ఎక్కువ బ్యాంకు ఖాతాలతో ఇబ్బందులే

ఎక్కువ బ్యాంకు ఖాతాలతో ఇబ్బందులే

న్యూఢిల్లీ: చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉంటాయి. శాలరీ కోసమో, డిపాజిట్ల కోసమో ఎక్కువ సంఖ్యలో ఖాతాలు తీసుకుంటుంటారు. మల్టిపుల్​ బ్యాంకు అకౌంట్లు ఉండటం తలనొప్పి వ్యవహారమే అని చెప్పాలి. ఉదాహరణకు హైదరాబాద్​కు చెందిన ప్రసాద్​ నెల రోజుల క్రితం చార్టర్డ్​ అకౌంటెంట్ ​ద్వారా ఐటీఆర్​ ఫైల్​ చేయించినప్పుడు ఆశ్చర్యకమైన విషయం బయటపడింది. ఆయన ఎప్పుడో తెరిచిన బ్యాంకు అకౌంట్​ నుంచి ట్యాక్స్ ​మినహాయించుకున్నట్టు ఫామ్​26 ఏఎస్​ ద్వారా బయటపడింది. 

ఆ ఖాతా ఉన్న విషయాన్ని ప్రసాద్​ దాదాపు మర్చిపోయారు. ఎందుకంటే ఉద్యోగంలో చేరిన కొత్తలో తెరిచిన అకౌంట్​ అది. కొన్నాళ్ల తరువాత ఉద్యోగం మారడంతో దాని గురించి పట్టించుకోవడం మానేశారు. బ్యాంకుకు వెళ్లి ఆరా తీస్తే ఆ అకౌంట్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఉన్నట్టు తెలిసి ఆశ్చర్యపోయారు. ఏటీఎంలు, ఇంటర్నెట్​ బ్యాంకింగ్​ లేని కాలంలో ఆయన అకౌంట్​ తెరిచారు. అప్పట్లో ఎస్​ఎంఎస్​లు, నోటిఫికేషన్లు రాలేదు కాబట్టి ఆయనకు ఖాతా గురించి అప్​డేట్లు తెలియలేదు. ఐటీఆర్​ ఫైల్​ చేయకుంటే ఆ డిపాజిట్లు దక్కేవే కావు.  అందుకే ఎక్కువ సంఖ్యలో బ్యాంకు ఖాతాలు ఉంచుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఎన్నో చిక్కులు...

ఇది వరకే చెప్పుకున్నట్టు ఎక్కువ ఖాతాలు ఉంటే ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. ప్రతి ఖాతాకు మినిమం బ్యాలెన్స్​ తప్పకుండా మెయింటెన్​చేయాలి. లేకపోతే జరిమానా పడటమే కాదు సిబిల్​ స్కోరు తగ్గే ప్రమాదం ఉంది.  ఇటీవల రాజ్యసభలో లేవనెత్తిన ఒక ప్రశ్నకు ప్రభుత్వం స్పందిస్తూ, 2018 నుండి ప్రభుత్వ రంగ బ్యాంకులు,  ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు (యాక్సిస్ బ్యాంక్, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్  ఐడీబీఐ బ్యాంక్) తమ కస్టమర్లు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయనందుకు రూ. రూ.21,044 కోట్లు వసూలు చేశాయని   తెలిపింది.  అయితే, ఇవన్నీ ఎక్కువ బ్యాంక్ ఖాతాల వల్ల అయి ఉండకపోవచ్చు. ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. 

మరో విషయం ఏమిటంటే.. అన్ని బ్యాంకుల బ్రాంచులకు తిరగడం వల్ల సమయం వృథా అవుతుంది. అన్ని బ్యాంకుల యాప్స్ ​ఇన్​స్టాల్  ​చేసుకోవాలి. ఐడీ, పాస్​వర్డ్స్​ గుర్తుంచుకోవాలి. మరొక ముఖ్యమైన సమస్య ఏమిటంటే ఖాతాదారు మరణిస్తే అందులో డబ్బు ఎవరికి చెందాలనే విషయమై గొడవలు తలెత్తుతున్నాయి. మృతుడి సంతానం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొందరు తమకు మల్టిపుల్​ ఖాతాలు ఉన్నట్టు కుటుంబ సభ్యులకు తెలియజేయని ఉదంతాలు ఉన్నాయి. ఖాతాదారుడు మరణించిన తరువాత కూడా వాటి గురించి కుటుంబానికి తెలియక నష్టం వాటిల్లుతోంది. ఇప్పుడు డిజిటైజేషన్​ పెరుగుతోంది. ట్యాక్స్​ఫైలింగ్​ ఈజీ అయింది. మనకు ఏ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయో చిటికెలో తెలిసిపోతోంది. ఒక్కసారి ఫామ్​26ఏఎస్​ను చూస్తే చాలు. సమాచారం దొరుకుతుంది. అవసరం 
లేని ఖాతాలను మూసివేయడమే మంచిది.