మండుతున్న ఎండలు.. రికార్డ్ స్థాయిలో టెంపరేచర్లు

మండుతున్న ఎండలు..  రికార్డ్ స్థాయిలో టెంపరేచర్లు
  • మండుతున్న ఎండలు.. రికార్డ్ స్థాయిలోటెంపరేచర్లు
  • మహబూబ్​నగర్ జిల్లా వడ్డేమాన్​లో 44.4 డిగ్రీలు
  • హైదరాబాద్​లో పొద్దంతా ఎండ.. సాయంత్రం వాన

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడికి ఉక్కపోత తోడవుతున్నది. గురువారం కొన్నిచోట్ల టెంపరేచర్ రెడ్ అలర్ట్​కు దగ్గరగా రికార్డయ్యింది. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీల పైనే నమోదైంది. అత్యధికంగా మహబూబ్​నగర్ జిల్లాలోని వడ్డేమాన్​లో 44.4 డిగ్రీలు రికార్డయ్యింది.

కుమ్రంభీం ఆసిఫాబాద్​లోని కౌటాలలో 44.2 డిగ్రీలు, జయశంకర్ జిల్లా మహదేవ్​పూర్​లో 44 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల జిల్లా మార్ధానపేటలో 43.9 డిగ్రీలు, హనుమకొండ జిల్లా ధర్మసాగర్, ఆదిలాబాద్ జిల్లా భోరజ్​లో 43.7 డిగ్రీలు నమోదైంది. ఖమ్మం జిల్లా రావినూతల, జనగామలోని జాఫర్​గఢ్​లలో 43.6 డిగ్రీలు, నల్గొండ జిల్లా కట్టంగూర్, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 43.5 డిగ్రీల మేర టెంపరేచర్​ రికార్డయ్యింది. గతంలో మే నెల ప్రారంభంలో ఈ స్థాయి ఎండలు ఉండేవి. కానీ ఇప్పుడు ఏప్రిల్​ రెండో వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. నిరుడు ఏప్రిల్​లో ఇదే టైంకు తెలంగాణలో యావరేజ్​ టెంపరేచర్ 40 డిగ్రీలు, హైదరాబాద్​లో 37 డిగ్రీలు ఉండేది. ఇప్పుడు దీన్ని మించి నమోదవుతున్నాయి. హైదరాబాద్​లో గురువారం అత్యధికంగా 39.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. మే, రోహిణి కార్తె వచ్చేసరికి రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.

గాలిలో పెరిగిన తేమ శాతం

రాబోయే ఐదు రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ గురువారం హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో గాలిలో తేమ శాతం రికార్డు స్థాయిలో నమోదైంది. ఖమ్మం జిల్లా వైరాలో గరిష్టంగా గాలిలో తేమ 100 శాతం రికార్డయింది. పెద్దపల్లి, జగిత్యాల, ఆసిఫాబాద్​, కొత్తగూడెం, వరంగల్​, యాదాద్రి భువనగిరి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఉక్కపోత 95 నుంచి 100 శాతం మధ్యలో నమోదైంది. ఆయా జిల్లాల్లో టెంపరేచర్లు కూడా రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. అయితే, రెండు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

హైదరాబాద్​లో పలుచోట్ల వాన

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నా.. హైదరాబాద్ సిటీలో మాత్రం విభిన్న పరిస్థితులు ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి ఎండతో పాటు తీవ్ర ఉక్కపోతతో జనం సతమతమయ్యారు. అక్కడక్కడ మబ్బులు పట్టి వేడి తగ్గినట్టనిపించినా ఉక్కపోతతో ఇబ్బందిపడ్డారు. సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. సరూర్​నగర్ పరిధిలోని విరాట్​నగర్​లో 1.9 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. సరూర్​నగర్, లింగోజీగూడ, బండ్లగూడ, సైదాబాద్, రాజేంద్రనగర్, నాంపల్లి, లక్డీకాపూల్, ఉప్పల్, ముషీరాబాద్, సికింద్రాబాద్, అంబర్​పేట తదితర ప్రాంతాల్లో వాన పడింది. హిమాయత్​నగర్, దిల్​సుఖ్​నగర్​ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఆసిఫాబాద్ జిల్లా జంబుగలోనూ చిరు జల్లులు కురిశాయి. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్​లో పిడుగులు పడ్డాయి.