ఇమ్రాన్ ఓడితే.. అదేరోజు కొత్త పీఎం 

ఇమ్రాన్ ఓడితే.. అదేరోజు కొత్త పీఎం 

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ ఖాన్​కు ఎదురుదెబ్బ తగిలింది. అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడాన్ని, నేషనల్​ అసెంబ్లీ(పార్లమెంట్ దిగువ సభ)ని రద్దు చేయడాన్ని పాకిస్తాన్ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. విదేశీ కుట్ర ఉందన్న సాకుతో అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్​ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేపీ) ఉమర్​ అటా బందియాల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్​ తీర్పు ఇచ్చింది. అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడం సరికాదని, డిప్యూటీ స్పీకర్​ రూలింగ్​ రాజ్యాంగంలోని ఆర్టికల్​ 95కు వ్యతిరేకమని ప్రకటించింది. అలాగే పాక్​ నేషనల్​ అసెంబ్లీని రద్దు చేస్తూ అధ్యక్షుడు జారీ చేసిన ఆదేశాలు కూడా చట్ట వ్యతిరేకమైనవని పేర్కొంది. అసెంబ్లీ రద్దు చేయాలంటూ సిఫార్సు చేసే అర్హత అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న ఇమ్రాన్​ ఖాన్​కు లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. జాతీయ అసెంబ్లీని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించిన ధర్మాసనం.. ఏప్రిల్​ 9న(శనివారం) ఉదయం 10.30కు అసెంబ్లీ సెషన్​ నిర్వహించాలని, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్​ పెట్టాలని స్పీకర్​ను ఆదేశించింది.  

శనివారం అసెంబ్లీలో ఓటింగ్

ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్​ 3న ఓటింగ్​ జరగాల్సి ఉండగా.. ఇమ్రాన్​ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయంటూ డిప్యూటీ స్పీకర్​ ఖాసిం సురి ఆవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు. ఆ వెంటనే ఇమ్రాన్ ఖాన్​ సిఫార్సు మేరకు ప్రెసిడెంట్​ ఆరిఫ్​ ఆల్వీ నేషనల్​ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నాలుగు రోజులుగా విచారణ సాగింది. గురువారం తుది తీర్పు ప్రకటించింది. 

ఇమ్రాన్ ఓడితే.. అదేరోజు కొత్త పీఎం 

శనివారం జరిగే ఓటింగ్​లో ఇమ్రాన్​ ఖాన్ ఓటమిపాలైతే.. అసెంబ్లీ అదే రోజు కొత్త ప్రధాన మంత్రిని ఎన్నుకుంటుంది. కొత్తగా ఎన్నికయ్యే ప్రధాని 2023 ఆగస్టు వరకూ పదవిలో ఉంటారు. ఓటింగ్​లో పాల్గొనకుండా ఏ ఒక్క సభ్యుడినీ అడ్డుకోరాదని కోర్టు స్పష్టం చేసింది. కాగా, విచారణ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నేత షెహబాజ్​ షరీఫ్​ అభిప్రాయాన్ని కూడా కోర్టు తీసుకుంది. తమపై దేశద్రోహ ముద్ర వేస్తే ప్రజల్లోకి ఎన్నికల కోసం ఎలా వెళ్లగలమని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ శక్తులతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేశామనడం దారుణమన్నారు. 

నంబర్లు ఇమ్రాన్​కు వ్యతిరేకమే

పాక్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 342 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజారిటీకి 172 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇమ్రాన్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్​ తెహ్రిక్​ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీకి 155 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటివరకూ మిత్రపక్షాలు, ఇండిపెండెంట్లు కలిపి ఇమ్రాన్​కు 179 మంది సభ్యుల మద్దతు ఉంది. అయితే, మిత్ర పక్షాలు మద్దతు ఉపసంహరించుకోగా, కొంతమంది పీటీఐ సభ్యులు ఇమ్రాన్​పై తిరుగుబాటు ప్రకటించారు. వీరితో కలిపి ప్రతిపక్షాలు ఇప్పటికే తమకు 177 మంది సభ్యుల మద్దతు ఉందని ప్రకటించాయి. దీంతో ఇమ్రాన్​ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఇప్పటి వరకూ ఏ పాకిస్తాన్​ ప్రధానమంత్రి కూడా పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. పాకిస్తాన్​ రాజకీయ చరిత్రలో పదవిలో ఉన్న ప్రధానిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం రెండుసార్లు జరిగింది. 1989లో బెనజీర్​భుట్టో, 2006లో షౌకత్​ అజీజ్​ అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఆ రెండుసార్లు కూడా వారిద్దరూ అవిశ్వాసం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.