ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీల కోటా రాష్ట్రాల ఇష్టం

ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీల కోటా రాష్ట్రాల ఇష్టం
  • దీనిపై ఎలాంటి స్టాండర్డ్స్ నెలకొల్పలేం: సుప్రీంకోర్టు 
  • ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు లెక్కలు తీయాలని సూచన 
    న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్ల విషయంపై తాము ఎలాంటి స్టాండర్డ్స్ ను నెలకొల్పలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు విషయాన్ని చూస్కోవాలని స్పష్టం చేసింది. ప్రమోషన్లలో రిజర్వేషన్ల విషయంలో స్టాండర్డ్స్ ను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్ పై ఈ మేరకు శుక్రవారం జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్ ల బెంచ్ తీర్పు చెప్పింది. ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యంలో ఉన్న అసమానత్వంపై లెక్కలను సేకరించడం, ప్రమోషన్లలో తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందని కోర్టు తెలిపింది. అయితే, క్యాడర్, గ్రేడ్/కేటగిరీల వారీగా మాత్రమే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రాతినిధ్యంపై లెక్కలు తీయాలని, మొత్తం సర్వీసును పరిగణనలోకి తీసుకుంటే మాత్రం దానికి అర్థం ఉండదని సూచించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు నిరుడు అక్టోబర్ 26న తీర్పును రిజర్వ్ చేసింది. అంతకుముందు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఏండ్ల తరబడి అన్యాయం జరుగుతోందని, ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు అనుసరించేందుకు కచ్చితమైన స్టాండర్డ్స్ ను సూచించాలని కోరారు. లేకపోతే ప్రభుత్వాల నిర్ణయాలతో అనేక లిటిగేషన్లు వచ్చే అవకాశం ఉందని, సమస్యకు ముగింపు అనేది ఉండదన్నారు. అయితే, గతంలో జర్నైల్ సింగ్, ఎం. నాగరాజు కేసుల్లో విచారణ సందర్భంగానూ సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు బెంచ్ చెప్పింది. ప్రమోషన్లలో రిజర్వేషన్లను నిర్ణయించడానికి తమ వద్ద ఎలాంటి కొలమానాలూ లేవని పేర్కొంది.