ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ధర్నా చేస్తున్నా గోస పట్టదా?
వరంగల్ లో ఆయుర్వేద స్టూడెంట్ల ఆవేదన
కాలేజీకి తాళం వేసి నిరసన

కాశిబుగ్గ, వెలుగు : వరంగల్ అనంతలక్ష్మి ఆయుర్వేద కాలేజీలో సమస్యలు పరిష్కరించాలని స్టూడెంట్లు నాలుగు రోజులుగా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో మంగళవారం ప్రజావేదిక రాష్ర్ట చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు, స్టూడెంట్లు కలిసి కాలేజీకి తాళం వేసి నిరసన తెలిపారు. కాలేజీలో సౌలతులు లేకపోవడంతో అడ్మిషన్లు కూడా రద్దు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి హరీశ్ రావుపై ఆగ్రహం..
ఆయుర్వేద స్టూడెంట్లు ధర్నాలు చేస్తున్నా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించకపోవడం దారుణమని స్టూడెంట్లు మండిపడ్డారు. కాలేజీ సమస్యలపై మంత్రికి లేఖ రాసినా స్పందించడం లేదన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు కూడా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలేజీని ఎత్తేవేయాలని కుట్ర చేస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రోత్సహిస్తున్న సర్కారు. ప్రభుత్వ కాలేజీలను ఎందుకు రక్షించడం లేదని ప్రశ్నించారు.

స్టూడెంట్లు ఆటల్లో రాణించాలి

కురవి, వెలుగు : స్టూడెంట్లు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక సూచించారు. కురవి మండలకేంద్రంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ స్టేట్ లెవెల్ ఆటల పోటీలు నిర్వహించగా.. చీఫ్ గెస్టుగా కలెక్టర్ హాజరై పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలోని 23 ఏకలవ్య స్కూళ్లకు చెందిన 1300 మంది క్రీడాకారులు, 42 మంది ఫిజికల్ డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆటలకు కూడా టీచర్లు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆటల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఆర్సీవో రాజ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో అంకిత్ కుమార్, గురుకులాల డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్, ఓఎస్డీ స్వర్ణలత, ఆర్డీవో కొమురయ్య, ఎంపీపీ గుగులోతు పద్మ, సర్పంచ్ పద్మ తదితరులున్నారు.

రేషన్ బియ్యం అందరికీ అందాలి
జనగామ అర్బన్ :
రేషన్ బియ్యం అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని జనగామ కలెక్టర్​ శివలింగయ్య ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కొత్తగా ఏర్పాటు చేసిన విజిలెన్స్ కమిటీతో ఆయన మీటింగ్ నిర్వహించారు. జిల్లాలోని 12 మండలాల్లోని 1,61,235 లబ్ధిదారులకు 4127 మెట్రిక్ టన్నుల రేషన్ అందుతోందన్నారు. విజిలెన్స్ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి, అందరికీ అందుతున్నాయో లేవో చూడాలన్నారు. రేషన్ షాపుల్లోని బోర్డులపై స్టాక్ వివరాలు తెలపాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఎస్​వో రోజారాణి, డీఎం సంధ్యారాణి, డీఆర్డీవో రాంరెడ్డి, జడ్పీ సీఈవో వసంత తదితరులున్నారు.

కార్మిక బీమా స్వాహా చేసేందుకు తప్పుడు చలాన్ల సృష్టి

  • సొంత అల్లుడిని ఏజెంట్​గా పెట్టుకుని దందాకు తెరలేపిన పరకాల ఏఎల్​వో
  • ఏడుగురు ఏజెంట్లను అరెస్ట్ చేసిన టాస్క్​ ఫోర్స్​ పోలీసులు
     

హనుమకొండ, వెలుగు : తప్పుడు చలాన్లతో లేబర్​ ఇన్సూరెన్స్ కాజేసేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను వరంగల్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. లేబర్​ డిపార్ట్​మెంట్​ లో పని చేసే ఓ ఆఫీసర్, ఏజెంట్ల ద్వారా  ఈ దందాకు యత్నించగా.. ఏడుగురిని  అరెస్ట్​ చేసి, వారి నుంచి రూ.10 వేల నగదు, బీమా క్లెయిమ్ పేపర్స్​​, ఒక కంప్యూటర్​, ఒక సెల్​ ఫోన్​ సీజ్​ చేశారు. వరంగల్​ పోలీస్​ కమిషనర్​ డా.తరుణ్​ జోషి అరెస్ట్​కు సంబంధించిన వివరాలను మంగళవారం వెల్లడించారు. లేబర్ కార్డు లబ్ధిదారులు చనిపోతే ప్రభుత్వం బీమా కల్పిస్తోంది. సదరు కుటుంబసభ్యులు దరఖాస్తు చేసుకుంటే అసిస్టెంట్ లేబర్​ఆఫీసర్(ఏఎల్​వో)లు క్షేత్రస్థాయిలో విచారణ చేసి, క్లెయిమ్స్ ఓకే చేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో పరకాల ఏఎల్​వో రాజకుమారి.. తన అల్లుడైన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన భూమిహర్ ​భాస్కర్ ను ఏజెంట్​గా నియమించుకుంది. అతడి ద్వారానే ఎంక్వైరీ జరిపించి, రిపోర్టులు ప్రభుత్వానికి ఇచ్చేది. దీంతో భాస్కర్ తప్పుడు క్లెయిమ్స్ సమర్పించి, బీమా పొందాలనే ప్లాన్ చేశాడు. ఇందుకోసం మరికొంతమంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. పరకాల ఎస్సీ కాలనీకి చెందిన బొచ్చు బిక్షపతి, వర్ధన్నపేట చంద్రు తండాకు చెందిన మాలోతు నెహ్రూ, మాలోతు వీరస్వామి, మాలోతు రవి, మాలోతు శ్రీను, హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన అర్షం కుమారస్వామి అలియాస్​ పెద్దబాబును ఏజెంట్లుగా నియమించుకున్నాడు. 

చనిపోయిన వ్యక్తులకు లేబర్​ కార్డులు
లేబర్​ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే దందాకు తెరలేపిన ఈ ఏజెంట్లంతా గ్రామాల్లో లేబర్​కార్డులు లేకుండా మరణించిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించేవారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను సంప్రదించి కార్మిక బీమా ఇప్పిస్తామని, డబ్బులు అకౌంట్లో పడిన తరువాత తమకు కమీషన్ ఇవ్వాలని చెప్పేవారు. ఇలా ముందుగా రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేసేవారు. ఇలా గ్రామాల్లో చనిపోయిన వ్యక్తులకు లేబర్ కార్డులు, డెత్​ సర్టిఫికేట్స్ ​సృష్టించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందాలని ప్రయత్నించారు. మొత్తం 29 తప్పుడు చలాన్లను లేబర్ ఆఫీస్ లో సమర్పించారు. ఈ దందా గురించి సమాచారం అందుకున్న వరంగల్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు.. గుట్టుగా వివరాలు సేకరించారు. ఈ మేరకు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ దందాలో సూత్రధారిగా వ్యవహరించిన పరకాల ఏఎల్​వో పై ఎలాంటి యాక్షన్​ తీసుకోలేదు. దర్యాప్తు తరువాత ఆమెపైనా చర్యలు ఉంటాయని పోలీసులు చెప్పారు. ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ అడిషనల్​ డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ జితేందర్ రెడ్డి, సీఐ నరేష్ కుమార్, ఎస్సై  లవన్​ కుమార్,  ఎస్సైలు  రామారావు, రాజు, సుమన్, వీరభద్రయ్య, ఇతర సిబ్బంది  శ్యాంసుందర్, అశోక్, స్వర్ణలత,  నాగరాజు, సృజన్, సురేష్, నవీన్, శ్యాం, శ్రీనులను సీపీ డా.తరుణ్​ జోషి 
అభినందించారు. 

‘ఈటలకు హానిచేస్తే ఊరుకునేది లేదు’
 

  • ఈటల కాన్వాయ్ పై దాడికి నిరసనగా బీజేపీ లీడర్ల ధర్నా
  • కేసీఆర్ తో సహా ఎమ్మెల్యేల దిష్టిబొమ్మల దహనం

వెలుగు నెట్ వర్క్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు హాని చేస్తే.. రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని బీజేపీ లీడర్లు హెచ్చరించారు. మునుగోడులో ఈటల కాన్వాయ్ పై టీఆర్ఎస్ దాడిని నిరసిస్తూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. రోడ్లపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈటల సొంతూరు కమలాపూర్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ పార్టీ లీడర్లు మాట్లాడుతూ.. మునుగోడులో ఓటమి భయంతోనే కేసీఆర్... ఈటలపై దాడి చేయించారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కుట్రలో పాలుపంచుకున్నారని ఆరోపించారు. బీసీ నేతపై దాడి చేయాలని చూస్తే.. యావత్ బీసీలంతా టీఆర్ఎస్ పై తిరగబడతారని వార్నింగ్ ఇచ్చారు.

టీఎన్జీవోస్ వైఖరి అభ్యంతరకరం
టీఈఏ ప్రతినిధుల మండిపాటు

ములుగు, వెలుగు : రాష్ట్రంలో టీఎన్జీవోస్ నాయకుల వైఖరి అభ్యంతరకరమని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్(టీఈఏ) ములుగు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుల్లగట్టు సంజీవ, అన్నవరం రవికాంత్ విమర్శించారు. టీఎన్జీవోస్ ప్రతినిధులు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా స్వార్థంతో పని చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ములుగులో వారు నిరసన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం పోరాడాల్సిన టీఎన్జీవోస్ లీడర్లు.. రాజకీయాలు చేస్తూ ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. జీవో 317, పెండింగ్ డీఏ, పీఆర్సీ బకాయిలు, ట్రాన్స్ ఫర్లు, ప్రమోషన్లు, సీపీఎస్ రద్దు గురించి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగుల తరఫున ఆందోళన చేయాలని డిమాండ్ చేశారు. టీఈఏ జిల్లా గౌరవాధ్యక్షుడు మడుగూరి నాగేశ్వరరావు, కోశాధికారి పి.సరిత, జిల్లా ఉపాధ్యక్షుడు బోడ కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు కలాలి మొగిలి తదితరులున్నారు.

ట్రైబల్ యూనివర్సిటీ క్లాసులు ప్రారంభించాలి
ఆంధ్రాలో స్టార్ట్ అయినయ్.. ఇక్కడెందుకు కాలే? : మాజీ ఎంపీ సీతారాం నాయక్

ములుగు, వెలుగు : ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ క్లాసులు ప్రారంభించాలని మాజీ ఎంపీ సీతారాం నాయక్ కేంద్రాన్ని  డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. మంగళవారం ములుగు జిల్లాకేంద్రంలో గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం గిరిజనుల హక్కులను కాలరాస్తోందని, గిరిజన స్టూడెంట్లకు ఏడు శాతమే రిజర్వేషన్ కల్పిస్తోందన్నారు. ఏపీలో 2016లోనే తాత్కాలిక తరగతులు ప్రారంభమయ్యాయని, ఇక్కడెందుకు ప్రారంభించడం లేదని మండిపడ్డారు. యూనివర్సిటీ కోసం రాష్ట్రం 317ఎకరాల భూమి కేటాయించినా.. కేంద్రం క్లాసులు స్టార్ట్ చేయడం లేదన్నారు. యూనివర్సిటీ కోసం కేటాయించిన భూమిలో నేడు నిరసన దీక్ష చేపడతామన్నారు.

ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వరంగల్ అభివృద్ధి
హనుమకొండ సిటీ, వెలుగు :
వరంగల్ అభివృద్ధి జరగాలంటే తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గత నెల రోజులుగా ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను గాలికొదిలి మునుగోడులో మంగళహారతులు పడుతున్నారని విమర్శించారు. ఇరువురూ కేసీఆర్ బానిసల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే నరేందర్ నేతన్నల ఆత్మగౌరవాన్ని దెబ్బతిసేలా ప్రవర్తించితే.. మరో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ​మునుగోడులో యువతకు మద్యం పోస్తూ బిజీగా మారారని ఎద్దేవా చేశారు. మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నేతలు ఈటలపై దాడులు చేయించారని మండిపడ్డారు.

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
స్టేషన్ ఘన్​పూర్, వెలుగు :
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల నరేందర్​రెడ్డి అన్నారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ మండలంలోని సముద్రాల, రంగరాయగూడెం, అక్కపల్లిగూడెం గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు. రైతులు దళారులకు అమ్ముకుని మోసపోవద్దని సూచించారు. ‘ఏ’ గ్రేడ్​ రకానికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు చెప్పారు.

సెంటర్ల కోసం ఎదురుచూపులు..
హసన్ పర్తి, వెలుగు :
హనుమకొండ జిల్లాలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి కోతలు ప్రారంభమై రెండు వారాలైనా.. సెంటర్లు ఓపెన్ చేయలేదు. దీంతో రైతులు రోజూ వడ్లను ఆరబోస్తూ.. కుప్పనూర్చుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వాన వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా వడ్ల రాశులే కనిపిస్తున్నాయి.

రౌడీ షీటర్లు తీరు మార్చుకోవాలి
జనగామ అర్బన్ :
రౌడీ షీటర్లు తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని జనగామ ఏసీపీ కె.దేవేందర్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జనగామ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ల్యాండ్, క్రిమినల్ కేసుల్లో తలదూర్చితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. మధ్యవర్తిగా వ్యవహరించినా, శాంతి భద్రతలకు భంగం కలిగించినా చర్యలు తప్పవన్నారు. సీఐ శ్రీనివాస్ యాదవ్, ఎస్సైలు కె.శ్రీనివాస్, భోగం ప్రవీణ్ కుమార్, జీనత్ కుమార్ తదితరులున్నారు.