పాంప్లెట్లతోనే చిన్నపాటి ఉద్యమం

పాంప్లెట్లతోనే చిన్నపాటి ఉద్యమం

దేశానికి సేవ చేసిన లేదా యుద్ధంలో పాల్గొన్న వాళ్లకు చాలా దేశభక్తి ఉందని అంటుంటారు. అయితే దేశం తప్పు చేస్తున్నప్పుడు ‘ఇది తప్పు’ అని చెప్పడం కూడా దేశ భక్తే అంటోంది సోఫీ. తన దేశం కోసం ఏకంగా హిట్లర్‌‌‌‌‌‌‌‌నే ఎదిరించిన ఇరవయ్యేండ్ల సోఫీ కథ ప్రపంచానికి అంతగా తెలియదు. కేవలం పాంప్లెట్లతోనే చిన్నపాటి ఉద్యమం నడిపిన సోఫీ యువతను ఎలా ఇన్‌‌‌‌స్పైర్ చేసిందో చెప్పేదే ఈ కథనం...

జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి. జర్మన్ యువత అంతా నాజీల కోసం పని చేస్తూ బిజీగా ఉన్నారు. ఇరవయ్యేండ్ల సోఫీ షల్స్ కూడా రకరకాల యాక్టివిటీస్‌‌‌‌లో పాల్గొంటూ అన్నింట్లో ముందుండేది. తన స్కూల్​మేట్స్ లాగానే తను కూడా ‘నాజీ రన్’, ‘లీగ్ ఆఫ్ జర్మన్ గర్ల్స్’ లాంటి యూత్ ప్రోగ్రామ్స్‌‌‌‌లో పాల్గొనేది. సోఫీ హై స్కూల్ చదువు పూర్తయ్యేనాటికి జర్మనీ యుద్ధం చేస్తూనే ఉంది. తన అన్నదమ్ములు ఇద్దరూ యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఎప్పుడూ సరదాగా ఉండే సోఫీకి మొదటిసారి యుద్ధమంటే భయమేసింది. తన స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ యుద్ధంలో చనిపోతారేమో అన్న సందేహం వెంటాడింది. 

కళ్లారా చూసి
మనసులో యుద్ధం గురించిన ఆలోచనలు వెంటాడుతున్నా అవన్నీ పట్టించుకోకుండా చదువుకోవాలి అనుకుంది సోఫీ. బయాలజీ, ఫిలాసఫీ చదవడంకోసం ‘యూనివర్సిటీ ఆఫ్ మ్యునిచ్‌‌‌‌’లో చేరింది. అక్కడ చాలామందిని బలవంతంగా మెడికల్ సర్వీసుల్లో పనిచేయిస్తుంటారు. అలా సోఫీ కూడా నర్స్‌‌‌‌గా అక్కడ కొన్ని రోజులు పనిచేయాల్సి వచ్చింది.  సోఫీని పూర్తిగా మార్చేసిన రోజులవి.  నాజీల ఆలోచనలు, యూదుల విషయంలో హిట్లర్ అరాచకాలు సోఫీకి బాగా అర్థమయ్యాయి. మానసిక రోగులను చంపడానికి గ్యాస్, విషం ఉపయోగించడం కళ్లారా చూసిన సోఫీ యంగ్ లీడర్‌‌‌‌‌‌‌‌గా మారింది.

వైట్‌‌‌‌రోజ్ మూవ్‌‌‌‌మెంట్
హింసకు వ్యతిరేకంగా ‘వైట్‌‌‌‌రోజ్‌‌‌‌ మూవ్‌‌‌‌మెంట్’ మొదలుపెట్టింది. ‘‘యుద్ధం పేరుతో క్రూరమైన పనులు చేస్తున్నాం. ఈ గిల్ట్ నుంచి మనం ఎప్పటికీ బయటకు రాలేం’’  అని మొదటి పాంప్లెట్ గోడలపై అతికించింది. తర్వాత యూదుల హత్యలను ఉద్దేశించి ‘మానవ చరిత్రలోనే ఎన్నడూ చూడని అత్యంత ఘోరమైన మారణకాండ జరుగుతోంది. దీన్ని అడ్డుకునేందుకు మనమంతా ఒకటవ్వాలి’ అనే పాంప్లెట్ వేసింది.

ప్రమాదం అర్థం కాక..
1943లో జర్మనీకి కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. ‘బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్‌గ్రాడ్’లో సోవియట్ యూనియన్ చేతిలో జర్మనీ ఓడిపోయింది. వైట్‌‌‌‌రోజ్ మూవ్​మెంట్‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లడానికి సరైన టైం వచ్చింది అనుకున్న సోఫీ పాంప్లెట్ల సంఖ్య పెంచింది. ‘డౌన్ విత్ హిట్లర్’, ‘ఫ్రీడమ్’ అని పెద్దపెద్ద గ్రాఫిటీలు వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద నియంతతో చిన్న వయసులోనే పోరాడుతున్న సోఫీకి అందులోని ప్రమాదం అర్థం కాలేదు. అందుకే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. రోడ్డు మీద ఉన్న పాంప్లెట్‌‌‌‌ ఒకటి... ఒక నాజీ కంట పడింది. అతను అధికారులకు ఆ వార్త చేరవేశాడు. వెంటనే పోలీసులు వాటిని అతికిస్తున్న సోఫీ సోదరుడు హాన్స్‌‌‌‌ను పట్టుకున్నారు. అలా సోఫీ గురించి, వైట్‌‌‌‌రోజ్ మూవ్‌‌‌‌మెంట్ గురించి  నాజీలకు తెలిసిపోయింది. వైట్‌‌‌‌రోజ్ మూవ్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఉన్న మిగతా సభ్యులను కాపాడేందుకు సోఫీ చాలా ట్రై చేసింది. కానీ, నాజీల ఇన్వెస్టిగేషన్‌‌‌‌లో అందరూ దొరికిపోయారు. అందరికీ మరణ శిక్ష విధించారు. 

ఆకాశం నుంచి  పాంప్లెట్లు
నాజీలు సోఫీని చంపగలిగారు. కానీ, ఆమె ఆశయాన్ని కాదు. మ్యూనిక్‌లోని వైట్‌‌‌‌రోజ్ సభ్యులు రాసిన  పాంప్లెట్లు అప్పట్లో రహస్యంగా ఇతర దేశాలకు రవాణా అయ్యాయి. వాళ్లు తిరిగి మిలియన్ల కాపీలను ప్రింట్ చేసి, వాటిని జర్మన్ నగరాలన్నింటిపై వెదజల్లారు. అలా ఒకరోజు వేలాది పాంప్లెట్లు ఆకాశం నుంచి మ్యునిచ్ నగరం మీద వాన జల్లులా కురిశాయి.  సోఫీ త్యాగం వృథా కాలేదని అవి రుజువు చేశాయి.

కోర్టులో ధైర్యంగా..
నాజీలకు దొరికిన సోఫీ తన ధైర్యాన్ని కోల్పోలేదు. కోర్టులో తన వాదనను గట్టిగా వినిపించింది. “మానసిక ఆసుపత్రిలో పిల్లల్ని తీసుకెళ్లడానికి ట్రక్కులు వచ్చాయి. పిల్లలు ‘ఎక్కడికి?’ అని అడిగితే ‘స్వర్గానికి’ అని చెప్పారు. దాంతో పిల్లలు ఆనందంగా ట్రక్కుల్లో ఎక్కారు. ప్రతి జీవితం ఎంతో విలువైంది. నేను వాళ్ల పట్ల జాలి పడుతున్నానని నన్ను తప్పు పడుతున్నారు. నా ప్రజల ప్రయోజనాల కోసం నేనీ పనిచేశానని ముమ్మాటికీ నమ్ముతున్నా. అందుకు ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం” అని చెప్పింది.మరొక వాదనలో “మీ దేశ రక్షణ కోసం యుద్ధాల్లో పాల్గొనడం, దేశానికి మద్దతు ఇవ్వడం మాత్రమే దేశభక్తి కాదు, దేశాధినేతలు ప్రజలకు హాని చేసే నిర్ణయాలు తీసుకున్నప్పుడు.. ‘ఆ నిర్ణయం తప్పు’ అని చెప్పడం కూడా దేశ భక్తే” అన్న సోఫీ మాటలు ఆలోచింపజేశాయి.

చివరి మాటలు
మరణశిక్ష అమలయ్యే ముందు సోఫీ చివరిగా “ఇది ఎంతో అద్భుతమైన రోజు. కానీ, ఇదే నా చివరి రోజు. నా పనుల ద్వారా, వేలాది మంది ప్రజల్ని అప్రమత్తం చేయగలిగితే, వాళ్లలో కొత్త ఆలోచనలకు ప్రాణం పోయగలిగితే నా మరణం సఫలమైనట్లే కదా?” అన్నది.