డీకేపై కేసు కొట్టేసిన సుప్రీం

డీకేపై కేసు కొట్టేసిన సుప్రీం
  •  మనీలాండరింగ్​కు ఆధారాల్లేవన్న సుప్రీం కోర్టు
  • సుప్రీం తీర్పుతో భారీ ఊరట కలిగిందన్న డీకే

న్యూఢిల్లీ: కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఎన్ ఫోర్స్ మెంట్​ డైరెక్టరేట్​ ఆయనపై నమోదు చేసిన మనీలాండరింగ్​ కేసును అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. ట్యాక్స్ ఎగవేత, హవాలా ట్రాన్సాక్షన్లు చేశారనే ఆరోపణలతో 2018లో ఈడీ శివకుమార్​పై కేసు పెట్టింది. 2019 సెప్టెంబర్​లో అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆపై నెలరోజుల్లోనే ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వగా, కేసు కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం విచారించిన సుప్రీం కోర్టు.. శివకుమార్​పై ఈడీ మోపిన అభియోగాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. 

మనీలాండరింగ్​కు సంబంధించి సరైన ఆధారాలు లేవంటూ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ ఈ కేసును కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో తనకు భారీ ఊరట కలిగిందని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు. అక్రమ కేసులతో బీజేపీ తనపై కక్ష సాధింపునకు పాల్పడిందని ఆరోపించారు. తాను మొదటి నుంచీ చెబుతున్నట్లు ఇవి ఉద్దేశపూర్వకంగా, తనను ఇబ్బంది పెట్టేందుకు పెట్టిన కేసులని సుప్రీం తీర్పుతో తేలిపోయిందన్నారు. ఈ కేసుల కారణంగా తాను ఎంతగానో ఇబ్బంది పడ్డానని డీకే వివరించారు.

అధికారులు పెట్టిన కేసు ఏంటి..

2017లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ సహాయకుల ఇళ్లల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు రెయిడ్స్ చేశారు. డీకే అనుచరుల ఇళ్లు, ఇతరత్రా ప్రదేశాల్లో సోదాలు చేయగా రూ.300 కోట్ల నగదు దొరికిందని అధికారులు ప్రకటించారు. ఈ సొమ్ముకు సంబంధించి ఎలాంటి లెక్కలు చూపకుండా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందులో మనీలాండరింగ్​ వ్యవహారం కూడా ఉండడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కూడా రంగంలోకి దిగారు. 

హవాలా ట్రాన్సాక్షన్లు చేశారంటూ డీకే పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం 2019లో డీకేను అధికారులు అరెస్టు చేశారు. అయితే, పట్టుబడ్డ సొమ్మంతా బీజేపీ నేతలదేనని, తనపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తప్పుడు కేసులు బనాయించారని డీకే ఆరోపించారు. ఈ కేసును డీకే శివకుమార్ కర్నాటక హైకోర్టులో సవాల్​ చేయగా.. అక్కడ కూడా డీకేకు ఊరట లభించలేదు. దీంతో డీకే తరఫున ఆయన లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

సీబీఐకి ఇచ్చిన ఆమోదం వెనక్కి..

డీకే శివకుమార్​పై నమోదైన అవినీతి కేసు విచారణకు అప్పట్లో బీజేపీ ప్రభుత్వం సీబీఐకి అనుమతిచ్చింది. అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో గత ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన అనుమతిని సిద్ధరామయ్య ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు ఎదురయ్యాయి. ప్రతిపక్ష బీజేపీ నేతలు కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. కర్నాటక ప్రభుత్వ నిర్ణయంపై సీబీఐ కూడా కోర్టులో సవాల్​ చేసింది.