భద్రాచలం, వెలుగు: గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండడంతో ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలానికి ఎగువన ఉన్న ఇంద్రావతి, పెన్‌గంగా, వార్దా, తాలిపేరు, దిగువన కిన్నెరసాని, శబరి, సీలేరు ఉపనదుల నుంచి గోదావరిలోకి వరద పోటెత్తుతోంది. దీంతో సోమవారం సాయంత్రం భద్రాచలం వద్ద స్నానఘట్టాలను తాకుతూ 4,02,580 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అడవుల్లో భారీగా వర్షపాతాలు నమోదు కావడంతో మరో 24 గంటల్లో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంటుందని సీడబ్ల్యుసీ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.
ఈ నెల 12 వరకు శబరి పరీవాహక ప్రాంతంలో అత్యధిక వర్షపాతాలు నమోదు అవుతాయన్న హెచ్చరికతో తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. భద్రాచలానికి దిగువన గోదావరి, శబరి సంగమ ప్రదేశంలో ప్రవాహానికి బ్రేక్ పడి బ్యాక్ వాటర్ భద్రాచలంలోకి ప్రవహించే ప్రమాదం ఉంది. శబరి, సీలేరు ఉపనదులు రికార్డు స్థాయిలో పారుతున్నాయి. భద్రాచలం – రాజమండ్రి ఘాట్‌రోడ్డులో రంపచోడవరం వద్ద వాగులు ఉధృతంగా పారుతుండడంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. చత్తీస్‌గఢ్ దండకారణ్యం నుంచి చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్ట్‌కు 1,31,846 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 24 గేట్లు ఎత్తి, 1,29,992 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం జిల్లాలోని గోదావరి, ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అలర్ట్‌గా ఉండాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ సూచించారు. ఈ మేరకు గోదావరి తీర ప్రాంతాల్లో ఉండే సెక్టోరియల ఆఫీసర్లను అలర్ట్ చేశారు. గ్రామాల్లో శిథిల భవనాల్లో ఉండే వారిని గుర్తించి సేఫ్ జోన్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని చెప్పారు.