ఎంఎంటీఎస్ ఫేజ్-2కు రాష్ట్ర సర్కారే నిధులిస్తలే

ఎంఎంటీఎస్ ఫేజ్-2కు రాష్ట్ర సర్కారే నిధులిస్తలే

హైదరాబాద్​లో ఎంఎంటీఎస్ ఫేజ్‑2కు రాష్ట్ర సర్కారు తన వాటా నిధులు ఇవ్వడం లేదు. దీంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమై ఎనిమిదేండ్లు కావొస్తున్నా పనులు  ముందుకు సాగడం లేదు.

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ సిటీలో ఎంఎంటీఎస్ ఫేజ్–2కు రాష్ట్ర సర్కారు తన వాటా నిధులు ఇవ్వడం లేదు. హైదరాబాద్ జంట నగరాల్లో ఎక్కువ దూరాన్ని తక్కువ టైమ్ లో,  తక్కువ చార్జీతో ప్రయాణికులు జర్నీ చేసేందుకు ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. 2002లో స్టార్ట్ అయిన ఎంఎంటీఎస్ ఫేజ్–1 సిటీలో నిత్యం 3 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది. దీనిని విస్తరించాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఎంఎంటీఎస్ ఫేజ్–2 ప్రాజెక్టును 2012–13లో సాంక్షన్ చేసింది. ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమై ఎనిమిదేండ్లు కావొస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో పూర్తి కాలేదు. ఎంఎంటీఎస్ ఫేజ్–2 విస్తరణ కోసం రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి  మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ప్రాజెక్టు విస్తరణకు అయ్యే మొత్తం  రూ.816 కోట్లలో 1/3 వంతు (రూ.272 కోట్లు) రైల్వే భరించాల్సి ఉండగా, 2/3 వంతు  (రూ.544 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది.

రైల్వే అనుబంధ సంస్థ ఆర్ వీఎన్ఎల్ (రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ) ఈ పనులు చేపట్టింది. ఇప్పటి వరకు మొత్తం రూ.835 కోట్లు ఖర్చు కాగా.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.179 కోట్లు మాత్రమే ఇచ్చిందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు ఆలస్యం వల్ల ముందుగా రూ.816.55 కోట్లు అనుకున్న అంచనా వ్యయం పెరిగి రూ.1,150 కోట్లకు చేరింది. ఎంఎంటీఎస్–2 ప్రాజెక్టులో 80 శాతం పనులు 2019లోనే పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్లుగా తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు ఆగిందని రైల్వే యూనియన్ నేతలు చెబుతున్నారు. ఇపుడు తన వాటా నిధులు ఇస్తూ మిగతా బ్యాలెన్స్ పనులు పూర్తి చేసి, ఎంఎంటీఎస్ ఇంజిన్, రైల్ బోగీలకు ఆర్డర్ ఇచ్చేందుకు రైల్వే సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు వ్యయంలో రైల్వే శాఖ  తన వాటాగా రూ.272 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు రూ.580 కోట్లు ఖర్చు చేసింది. 

ఖాళీగా స్టేషన్ బిల్డింగ్ లు

ఎంఎంటీఎస్–2లో భాగంగా సనత్ నగర్–మౌలాలి మధ్య ఆర్వీఎన్ఎల్ కొత్త  స్టేషన్లను ఫిరోజ్ గూడ, సుచిత్ర సెంటర్, భూదేవి నగర్, నేరెడ్ మెట్, మౌలాలి హెచ్ బీ కాలనీలో స్టేషన్ బిల్డింగ్ లను మూడెండ్ల క్రితం నిర్మించారు. ప్రాజెక్టు పూర్తికాకపోవడం, రైళ్లు నడవకపోవడంతో ఆ బిల్డింగ్ లు వృథాగా మారాయి. మరోవైపు రెండో దశ మెట్రో ప్రాజెక్టు విస్తరణకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఎంఎంటీఎస్ కు నిధులు ఇవ్వకుండా మెట్రోకు వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అడగడం హాస్యాస్పదమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

4 సార్లు లేఖ రాసినా స్పందించలె 

1:2 రేషియో ప్రాతిపదికన రూ.816.55 కోట్ల అంచనా వ్యయంతో 2012–13 లో మంజూరు చేసిన ఎంఎంటీఎస్  ఫేజ్–2  ప్రాజెక్టుకు తన వాటా నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆలస్యం చేస్తోంది. పెరిగిన అంచనా వ్యయం ప్రకారం మొత్తం ప్రాజెక్టు విలువ దాదాపు రూ.1,122 కోట్లకు పెరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.760 కోట్లు చెల్లించవలసి ఉంది. కానీ, ఇప్పటి వరకు రూ.179 కోట్లే చెల్లించింది. కేంద్రం తన వాటాగా రూ.374 కోట్లు చెల్లించవలసి ఉండగా.. ఇప్పటికే రూ.790 కోట్లు ఖర్చు చేసింది. ఇదే విషయంపై సీఎం  కేసీఆర్ కు  వ్యక్తిగతంగా నేను 4 సార్లు లేఖలు రాసినా స్పందన లేదు. మరి ఎంఎంటీఎస్ ఫేజ్–2  ప్రాజెక్టు పూర్తి కావడానికి సహకరించనిది కేంద్ర ప్రభుత్వమా? కేసీఆర్ ప్రభుత్వమా? - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

నిధులు ఇస్తరా ఇవ్వరా? 

రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇస్తదా? ఇవ్వదా? అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలి. వాటా నిధులు విడుదల చేస్తే మిగతా పనులు పూర్తి చేయడంతో పాటు రైల్ ర్యాక్ లకు ఆర్డర్ ఇచ్చేందుకు రైల్వే రెడీగా ఉంది. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను విస్త రిస్తామని, 2/3 వంతు ఖర్చును తామే భరిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. కానీ నిధులు ఇయ్యలే. - నూర్, జోనల్ సెక్రటరీ, రైల్వే వినియోగదారుల సంప్రదింపుల సలహా కమిటీ