ఏడాది పొడవునా విమోచన దినోత్సవాలు

ఏడాది పొడవునా విమోచన దినోత్సవాలు

న్యూఢిల్లీ:  దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా  నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని యూనివర్సిటీల వీసీలు, కాలేజీ ప్రిన్సిపాళ్లకు యూజీసీ కార్యదర్శి ప్రొఫెసర్ రజ్నీశ్ జైన్ లేఖలు రాశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17 వరకు ఏడాది పాటు ఈ ఉత్సవాలను నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ విమోచన పోరాటంలో పాల్గొన్న అమరవీరుల చరిత్రను సోషల్ మీడియా ద్వారా  తెలియజేయాలన్నారు. ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా ప్రారంభమవుతాయని తెలిపారు. 

సెప్టెంబర్ 17న లిబరేషన్ డేను పురస్కరించుకొని ఉదయం ప్రభాత భేరి, ప్రముఖులతో ఉపన్యాసాలు నిర్వహించాలని యూజీసీ కార్యదర్శి ప్రొఫెసర్ రజ్నీశ్ జైన్ లేఖలో పేర్కొన్నారు. వీధి నాటకాలు, ఎగ్జిబిషన్, క్విజ్, వ్యాస రచన, డాక్యూమెంటరీ ఫిల్మ్స్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించాలని కోరారు. ఏడాది పొడవునా నిర్వహించే ఈ కార్యక్రమాల్లో విద్యార్థులుపెద్ద సంఖ్యలో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడూ తమతో పంచుకోవాలని యూజీసీ తెలిపింది.