బాక్సాఫీస్ క్లాష్: థియేటర్లలో రామ్ చరణ్ 'పెద్ది' వేట.. ఓటీటీలో రణ్‌వీర్ 'ధురంధర్ 2' ఊచకోత!

బాక్సాఫీస్ క్లాష్: థియేటర్లలో రామ్ చరణ్ 'పెద్ది' వేట.. ఓటీటీలో రణ్‌వీర్ 'ధురంధర్ 2' ఊచకోత!

ఐపీఎల్ 2026 హంగామా ముగియడంతో.. ఇప్పుడు అందరి కళ్లు సినిమాలపై పడింది. ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో జూన్ 4వ తేదీ సరికొత్త రికార్డులకు వేదిక కాబోతోంది. ఒకవైపు వెండితెరపై మాస్ జాతర సృష్టించడానికి గ్లోబల్ స్టార్ సిద్ధమవుతుంటే.. మరోవైపు డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేయడానికి బాలీవుడ్ 'దురంధరుడు' రెడీ అయ్యాడు. థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఒకేసారి హీటెక్కేలా సాగుతున్న ఈ క్రేజీ బాక్సాఫీస్ వర్సెస్ డిజిటల్ వార్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

థియేటర్లలో ‘పెద్ది’ మాస్ విద్వంసం..

ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల కాబోతోంది. మునుపెన్నడూ చూడని అత్యంత రగ్గడ్ లుక్‌లో చరణ్ కనిపిస్తుండటం, ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే పవర్‌ఫుల్ కథ కావడంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక షోలతో పాటు టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్, బుచ్చిబాబు సన టేకింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. 

ముఖ్యంగా సినిమా చివరి 50 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎమోషనల్ పీక్స్‌కు తీసుకెళ్తుందని టాక్. ఓపెనింగ్స్ పరంగా ‘పెద్ది’ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని ఫ్యాన్స్, సినీ వర్గాలు ధీమ వ్యక్తం చేస్తున్నారు..  బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' ఇవాళే (జూన్ 3న) ప్రీమియర్స్‌తో థియేట్రికల్ రన్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేస్తోంది.

 

ఓటీటీలోకి ‘దురంధర్ 2’ 

వెండితెరపై చరణ్ తుఫాన్ మొదలవుతుంటే, అటు డిజిటల్ స్క్రీన్స్‌పై రణవీర్ సింగ్ నటించిన 'దురంధర్ 2: ది రివెంజ్' ఊచకోత కోయడానికి సిద్ధమైంది. థియేటర్లలో రూ.1,800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి హిస్టారికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది . ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్‌. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూన్ 4 రాత్రి 7:00 గంటల నుండి జియోహాట్‌స్టార్‌లో ప్రత్యేక ప్రీమియర్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. ఆ తర్వాత జూన్ 5 అర్ధరాత్రి నుండి పూర్తిస్థాయి స్ట్రీమింగ్ కానుంది.

థియేటర్లలో సెన్సార్ బోర్డు మ్యూట్ చేసిన ప్రతి పవర్‌ఫుల్ డైలాగ్ ఇప్పుడు ఓటీటీలో "Raw & Undekha" (అన్‌కట్) వర్షన్‌గా రాబోతుండటంతో ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న 'దురంధర్ 2' డిజిటల్ వ్యూయర్‌షిప్ రికార్డులను తిరగరాయడం ఖాయం అని అభిమానులు, సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవైపు థియేటర్లలో చరణ్ మాస్ రైడ్.. మరోవైపు ఇంట్లోనే కూర్చుని రణవీర్ సింగ్ రా యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలు రెడీ అయ్యాయి.. ఈ జూన్ 4న సినిమా లవర్స్‌కు అసలైన పండగే అని సంబరాలు చేసుకుంటున్నారు.