మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిణామాలు

మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిణామాలు

మహారాష్ట్రలో ఉద్దవ్ ప్రభుత్వం కొనసాగుతుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఇలాంటి క్యాంపు రాజకీయాలు చూడడం మూడోసారి అని వ్యాఖ్యానించారు. సమస్యకు పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్రలో శివసేన కూటమి ప్రభుత్వానికి గండం ఏర్పడే పరిస్థితి వచ్చింది. శివసేనకు చెందిన కీలక నేత ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో 30 మందికి పైగా ఎమ్మెల్యేలు సూరత్ రిసార్ట్ కు షిఫ్ట్ అయ్యారు. దీంతో పరిణామాలన్నీ మారిపోయాయి. ఈ క్రమంలో జూన్ 21వ తేదీ మంగళవారం శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని రెండేళ్లుగా చూస్తున్నారని, మొదట్లో  ఎన్సీపీ ఎమ్మెల్యేల్యపై దృష్టిసారించారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు తగ్గిందని, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రెబల్ గా మారలేదన్నారు. నాయకత్వంపై శివసేన నిర్ణయించుకోవాలని సూచించారు. షిండే సీఎం కావాలని కోరుకున్నట్లు ఎప్పుడూ వినలేదని శరద్ పవార్ తెలిపారు.

మంత్రి ఏక్ నాథ్ షిండే రెబెల్ గా మారి సూరత్ రిసార్ట్ లో క్యాంప్ పెట్టడంతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. షిండే తో పాటు 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. అదే జరిగితే 2/3 మెజారిటీతో శివసేన చీలిక వర్గానికి అధికారిక గుర్తింపు లభించే ఛాన్స్ ఉంటుంది. దీంతో నేరుగా బీజేపీకి, మద్దతు ఇవ్వడం లేదా విలీనమైన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉండనుంది. మరోవైపు తాజా పరిణామాలతో ఉద్ధవ్ థాక్రే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి తక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు వచ్చినట్లు తెలుస్తోంది. 

అసెంబ్లీలో బలబలాలు :-

  • మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు
  • 145 మ్యాజిక్ ఫిగర్.
  • మహావికాడ్ అగాఢీ బలం 169
  • శివసేనకు 56 మంది, ఎన్సీపీకి 53 మంది, కాంగ్రెస్ కు 44 మంది, స్వతంత్రులు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
  • 30 మందికి పైగా ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం
  • అదే జరిగితే శివసేన ప్రభుత్వానికి గండం తప్పదు.