సీతమ్మసాగర్‌‌లో మునిగిపోనున్న ఆనకట్ట

సీతమ్మసాగర్‌‌లో మునిగిపోనున్న ఆనకట్ట

హైదరాబాద్‌‌, వెలుగు: మునిగిపోయే ప్రాజెక్టు కోసం సర్వే పేరిట రాష్ట్ర సర్కారు హంగామా చేస్తోంది. ‘సీతమ్మసాగర్’ ప్రాజెక్టులో మునిగిపోయే దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తును మీటర్​ మేర పెంచడం కోసం సర్వే చేయించేందుకు సిద్ధమైంది. మూడేండ్ల కిందట ఇరిగేషన్​ అధికారులు ఇచ్చిన ప్రపోజల్స్​కు సర్కారు తాజాగా ఓకే చెప్పింది. సర్వే బాధ్యతలను ‘కాన్​టెక్​ డీఈఎస్​’ అనే సంస్థకు రూ.1.91 కోట్లకు అప్పజెప్తూ.. ఇరిగేషన్​ అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గోదావరిపై 63 మీటర్ల ఎత్తుతో దుమ్ముగూడెం ప్రాజెక్టుకు దిగువన 200 మీటర్ల దూరంలోనే సీతమ్మ సాగర్​ లిఫ్ట్​ స్కీంను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఆ లిఫ్ట్​ స్కీంకు పైన ఉన్న దుమ్ముగూడెం ఎత్తు కేవలం 47 మీటర్లు. కాబట్టి దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తును ఇంకో మీటర్​ పెంచినా.. సీతమ్మసాగర్​ కన్నా ఇంకా 15 మీటర్ల మేర తక్కువ ఎత్తే ఉంటుంది. కాబట్టి భవిష్యత్​లో గోదావరి పూర్తిగా ఎండిపోతే తప్ప దుమ్ముగూడెం ఆనకట్ట కనిపించే అవకాశమే లేదు. ఇప్పటికే సీతమ్మసాగర్‌‌ ముంపు ప్రభావం సహా అనేక అంశాలపై సర్వే పూర్తి చేశారు. 

అయితే, ఇప్పుడు ఆ లిఫ్ట్​ ప్రాజెక్ట్​లో మునిగిపోయే దుమ్ముగూడెం ఎత్తు పెంచడం వల్ల కలిగే ప్రభావాలపై కొత్తగా సర్వే చేసి ఏం చేస్తారన్నది అంతు చిక్కని ప్రశ్న. ఇక సర్వేలో భాగంగా టోపోగ్రాఫికల్​, డీటెయిల్డ్​ సర్వే, జియోగ్రాఫికల్  ఇన్వెస్టిగేషన్​, రివర్​బెడ్​పై ప్రభావం, డిజైన్స్​, డ్రాయింగ్స్​, డీపీఆర్​ పనులను ఆ సంస్థ చూడనుంది. ఆనకట్టకు ఎగువ, దిగువల్లో పడే ప్రభావం, ముంపు తీవ్రతపైనా సంస్థ రిపోర్ట్​ ఇవ్వనుంది. సర్వే సంస్థ ఇప్పటికే కొంత వరకు పనులు కూడా చేసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్​ ఎత్తు పెంపు సర్వేకి సంబంధించి గతంలోనే ప్రభుత్వం రూ.27.75 లక్షలతో పాలనా అనుమతులను ఇచ్చింది. ఆ మొత్తాన్ని రూ.1.91 కోట్లకు పెంచాలని ఇరిగేషన్​ ఈఎన్సీ 2019లో ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ఇప్పుడు వాటికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సర్వే కాంట్రాక్ట్​ను దక్కించుకున్న సంస్థకు ఇప్పటికే కొంత మొత్తాన్ని చెల్లించింది. దీనిపై ఇరిగేషన్‌‌‌‌ కొత్తగూడెం సీఈని ఫోన్‌‌‌‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. 

సీతారామ లిఫ్ట్​ స్కీంగా రీడిజైన్​

గోదావరి నదిపై భద్రాచలం దగ్గరలోని దుమ్ముగూడెం గ్రామం వద్ద సర్‌‌‌‌ ఆర్థర్​ కాటన్​ 150 ఏండ్ల కింద 47 మీటర్ల ఎత్తులో దుమ్ముగూడెం ఆనకట్టను కట్టారు. దీని ఆధారంగానే ఉమ్మడి ఏపీలో రాజీవ్‌‌‌‌ సాగర్‌‌‌‌, ఇందిరాసాగర్‌‌‌‌ ప్రాజెక్టులను నిర్మించాలనుకున్నారు. తెలంగాణ వచ్చాక ఈ రెండు ప్రాజెక్టులను కలిపి సీతారామ లిఫ్ట్​ స్కీంగా రీడిజైన్​ చేశారు. ఈ పథకం కోసం దుమ్ముగూడెం ఎత్తు పెంచాలని మొదట ప్రతిపాదించారు. అయితే దానికి బదులు దుమ్ముగూడెం ఆనకట్టకు 200 మీటర్ల దిగువన సీతమ్మసాగర్​ మల్టీ పర్పస్​ ప్రాజెక్టును రూ.3,500 కోట్లతో నిర్మిస్తున్నారు. 67 గేట్లతో ఈ బ్యారేజీని నిర్మిస్తున్నారు. 36.57 టీఎంసీల నీటిని ఏడాది పొడవునా నిల్వ చేయడంతో పాటు 320 మెగావాట్ల కరెంట్​ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టును దక్కించుకున్న ఎల్‌‌‌‌ అండ్‌‌‌‌ టీ సంస్థ ఇప్పటికే పనులనూ మొదలుపెట్టింది