
వేలు పట్టి నడిపించిన నాన్న చివరి మాటలవి.. నాన్న గుర్తుగా ఆ మాటల్ని పదిలంగా దాచుకోవాలనుకున్నారు ఇద్దరు అక్కాచెల్లెళ్లు. అంతే.. నాన్న ప్రేమనంతా టాటూలో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూసిన నెటిజన్స్‘మనల్ని ప్రేమించేవాళ్లను కోల్పోతే ఎంత బాధ ఉంటుందో బాగా తెలుసు’ అంటూ తమ తమ స్టోరీలను కూడా పంచుకున్నారు. పోస్ట్ పెట్టిన అన్నా వాళ్ల నాన్న ఐదు నెలల క్రితం కరోనాతో చనిపోయాడు. ఆయన చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు తన ఇద్దరి కూతుళ్లని ఉద్దేశించి ‘ఇట్ హ్యాజ్ బీన్ సచ్ ఏ గుడ్ లైఫ్’ అని రాశాడు. ఆ మాటల్ని ఇద్దరు అక్కాచెల్లెళ్లు టాటూ వేయించుకున్నారు. వాళ్ల నాన్నను గుర్తు చేసుకుంటూ వీడియో పెట్టి, ‘ నాన్న నవ్వు, ఆయన సరదా మాటలు, ఇతరుల మీద ఆయన చూపించే ప్రేమ ఇవన్నీ లేకపోయేసరికి లైఫ్ ఏదో వెలితిగా ఉంది. ఆయన మా నాన్న అవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎప్పటికీ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటాం నాన్న’ అని రాశారు. ఆ పోస్ట్ చూసిన నెటిజన్స్ కూడా వాళ్ల ప్రియమైన వాళ్లను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్లు పెడుతున్నారు.