రాజకీయాల్లోకి మతాన్ని తేవద్దు : సుప్రీంకోర్టు

రాజకీయాల్లోకి మతాన్ని తేవద్దు : సుప్రీంకోర్టు

అప్పుడే దేశంలో విద్వేష ప్రసంగాలకు ముగింపు : సుప్రీం

న్యూఢిల్లీ :  నాయకులు రాజకీయాల్లో మత ప్రస్తావన తీసుకురానప్పుడే హేట్ స్పీచ్ లకు ముగింపు పలికే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పాలిటిక్స్, రిలీజియన్ రెండూ వేర్వేరు విషయాలని, వాటిని మిక్స్ చేయొద్దని స్పష్టం చేసింది. విద్వేష వ్యాఖ్యలు చేసే వ్యక్తులపై కంప్లయింట్లు వచ్చే దాకా ఎదురుచూడకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలని అభిప్రాయపడింది. ఇతర మతాలు, కమ్యూనిటీలపై విద్వేష వ్యాఖ్యలు చేయబోమని దేశ ప్రజలంతా ఎందుకు ప్రతిజ్ఞ చేయకూడదని ప్రశ్నించింది.

హేట్ స్పీచ్​లు ఇస్తున్న వ్యక్తులపై ఎఫ్ఐఆర్​లు ఫైల్ చేయకుండా మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాయంటూ కేరళకు చెందిన షహీన్ అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న బెంచ్ బుధవారం విచారించింది. మాజీ ప్రధానులు నెహ్రూ, వాజ్ పేయి వంటి నేతలు మాట్లాడితే వినేందుకు జనం గుమిగూడేవారని, ప్రస్తుత లీడర్లు వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది. 

ప్రభుత్వాలే చర్యలు తీస్కోవాలె.. 

కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. పిటిషనర్ కావాలనే కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అంశాలను మాత్రమే ప్రశ్నిస్తూ పిటిషన్ వేశారని చెప్పారు. తమిళనాడులో డీఎంకే నేత ఒకరు విద్వేష వ్యాఖ్యలు చేసినా, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పిటిషన్​లో చేర్చలేదన్నారు. కేరళలోనూ ఓ వ్యక్తి ఇతర మతంవారిపై విద్వేష వ్యాఖ్యలు చేశాడని, ఆ విషయాన్నీ పిటిషనర్ పట్టించుకోలేదన్నారు. ఇందులో కేరళ ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇవ్వాలన్నారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. ఒకటి తర్వాత ఒకటి ఇలా వరుసగా కోర్టు ధిక్కరణ కేసులను స్వీకరిస్తూ పోవడం సాధ్యం కాదని, విద్వేష వ్యాఖ్యలు చేసిన వారిపై ఫిర్యాదుల కోసం చూడకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని బెంచ్ అభిప్రాయపడింది. పిటిషన్ పై స్పందన తెలియజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.