ఓటరు ముందు ఓడిన ప్రలోభాలు

ఓటరు ముందు ఓడిన ప్రలోభాలు
  • రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించిన హుజూరాబాద్ ఓటర్లు
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడారని సోషల్​ మీడియాలో అభినందనలు

 ‘‘ఇన్నాళ్లూ రాని లీడర్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నారో, ఇన్నాళ్లూ ఏమీ చేయనివాళ్లు ఇప్పుడెందుకు చేస్తామంటున్నారో తెలియనంత అమాయకత్వంలో ఇక్కడి ప్రజలు లేరు.. అన్నీ అర్థం చేసుకున్నారు.. ఓటుకు రూ.6వేల నుంచి రూ.10వేల దాకా ఇస్తే తీసుకొని రూలింగ్​పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి, రాష్ట్రం వచ్చాక తమ బాగోగులు చూసుకుంటున్న ఈటలకే జై కొట్టారు.’  
– హుజూరాబాద్​కు చెందిన ఓ సీనియర్​ పొలిటికల్​ అనలిస్ట్​ అన్న మాటలివి.

కరీంనగర్, వెలుగు:
2 వేల కోట్లతో దళితబంధు స్కీం.. వందల కోట్లతో డెవలప్​మెంట్​ వర్క్స్​.. ఊరూరా సీసీరోడ్లు, డ్రైనేజీలు.. డబుల్​ ఇండ్లు పూర్తి చేస్తానన్న హామీలు.. కులాలకు కమ్యూనిటీ హాళ్లు, టెంపుల్స్  నిర్మాణాలకు భూమిపూజలు.. గొర్రెలు, బర్రెలు, రేషన్​కార్డులు, పింఛన్లు..  మహిళా సంఘాలకు రుణాలపై వడ్డీ మాఫీలు, కొత్త రేషన్​కార్డులు..  ఇలా రూలింగ్​ పార్టీ ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా హుజూరాబాద్​ ఓటర్లు లొంగలేదు.  ఉప ఎన్నికల్లో భాగంగా ఈటల రాజేందర్ ను ఓడించేందుకు రూలింగ్​పార్టీ ఎన్నో ఎత్తులు వేసింది.

ఎన్నికలు రాకముందే  అక్కడి అధికారులను బదిలీ చేసింది. ఎస్సైలు మొదలుకుని ఏసీపీ వరకు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్డీవో.. ఇలా  అందరినీ ట్రాన్స్​ఫర్​ చేసింది. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను ట్రబుల్​ షూటర్​గా భావించే మంత్రి హరీశ్​రావుకు అప్పగించింది. ఆయన ఆరు నెలలపాటు సింగాపూర్‍ కిట్స్ కేంద్రంగా హుజూరాబాద్‍ రాజకీయాలను నడిపించారు. అంతకుముందు కరీంనగర్​ క్యాంపు ఆఫీస్ ​కేంద్రంగా గంగుల కమలాకర్​, సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్​ గెస్ట్​హౌస్​ కేంద్రంగా హరీశ్​రావు హుజూరాబాద్​ రాజకీయాన్ని రక్తి కట్టించారు. ఈటల వెంట ఉన్న ఆయన అనుచరులు, లోకల్​ ప్రజాప్రతినిధులను పేరుపేరునా పిలిపించుకుంటూ తమవైపు లాగేసుకున్నారు.

ఈటల వెంట బలమైన నాయకులు లేకుండా చేశారు. సర్పంచ్‍ మొదలుకొని ఎంపీపీ, జడ్పీటీసీలు, మున్సిపల్‍ చైర్మన్లు ఒక్కొక్కరికి ఒక్కో రేటు నిర్ణయించి కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి కొన్ని ఆడియో రికార్డింగులు అప్పట్లో బయటకు వచ్చాయి. పైసలకు లొంగకుంటే పాత కేసులు తోడి ఇరికించే ప్రయత్నం చేయడం, వ్యాపారాల మీద అధికారులతో దాడులు చేయించడం లాంటి ఘటనలూ బయటపడ్డాయి. 
డెవలప్​మెంట్​ పేరిట వేల కోట్లు
హుజూరాబాద్​లో విజయం సాధించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సర్కారు వందల కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్ కోసం సుమారు రూ. 200 కోట్లు కేటాయించారు. మహిళా సంఘాలకు రూ. 400 కోట్ల రుణాలు మంజూరు చేశారు. చేనేత కార్మికులకు నూలు రాయితీ రూ. 100 కోట్ల దాకా ఇచ్చారు.  రూ. 2,500 కోట్లు దళితబంధు పథకం కింద విడుదల చేశారు. చాలాకాలంగా పెండింగ్‍లో ఉన్న బిల్లులను కాంట్రాక్టర్లు, గ్రామ సర్పంచులకు ఇప్పించారు. ఇలా అభివృద్ధి పనుల పేరిట గ్రామాల్లో ప్రజలను వారి వైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. 
పారని పదవుల ఎర
ఎన్నికల కోసం లీడర్లకు పదవుల ఎర వేశారు. కాంగ్రెస్​కు చెందిన కౌశిక్‍ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీలో చేర్చుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు  ఎల్‍ రమణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డిని పార్టీలోకి  తీసుకున్నారు. హుజూరాబాద్‍కు చెందిన బండా శ్రీనివాస్‍కు ఎస్సీ కార్పొరేషన్‍ చైర్మన్‍ పదవి ఇచ్చారు. మరికొందరికి పదవులు ఇస్తామని ఆశ పెట్టారు. ఒక్కసారిగా పార్టీ మారిన ఈ నాయకులను ప్రజలు విశ్వసించలేదు. టీఆర్ఎస్​ఓటమితో ఇప్పుడు వీరికి పదవులు వస్తాయో రావో ప్రశ్నార్థకంగా మారింది. ఇక చివరి అస్త్రంగా పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం పంపిణీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. బహిరంగంగానే ఓటుకు ఆరు నుంచి 10 వేలు పంచిన దృశ్యాలు సోషల్​ మీడియాలో బయటపడ్డాయి. 
టీఆర్​ఎస్​ లీడర్లను నమ్మని పబ్లిక్​
గతంలో ఎన్నడూ లేనివిధంగా  వందల కోట్లతో స్కీములు, డెవలప్​మెంట్​వర్క్స్​ చేపట్టడం,  విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేయడంతో రాష్ట్రంలో అందరి దృష్టి హుజూరాబాద్​ఎన్నికలపైనే పడింది. కానీ ఎన్ని వ్యూహాలు పన్నినా ఓటర్లు మాత్రం అధికార పార్టీకి  షాకిచ్చారు. ఈటల వ్యక్తిత్వం, ఉద్యమ నేపథ్యం, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే తత్వం కూడా ఆయన విజయానికి దోహదపడ్డాయని పొలిటికల్​ అనలిస్టులు అంటున్నారు. కేసీఆర్​ కుటుంబపాలనకు అడ్డుగా ఉన్నాననే కారణంతోనే తనపై లేనిపోని నిందలు వేసి పార్టీ నుంచి బయటకు పంపారన్న ఈటల మాటలనే ప్రజలు నమ్మి 20వేలకు పైగా మెజార్టీని కట్టబెట్టినట్లు పొలికల్​ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద ఎలాంటి ప్రలోభాలకు లొంగని హుజూరాబాద్​ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడారని సోషల్​ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.