి నెలాఖరుతో దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించుకుంటే భూముల విలువ పెరగడంతో పాటు భవిష్యత్తులో బ్యాంకు లోన్లు వస్తాయని ఆశ పడ్డారు. తర్వాత మార్గదర్శకాల కోసం ఆఫీసర్లు కొద్దిరోజులు ఎదురుచూశారు. జిల్లాస్థాయి ఆఫీసర్లతో 20 టీంలను ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిశీలించారు. జీవో 58 కింద ఖమ్మం జిల్లాలో మొత్తం 9,398 దరఖాస్తులు వచ్చాయి. 3,348 అప్లికేషన్లను యాక్సెప్ట్ చేశారు. రూల్స్​ప్రకారం సరైన పేపర్లు లేకపోవడంతో 5,022 అప్లికేషన్లు రిజెక్ట్ చేశారు. ఇక 125 గజాలకు మించి ఉన్నా జీవో నంబర్​58 కింద చేసుకున్న అప్లికేషన్లను జీవో 59కి కన్వర్ట్ చేశారు.

ఇలాంటి లబ్ధిదారులు అవసరమైన ఫీజు చెల్లించిన తర్వాతే వాటిని రెగ్యులరైజ్ చేస్తామని ఆఫీసర్లు చెప్పారు. 125 గజాలకు మించిన స్థలంలో ఇండ్లు కట్టుకున్నవారు  జీఓ 59 కింద కనీస ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 250 గజాల్లోపు ఇండ్లు నిర్మించుకుంటే ఆ ఏరియాలో ప్రభుత్వ ధరలో 25 శాతం కనీస ధర, 251 నుంచి 500 గజాల్లో ఇండ్లు నిర్మించుకుంటే 50 శాతం కనీస ధర, 500 నుంచి 1000 గజాలలోపు నిర్మించుకుంటే 75 శాతం ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. 1000 చదరపు గజాల పైన ఉన్నట్లయితే ఆ వివరాలను ప్రభుత్వానికి అందజేయనున్నారు. అయితే ఇప్పుడు అందుతున్న డిమాండ్​ నోటీసుల్లో ఈ శ్లాబ్ ధరల కంటే ఎక్కువ మొత్తంలో రేటు నిర్ణయిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

సాఫ్ట్​వేర్ ​ఆధారంగా..

58, 59 జీవో దరఖాస్తులను రెవెన్యూ, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, టూరిజం వంటి పలు శాఖల డివిజన్, జిల్లా స్థాయి అధికారుల నేతృత్వంలో బృందాలుగా ఏర్పడి సిబ్బంది సర్వే చేశారు. 2014 సంవత్సరానికి ముందు అసైన్డ్​స్థలాల్లో నివాసాలు ఏర్పరచుకున్నవారిని అర్హులుగా గుర్తిస్తూ ఈ దరఖాస్తుల విచారణ జరిగింది. బృందాలుగా ఏర్పడిన అధికారులు కాలనీలవారీగా సర్వే చేస్తూ స్థలం విస్తీర్ణం అందులో నిర్మించిన ఇంటి కొలతలను సర్కారు సూచించిన యాప్ లో నమోదు చేశారు. ఆ వివరాల ఆధారంగా దరఖాస్తుదారులు ఎంత చెల్లించాలో యాప్​లో వస్తుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నామమాత్రపు రుసుంతో క్రమబద్ధీకరిస్తారని అనుకున్నామని, సర్కారు కట్టాలని చెబుతున్న డబ్బే ఉంటే తాము రిజిస్ట్రేషన్​భూమే కొనుక్కునేవాళ్లమని దరఖాస్తుదారులు అంటున్నారు. ప్రభుత్వం పునరాలోచించి రెగ్యులరైజేషన్​రేటు తగ్గించాలని కోరుతున్నారు. 

అన్ని పైసలు ఏడ్నించి తేవాలె?

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ద్వారకాపురి కాలనీలో కొందరు పేదలకు 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయించింది. మిగిలిన భూమిలో దాదాపు 30 ఏళ్ల నుంచి కొంతమంది రేకుల ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. సర్కారు స్థలాల రెగ్యులరైజేషన్​కు అవకాశం ఇవ్వడంతో గతేడాది చాలామంది జీవో 59 కింద అప్లికేషన్లు పెట్టుకున్నారు. సర్వే నంబర్​184లో బూరుగు లలిత 270 గజాల్లో ఉన్న రేకుల ఇంటి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 190 గజాలు రెగ్యులరైజ్​ చేసేందుకు రూ.6.67 లక్షలు కట్టాలని డిమాండ్​ నోటీస్​ఇచ్చారు. జనవరి 21 వరకు రూ.2,33,450, ఫిబ్రవరి 21లోగా మరో విడత రూ.2,33,450, మార్చి 24లోగా ఫైనల్​పేమెంట్ రూ.2,00,100 కట్టాలని నోటీసులో పేర్కొన్నారు. ఇక ఇదే ఇంటికి 200 మీటర్ల దూరంలో అదే సర్వే నంబర్​పరిధిలో ఉన్న మల్లూరి రాజేశ్వరి ఇంటి రెగ్యులరైజేషన్​కు రూ.15,08,000 కట్టాలని డిమాండ్​ నోటీసు ఇచ్చారు.

363 గజాలను రెగ్యులరైజ్​ చేయించుకునేందుకు అప్లై చేసుకోగా, ఆఫీసర్లు 300 గజాలు రెగ్యులరైజ్​ చేసేందుకు మూడు విడతల్లో పేమెంట్ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. జనవరి 20లోగా రూ.5,27,800, ఫిబ్రవరి 20లోగా రూ.5,27,800, మార్చి 23లోగా రూ.4,52,400  ఫైనల్​ పేమెంట్ చేయాలని జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్​ పేరుతో వచ్చిన డిమాండ్​ నోటీసులో ఉంది. ద్వారకాపురి కాలనీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ధర గజానికి రూ.6 వేల వరకు ఉండగా, ప్రభుత్వ రిజిస్ట్రేషన్​ధర రూ. 3500 ఉంది. దాదాపుగా మార్కెట్​రేటు కట్టాలని చెబుతున్నారని, ఇంత మొత్తం ఎడ్నించి తేవాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం

జీవో 59 కింద ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నవారికి రూ.లక్షల్లో డిమాండ్ నోటీసులు అందాయనే ఫిర్యాదులు సత్తుపల్లి ప్రాంతం నుంచి వస్తున్నాయి. అస్సైన్డ్​స్థలాల్లో నివాసం ఉండే నిరుపేదలు పెద్దమొత్తంలో నగదు చెల్లించాల్సి రావడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తాం. - సూర్యనారాయణ, కల్లూరు ఆర్డీవో