గతేడాది అత్యధికంగా 664 మందిపై పీడీ యాక్ట్

గతేడాది అత్యధికంగా 664 మందిపై పీడీ యాక్ట్

ప్రివెంటివ్  డిటెన్షన్‌ (పీడీ) యాక్ట్‌ ను గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ప్రయోగించిన తరువాత.. దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ యాక్ట్‌ ప్రకారం రాజాసింగ్‌ కనీసం మూడు నెలల పాటు తప్పనిసరిగా జైలులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు, హైకోర్టులో అనుకూలమైన తీర్పు వస్తే తప్ప.. పీడీ యాక్ట్ కేసులో ఏడాది పాటు జైలు గోడలకే పరిమితం కావాల్సి వస్తుంది. రాష్ట్రంలో తీవ్రమైన నేరాలకు పాల్పడేవారు, ప్రజల్లో భయాందోళనలు కలిగించేవారు, రౌడీషీటర్లు సహా మొత్తం15 రకాల నేరాలకు పాల్పడే నిందితులపై ఈ యాక్ట్ ను ప్రయోగిస్తున్నారు. ఇందులో భాగంగా 2017 సంవత్సరంలో అప్పటి హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అసెంబ్లీలో చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టారు. 2018లో దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది.

కల్తీ విత్తనాలు, ఆహార పదార్థాల కల్తీ, నకిలీ ఎరువులు, ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ సర్టిఫికెట్స్‌, గేమింగ్‌, సైబర్‌ ‌నేరగాళ్లు సహా రిపీటెడ్‌గా నేరాలు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీని అమలుకు డిస్ట్రిక్‌ కలెక్టర్‌‌ లేదా మెజిస్ట్రేట్, ఎస్‌పీ స్థాయి అధికారి, స్వచ్ఛంద కార్యకర్తలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ నేరాలు చేసిన దొంగలు, చైన్‌స్నాచర్లు, రౌడీషీటర్స్, ఆన్‌లైన్‌ మోసగాళ్ళు, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌కి పాల్పడుతున్న పాత నేరస్తులపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించి జైళ్లలో నిర్భందిస్తున్నారు. గత ఎనిమిదేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,573 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇందులో గతేడాది అత్యధికంగా 664 మందిపై ఈ చట్టాన్ని ప్రయోగించి జైలుకు పంపారు.

అడ్వైజరీ బోర్డ్‌ పరిధిలోనే పీడీ యాక్ట్‌

సాధారణంగా పీడీ యాక్ట్‌ కేసులు అడ్వైజరీ బోర్డ్‌ పరిధిలో ఉంటాయి. ముగ్గురు రిటైర్డ్‌ జడ్జీలతో కూడిన అడ్వైజరీ బోర్డ్‌ పీడీ యాక్ట్‌ ప్రొసీజర్స్‌ను పరిశీలిస్తుంది.ఈ బోర్డులో చైర్మన్‌, సభ్యులుగా ఇద్దరు రిటైర్డ్‌ జడ్జీలు ఉంటారు. పోలీసులు అందించిన పీడీ ప్రతిపాదనలను, కేసుల వివరాలను అడ్వైజరీ బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది. పీడీ నమోదైన నెల రోజులలోపు నిందితున్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారిస్తుంది. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలను పరిశీలిస్తుంది. నిందితుని నుంచి వివరాలు తీసుకుంటుంది. పోలీసులు అక్రమ కేసులు పెట్టారని గుర్తిస్తే పీడీ యాక్ట్‌ను ఎత్తివేస్తుంది. పోలీసులు అందించిన ఆధారాలు నిజమని నిర్ధారణ అయితే ఏడాదికాలం వరకు జైలులోనే నిర్భంధించాలని ఆదేశిస్తుంది.

ప్రొసీజర్‌‌ ఫాలో అవుతున్నారా ?

పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లిన వారికి కోర్టులో బెయిల్‌ వేసుకునే అవకాశాలు ఉండవు. నెల రోజుల వ్యవధిలో అడ్వైజరీ బోర్డు జరిపే మొదటి విచారణ కీలకంగా మారుతుంది. ఇచ్చిన ఆదేశాలే జైలుకు ఫైనల్‌ ఆర్డర్స్ అవుతాయి. ఆ తరువాత పీడీ యాక్ట్‌ను సవాలు  చేస్తూ నిందితులు అడ్వకేట్‌ ద్వారా హైకోర్టులో పిటిషన్ ఫైల్‌ చేసే అకాశం ఉంటుంది. ఈ క్రమంలో హైకోర్టులో విచారణకు వచ్చిన చాలా కేసుల్లో పీడీ యాక్ట్‌ను ఎత్తివేశారు. పోలీసులు సరైన ప్రొసీజర్‌ ‌ఫాలో కాకపోవడం, కేసుల తీవ్రత తక్కువగా ఉన్న నేరాల్లో పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తున్నారని కోర్టులు అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది పీడీ యాక్ట్‌లపై పోలీసులు వెనక్కు తగ్గారు. గతేడాదితో పోల్చితే సుమారు 60 శాతం పీడీ ప్రపోజల్స్‌విరమించుకున్నారు. అయినప్పటికీ జైళ్లలో ఈ యాక్ట్‌పై నిర్భంధంలో ఉన్న వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది.

గత మూడేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా పీడీ కేసులు

2019     360
2020     350
2021     664
2022     210 (ఈ నెల 26 వరకు)

గ్రేటర్‌‌ హైదరాబాద్‌లోని 3 కమిషనరేట్లలో భారీగా..

కమిషనరేట్          2021                            2022 (ఈ నెల 26 ‌వరకు)
హైదరాబాద్           201                               20
సైబరాబాద్            201                               22
రాచకొండ              172                               127
మొత్తం                   574                               169