చేసిన పనులకు పైసలియ్యని రాష్ట్ర సర్కారు

 చేసిన పనులకు పైసలియ్యని రాష్ట్ర సర్కారు
  • సర్పంచ్​లకు జనరేట్ కా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చెక్కులు
  • యూసీలు ఇవ్వకపోవడంతో పల్లెలకు నేరుగా రావాల్సిన నిధులకు కేంద్రం బ్రేక్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అకౌంట్లలోని నిధులను ఫ్రీజ్ చేసింది. జూన్ మొదటివారంలో నిర్వహించిన పల్లె ప్రగతి సమయంలో వారం రోజులే ఫ్రీజింగ్ ఎత్తివేసిన ప్రభుత్వం.. ఆపై మళ్లీ ఆంక్షలు పెట్టింది. అభివృద్ధి పనులకు, సిబ్బంది జీతాలకు డబ్బులు డ్రా చేసుకోనివ్వకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో సర్పంచ్​లు ఇబ్బందులు పడుతున్నారు. చేసిన పనులకు చెక్కులు జనరేట్ కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్ ఎలా ఆపుతుందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. 

యూసీలు సమర్పించలేదని 
నిధులు నిలిపేసిన కేంద్రం

గ్రామ పంచాయతీలకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి రాష్ట్ర సర్కారుతో సంబంధం లేకుండా నేరుగా జీపీల ఖాతాల్లోనే వేయాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలతో ఇప్పటికే అన్ని పంచాయతీల పేరిట ఎస్ బీఐ శాఖల్లో కొత్త అకౌంట్లు తెరిచారు. జులైలో సర్పంచ్​ల, ఉప సర్పంచ్ ల డిజిటల్ సంతకాలు కూడా డీపీవోలు తీసుకున్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఈ ఖాతాల్లో జులై నెలాఖరులోగా జమ కావాల్సి ఉంది. అయితే ఎనిమిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసిన జీపీల నిధుల ఖర్చుకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీలు) ఇప్పటి వరకు రాష్ట్ర సర్కారు సమర్పించకపోవడంతో కొత్త ఖాతాల్లో కేంద్రం నిధులు జమచేయట్లేదని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం జీపీ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం, యూసీలు ఇవ్వలేదని కేంద్రం నిధులు జమ చేయకపోవడంతో సర్పంచ్ లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 

ఒక్కో జీపీలో రూ.లక్ష నుంచి 
రూ.10 లక్షల పెండింగ్ బిల్లులు.. 

మే చివరి వారంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర సర్కార్ అనౌన్స్ చేసింది. దీంతో అప్పటికే తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు లక్షల్లో ఉన్నాయని, అవి చెల్లించకుంటే పల్లె ప్రగతి బహిష్కరిస్తామని సర్పంచ్​లంతా హెచ్చరించడంతో ప్రభుత్వం ఆ ప్రోగ్రామ్​ను జూన్ 3కు వాయిదా వేసి, జూన్ మొదటి, రెండోవారంలో కొద్దిరోజులు జీపీల బ్యాంక్ అకౌంట్లపై ఫ్రీజింగ్ ఎత్తివేసింది. దీంతో కొన్ని బిల్లులు డ్రా చేసుకోగలిగారు. ఆపై రెండు నెలలకే మళ్లీ ఫ్రీజింగ్ పెట్టడంతో ఆ రెండు నెలలుగా చేసిన పనులకు, సిబ్బంది జీతాలకు నిధులు డ్రా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కొత్త, పాత బిల్లులు కలిపి ఒక్కో జీపీలో రూ.లక్ష నుంచి రూ.10 లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. దీంతో సిబ్బంది జీతాలకు, ఇతర పనులకు అప్పులు చేయాల్సి వస్తోందని సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెక్కులు చెల్లుబాటయితలేవు
గతంలో చేసిన పనులు, సిబ్బంది జీతాలకు సంబంధించిన బిల్లు రూ.1.50 లక్షలు పెండింగ్ లో ఉంది. ఈ బిల్లును డ్రా చేసేందుకు చెక్ జనరేట్ చేయబోతే రావట్లేదు. గతంలో డబ్బులు లేట్​గా వచ్చినా.. ముందయితే చెక్ జనరేట్ అయ్యేది. ఇప్పుడు చెక్ కూడా రావడం లేదు.  - బండి పర్వతాలు, సర్పంచ్, ముల్కలగూడెం.