ప్రజాస్వామ్య విప్లవానికి కుల దళారీల అడ్డు

ప్రజాస్వామ్య విప్లవానికి  కుల దళారీల అడ్డు

‘ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలచేత, ప్రజలకొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వం’ అని అబ్రహం లింకన్ నిర్వచించారు. ఆధునిక యుగాన్ని ప్రజాస్వామ్య యుగంగా పేర్కొంటారు. ఆధునిక దేశాలన్ని కూడా ప్రజాస్వామ్యానికి ప్రాముఖ్యతనిస్తున్నాయి.  ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు శాంతియుతంగా జీవించే అవకాశం ఉంటుంది. మానవ హక్కులకు, చట్టాలకు రక్షణ లభిస్తుంది.  దేశాభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి ప్రజాస్వామ్యం కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో  ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో  ప్రతి ఏటా సెప్టెంబరు 15న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం జరుపుకుంటారు. దీని ప్రధాన ఉద్దేశం ప్రజల్లో ప్రజాస్వామ్య సూత్రాలు, విలువల పట్ల అవగాహన కలిపించడమే. ఈ సంవత్సరం లింగ సమానత్వాన్ని సాధించడం కోసం చర్యలు అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం.  ప్రజాస్వామ్య ప్రక్రియలలో  లింగ సమానత్వాన్ని పెంపొందించడం, పాలనలో అందరికీ న్యాయంగా  సమాన అవకాశాలు కల్పించాలని ఈ నినాదం నొక్కి చెబుతున్నది.

ఇటీవల  శ్రీలంక, నేపాల్,  బంగ్లాదేశ్​లో  పౌరుల నిరసనలు పెల్లుబికాయి.  అది అక్కడి  ప్రజాస్వామ్య  వ్యవస్థలో పాలకుల అణచివేతపై  ధిక్కార స్వరం.  పౌరుల చైతన్యానికి నిదర్శనం.  దాన్ని  రాజ్యాంగ వైఫల్యం అనలేం.  ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకు అది ఒక హెచ్చరిక.  ఈ క్రమంలో  పౌరుల హక్కుల రక్షణతోపాటు ప్రభుత్వ విధాన నిర్ణయంలో,  పాలనలో  పౌర భాగస్వామ్యం ఉన్నపుడు  ఇలాంటి  నిరసనలకు తావు ఉండదు.  అతిపెద్ద  ప్రజాస్వామ్యదేశమైన ఇండియాలో కూడా అగ్రవర్ణ ఆధిపత్య పాలకులపై  ఎప్పుడో  తిరుగుబాటు వచ్చేది.  రాజ్యాంగం కూడా అదే కోరుకుంటోంది.  కానీ, ఇక్కడి కుల వ్యవస్థ, ఇందులో ఇమిడి ఉన్న బానిసత్వం,  దళారీ వ్యవస్థ వలన తిరుగుబాటు కనుమరుగైనది.  భారత రాజ్యాంగం జనాభా ప్రకారం ప్రాతినిత్యం ఉండాలన్నది.  కానీ, పది శాతంలేని అగ్రకులాలు 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను పాలిస్తున్నారు. జనాభాలో  సగం ఉన్న మహిళలు  పార్లమెంటులో  వారి ప్రాతినిథ్యం 13.6 శాతమే. 

బందీ అవుతున్న ప్రజాస్వామ్యం

రాజ్యాంగంలోని  326  అధికరణను అనుసరించి సార్వత్రిక వయోజన ఓటు హక్కు  కల్పించారు. 1952 నుంచి 2023 వరకు మనదేశంలో 18 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.   ప్రస్తుతం  మనదేశం  దాదాపు వంద కోట్ల ఓటర్లతో  ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్నది.  రాజ్యాంగం అమల్లోకి  వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ...భారతదేశ ప్రజాస్వామ్యం అగ్రకుల ఆధిపత్య వర్గాల చేతిలో బందీ అవుతున్నది.  ఏటా ప్రపంచ దేశాలలో ప్రజాస్వామ్య పరిస్థితుల మీద నివేదిక విడుదల చేసే 'వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీస్' అనే సంస్థ తన నివేదికలో నియంతృత్వంపరంగా ప్రపంచ దేశాలలో భారత్ ముందు స్థానంలో ఉందని పేర్కొంది. భారతీయ పార్లమెంటరీ  ప్రజాస్వామ్యంలో  సంపన్నులు,  పలుకుబడిదారులు,  నేరస్తులకు ఎన్నికలు అడ్డాగా మారాయి. వీరినుంచి ప్రజాస్వామ్యం బతకాలన్నా, గెలవాలన్నా 90శాతం ఉన్న  బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు  ఓటు చైతన్యంతో ముందుకెళ్లాలి.  ఓటు హక్కు రాగానే సరిపోదని, ఆ ఓటు ద్వారా మనం రాజ్యాన్ని ఏలాలంటే మనకంటూ సొంత రాజకీయ వేదిక కూడా అవసరం. ఆ వేదిక ద్వారా మన ఓటు మనమే వేసుకుని అధికారంలోకి రావాలి.  అప్పుడే  ఈ దేశంలో  మెజార్టీ వర్గాల చేతిలోకి రాజ్యం, సంపద, భూమి వస్తుంది.  ఇదే నిజమైన విముక్తి.  ప్రజాస్వామ్య స్ఫూర్తికి కొనసాగింపు.

ఎలక్షన్ కమిషన్ వైఫల్యం

ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల సంఘం(ఈసీ) కీలకపాత్ర  పోషించాలి.  కానీ,  ఇటీవల  బిహార్ లో  ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా 65 లక్షల ఓటర్ల తొలగింపు ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఈసీ చర్యలను సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టింది. మరోవైపు  మహారాష్ట్ర  అసెంబ్లీ  ఎన్నికల్లో  ఓటు చోరీ సంఘటన కూడా సంచలనంగా మారింది. ఎన్నికల  సంఘం ఆధ్వర్యంలో జరిగే  ఓటు నమోదు,  తొలగింపు ప్రక్రియలో అనేక వైఫల్యాలు ఉన్నాయి.  క్షేత్రస్థాయిలో  బ్యూరోక్రసీ తప్పిదాలు స్పష్టంగా కనబడుతున్నాయి.  వీటి వెనకాల అగ్రకుల రాజకీయ నాయకుల హస్తం  పరోక్షంగా కొనసాగుతుంది.   ఈసీని  తమకు అనుకూలంగా మలుచుకొని  ప్రజాస్వామ్యాన్ని  అంతమొందిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి  ఊపిరిగా  నిలిచే ఓటు అనేది అమ్ముడుపోయే  సరుకుగా మారింది. దీనికి కారణం  ఈసీ ఉదాసీనతే.  నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ నిర్వహిస్తే  ప్రలోభ రాజకీయాలకు తెర పడుతుంది. టి.ఎన్ శేషన్ వంటి ఎలక్షన్ కమిషనర్ చేసిన ఒక శాతం సంస్కరణలే గొప్పగా చెప్పుకుంటున్నాం. మరి  మిగతా 99శాతం సంస్కరణలు అమలుపరిస్తే  సామాన్యులే ఈ దేశ  పాలకులై  భూతల స్వర్గంగా తీర్చిదిద్దుతారు.

ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్ 

స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. అసమానత, అణచివేత, బానిసత్వంతో నిండిన భారతీయ సమాజంలో  ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగంలో చేర్చారు. ఇదీ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన తర్వాత భారతదేశాన్ని ఒక ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించాడు.స్వేచ్ఛ,  సమానత్వం, సోదరభావం వంటి గొప్ప విశ్వ మానవత సూత్రాలను రాజ్యాంగంలో ఇనుమడింపజేశారు.  ఓటు అనే ఆయుధంతో రక్తం చిందించని శాంతియుత ప్రజాస్వామ్య విప్లవానికి పునాది వేశాడు.  ప్రపంచంలోని చాలా దేశాల్లో ఓటు హక్కు కోసం సుదీర్ఘ పోరాటాలు జరిగాయి. కానీ, భారతదేశంలో అంబేద్కర్ ఒక్కరే పోరాటం చేశాడు.  ఫలితంగా ఈ దేశంలో అణచివేతకు గురైన  బీసీ, ఎస్సీ, ఎస్టీ  సమాజాలకి ఓటనే  వజ్రాయుధం చేతికందింది.  అందుకే అంబేద్కర్  ‘నేను నా దేశ ప్రజలకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇచ్చాను. అది కత్తి కంటే పదునైంది. దాని సాయంతోనే పోరాడి రాజవుతారో...అమ్ముకుని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది వారే’ అని  చెప్పాడు.  కానీ, ఇప్పటికీ అమ్ముకొని బానిసలమే అవుతున్నాం.

- సంపతి రమేష్ మహారాజ్,
సోషల్ ఎనలిస్ట్​