అవినీతిపై ప్రచారం, ఉచితాలే గట్టెక్కించినయ్.. ఫలితాలపై విశ్లేషకుల అంచనా

అవినీతిపై ప్రచారం, ఉచితాలే గట్టెక్కించినయ్.. ఫలితాలపై విశ్లేషకుల అంచనా

అవినీతిపై ప్రచారం, ఉచితాలే గట్టెక్కించినయ్
ఫలితాలపై విశ్లేషకుల అంచనా

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ‘40% కమీషన్’ సర్కార్ అంటూ అవినీతి ఆరోపణలతో ముమ్మర ప్రచారం చేయ డం, ఉచిత హామీలే కాంగ్రెస్ ను గట్టెక్కించాయని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం ఓట్లను పోలరైజేషన్ చేయడంలోనూ సక్సెస్ కావడం వల్లే కాంగ్రెస్​కు ఘన విజయం దక్కిందని చెప్తున్నారు. అదానీ వివాదంతో, అమూల్ డైరీతో ముడిపెడుతూ బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడంతో ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ క్యాష్ చేసుకుందని పేర్కొంటున్నారు.

ఇక బీజేపీని గద్దె దించడంలో కాంగ్రెస్ ప్రకటించిన ఉచితాలు కూడా బాగా పని చేశాయని భావిస్తున్నారు. గృహ జ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, గృహ లక్ష్మి పథకం కింద కుటుంబంలో మహిళకు ప్రతినెలా రూ. 2 వేల సాయం, అన్న భాగ్య స్కీం కింద ఒక్కొక్కరికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం, యువ నిధి స్కీం కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ. 3 వేల భృతి, డిప్లొమా హోల్డర్లకు రూ.1500 భృతి, మహిళలకు ఉచిత ప్రయాణం వంటి కాంగ్రెస్ హామీలు ఓటర్లపై ప్రభావం చూపాయని అంచనా వేస్తున్నారు. కర్నాటక ఓటర్లలో దాదాపు 13 శాతం ఉన్న ముస్లిం ఓటర్లు సాధారణంగా కాంగ్రెస్, జేడీఎస్ కు చెరో సగం దాకా ఫేవర్ గా ఉంటారు. ఈ సారి వీరిలో ఎక్కువ మందిని తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ కావడం కూడా ఎన్నికల్లో ఘన విజయానికి కీలకం అయిందని భావిస్తున్నారు.