నిప్పు పెట్టింది మోడీ వ్యతిరేకులు

నిప్పు పెట్టింది మోడీ వ్యతిరేకులు

ఉద్యోగార్థుల్లో గూడుకట్టుకున్న అసహనం ఎంత ఉన్నా, తమ డిమాండ్లు నెరవేర్చాలని వారు ఏ రైల్ రోకోలతోనో, రాస్తారోకోలతోనో నిరసన తెలుపుతారు తప్ప విధ్వంసాలకు దిగరు. ఉద్యోగార్థులంతా సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటారని ముందే తెలుసుకున్న కుట్రదారులు కొందరు, ప్రధానమంత్రి మోడీపై అక్కసుతో కక్షగట్టి ఆర్మీ అభ్యర్థుల్లో చొరబడి రైళ్లకు నిప్పు పెట్టారు. నిరసనకారులను మరింత రెచ్చగొట్టారు. రద్దీ రామచిలుకది దెబ్బలు దుబ్బరిగానికి తప్పవు అన్నట్లు.. కుట్రదారులు చేసిన ఈ పనికి ఆర్మీ అభ్యర్థులు, నిరసనకారులు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన ఒక కాంగ్రెస్ కార్యకర్త నిరసనకారుల్లో చేరి రైలు పట్టాలపై కూర్చున్న ఫొటో ఒకటి వాట్సాప్ గ్రూపుల్లో కనిపించింది. అతడు సైనిక ఉద్యోగ అభ్యర్థి కాడు. అర్హత కూడా లేదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే! ఇలాంటి వాళ్లు ఇంకా ఎంతమంది చొరబడ్డారో దర్యాప్తులో తేలుతుంది. 

మోడీ వ్యతిరేకుల చర్యే ఇది
వచ్చేనెల మొదటి వారంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్​లో జరగటం కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు.. నానా జాతి కమ్యూనిస్టులకు కండ్లమంటగా ఉంది. దేశ నలుమూలల నుంచి ప్రతినిధులు,18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావడం, బీజేపీ రాష్ట్ర పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేయటం మోడీ వ్యతిరేకుల గుండెల్లో దడ పుడుతోంది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ మెట్రో సిటీలో అలజడి, ఉద్రిక్తతలు చెలరేగాలనే కుట్రలతో ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. నిన్నటి దహన కాండను ఖండించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా విమర్శిస్తున్నారు. కొండగట్టు బస్సు దుర్ఘటనలో 60 మంది చనిపోతే చిల్లిగవ్వ ఇయ్యని ముఖ్యమంత్రి, కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి అప్పటికప్పుడే 25 లక్షల రూపాయలు ప్రకటించడం(మంచిదే), అతని మృతదేహాన్ని మంత్రులు ఎమ్మెల్యేలు భుజాలపై మోయడం టీఆర్ఎస్ శవ రాజకీయాలకు పరాకాష్ట !!

అగ్నివీర్​ అన్ని విధాల మంచి పథకమే..
అగ్ని వీర్​పథకంలో చేరినవారికి నెలసరి వేతనం 20 వేల నుంచి 30 వేల దాకా నాలుగు సంవత్సరాలు చెల్లించి, శిక్షణ కాలంలో భోజనం, వసతి, బట్టలు, రవాణా చార్జీలు పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది. అందువల్ల నాలుగు సంవత్సరాల వేతనం12 లక్షలు,  నాలుగు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల మొత్తంతో అతని చేతిలో 22 లక్షల రూపాయలు ఉంటాయి. దాంతో అతను స్వయం ఉపాధి పొందొచ్చు. నాలుగేళ్ల కఠోరమైన సైనిక శిక్షణలో మనిషి అన్ని విధాల రాటుదేలుతాడు. నైపుణ్యవంతుడు అవుతాడు. పనిలో నేర్పరితనం, జీవితంలో క్రమశిక్షణ అలవడుతుంది. దేశభక్తుడు అవుతాడు. ఉద్యోగం చేయాలనుకుంటే పారామిలటరీ లేదా పోలీస్ ఉద్యోగాలతో పాటు ఎందులోనైనా  ప్రాధాన్యత ఉంటుంది. జీవితంలో నైపుణ్యం ఉన్నవారికి ఇంకే విద్య అవసరం లేదని ఉర్దూ భాషలో ఒక సామెత ఉంది. కాబట్టి ఆ అభ్యర్థి భావి జీవితం గురించి దిగులు అవసరం లేదు. ఒకవేళ సామర్థ్యం బాగా చూపి 25 శాతం మందిలో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి అన్ని విధాల అగ్ని వీర్​పథకం మంచిదే. 

కేసును సీబీఐకి అప్పగించాల్సిందే..
కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా, మంచి చెడులతో నిమిత్తం లేకుండా గుడ్డిగా వ్యతిరేకించే మోడీ వ్యతిరేక శక్తులు దేశమంతటా ఉన్నాయి. ఆ దుష్టశక్తులన్నీ కలిసి ఉత్తరాది రాష్ట్రాల్లో రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. పంజాబ్, హర్యానాల్లో వ్యవసాయ ఉత్పత్తులపై తమ గుత్తాధిపత్యం పోతుందని కొన్ని రాజకీయ కుటుంబాలు, ఖలిస్తాన్ వేర్పాటువాదులు రైతుల ముసుగులో ఢిల్లీ వెళ్లే రోడ్లపై బైఠాయించి దొంగనాటకం ఆడారు. నిజమైన రైతులు వారి బారిన పడవద్దనే ప్రధాని మోడీ అభ్యుదయకరమైన వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నారు. షాహీన్ బాగ్ డ్రామాలు ఎన్ని ఆడినా సీఏఏ చట్టం రద్దు కాలేదు. ఆర్టికల్‌‌370 రద్దయింది. అగ్నివీర్ పథకం అమలై తీరుతుంది!!  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌లో జరిగిన విధ్వంసకాండ దర్యాప్తు బాధ్యతను రాష్ట్ర పోలీసులకు ఇస్తే మాత్రం నేరస్తుల రొట్టె విరిగి నేతిలో పడినట్లే !!  కేసీఆర్ అధికారంలో ఉన్నంతవరకు ఆయన ఆడించినట్లు పోలీసులు ఆడుతారు. కనుక ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలి. అప్పుడే అసలు దోషులకు శిక్ష పడుతుంది.

హింసతో ఏం సాధించలేం..
గూడు కట్టిన అసహనం అగ్ని పథమైందని వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ పేర్కొన్నారు. ఆనాటి దహన కాండను ఆ విధ్వంసాన్ని ఖండించకపోగా అది సహజపరిణామమే అన్నట్లుంది వారి ధోరణి. విధ్వంసం సృష్టించి ఏదీ సాధించలేం. 1969లో తెలంగాణకు అన్యాయం చేసిన ఆంధ్రా పాలకులపై గల అసహనంతో హింసాత్మక చర్యలకు పాల్పడి పోలీస్ కాల్పుల్లో 350 మంది యువకులను పోగొట్టుకున్నాం తప్ప తెలంగాణను సాధించలేదు. తెలంగాణ ప్రజలకు పాలకులపై గల అసహనం ఆగ్రహం కలిగినా అహింస మార్గంలోనే మలిదశ ఉద్యమం నడిపి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని మర్చిపోవద్దు!! గ్రూప్​ బి, గ్రూప్​ సి ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటా ఉన్నా.. ఆ స్థాయిలో వారి భర్తీ లేదంటున్నారు. ఆయా ఉద్యోగాల్లో కోటా ఉన్నంత వరకు భర్తీ కాకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. మాజీ సైనికులు ఎక్కువ మంది వ్యవసాయం, వ్యాపారం తదితర వృత్తుల్లో చేరుతున్నారు.

-మందాడి సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే