ఏపీలో విషాదం.. ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయెన్సర్ జీవితంలో ఇలా జరిగిందేంటో..!

ఏపీలో విషాదం.. ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయెన్సర్ జీవితంలో ఇలా జరిగిందేంటో..!

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో ఇన్ స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి అనే యూట్యూబర్ చనిపోయిన ఘటన విషాదం నింపింది. ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి (22) ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది. ఇన్స్టాగ్రాంలో వేల మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. 

ఈ క్రమంలోనే ఆమెకు తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే.. ప్రతాప్కు పెళ్లయింది. ప్రతాప్తో చనువుగా ఉంటున్న విషయం మధుమతి కుటుంబ సభ్యులకు తెలిసి వారించారు. అయితే.. ప్రతాప్ మాత్రం మధుమతిని కలుస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే.. మధుమతి అమ్మమ్మ వాళ్లింట్లో ఉరికి వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. తమ కూతురును ప్రతాప్ చంపేశాడని, ఉరి వేసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మధుమతి తల్లిదండ్రులు ఆరోపించారు.

మధుమతి తల్లి రోదించిన తీరుకు స్థానికులు చలించిపోయారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతాప్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మధుమతికి, ప్రతాప్కు మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకునేందుకు మధుమతి ఇన్ స్టాగ్రాం అకౌంట్తో పాటు కాల్ లిస్ట్ కూడా చెక్ చేయనున్నారు. ప్రతాప్‌ను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని మధుమతి కుటుంబం డిమాండ్ చేసింది. ఆన్లైన్ స్నేహాలను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు.