కాంగ్రెస్ టార్గెట్ పార్లమెంట్ ఎలక్షన్స్.. అప్పటి దాకా ఇదే తరహా దూకుడు

కాంగ్రెస్ టార్గెట్ పార్లమెంట్ ఎలక్షన్స్.. అప్పటి దాకా ఇదే తరహా దూకుడు
  • టార్గెట్ పార్లమెంట్ ఎలక్షన్స్
  • అప్పటి దాకా ఇదే తరహా దూకుడు 
  • మార్చి 16తో వంద రోజులు పూర్తి
  • ఆ లోపు ఆరు గ్యారెంటీలు అమలు
  • ఆచరణలో పెట్టామనే మెసేజ్ తో ఎలక్షన్స్ కు 
  • 21న కలెక్టర్ల మీటింగ్ లోనూ గ్యారెంటీల అమలుకు ఆటంకాలపైనే డిస్కషన్ 

హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రగతిభవన్ ఇనుప కంచెలను బద్దలు కొట్టి దానిని ప్రజాభవన్ గా మార్చడంలో సక్సెస్ అయిన రేవంత్ టీం.. సెక్రటేరియట్ లోకి అందరికీ ప్రవేశం కల్పించి మరో సారి జనం మన్నననలు పొందింది. ఆ వెంటనే ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమల్లోకి తెచ్చింది. సరిగ్గా వందరోజుల్లో ఆరు గ్యారెంటీలను ఆచరణలో పెడతామని కుండబద్దలు కొడుతున్నరు సీఎం రేవంత్. వచ్చే ఏడాది మార్చి 16 వ తేదీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతుంది. ఆ లోగా ఆరు గ్యారెంటీలు అమలు చేసి వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లలో విజయం సాధించేందుకు వ్యూహరచనలు చేస్తోంది. 

మరోవైపు ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగుతోందనే సంకేతాలిచ్చేందుకు సీఎం, మంత్రులు నిత్యం జనాల్లోనే ఉంటున్నారు. ప్రభుత్వ పథకాల అమలు కోసం వివిధ రంగాల నిపుణులతో సీఎం, మంత్రులు భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ధరణి పోర్టల్ నిర్వహణ, కౌలు రైతులకు రూ. 12 వేల మొత్తం ఎలా డిపాజిట్ చేయాలి.. వ్యవసాయ కూలీలను గుర్తించడం, పారదర్శకంగా సాయం పంపిణీ చేయడం ఎలా..? ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు మార్గదర్శకాలు ఎలా రూపొందిద్దాం.. గ్రౌండ్ రియాల్టీ ఏమిటి..? అన్న అంశాలపై కలెక్టర్లతో డిస్కస్ చేయనున్నారు. 

అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యం  

గత పార్లమెంటు  ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మల్కాజ్ గిరి, భువనగిరి, నల్లగొండ సెగ్మెంట్లలో గెలుపొందింది. ప్రస్తుతం 17 సీట్లలోనూ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడం, ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపడం ద్వారా సక్సెస్ అయ్యేందుకు అధికార పార్టీ వ్యహరచనలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆరు నెలల లోపే పార్లమెంటు ఎలక్షన్స్ ఉండటం, బీఆర్ఎస్ ను ఓటమి. కారు  పార్టీకి దీటైన ప్రత్యర్థి అనే పేరు ఈ పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపునకు ఉపకరిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.