వ్యాక్సిన్ ​రోజుకు  3 లక్షల మందికి వేయాలె

వ్యాక్సిన్ ​రోజుకు  3 లక్షల మందికి వేయాలె
  • స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్‌‌ ఆదేశం  

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 3 లక్షల మందికి వ్యాక్సిన్‌‌ వేసేలా స్పెషల్‌‌ డ్రైవ్‌‌ చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్‌‌ ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌‌పై ఆదివారం ఆయన మంత్రులు, అధికారులతో ప్రగతి భవన్‌‌లో రివ్యూ నిర్వహించారు. దేశంలో వ్యాక్సిన్‌‌ ఉత్పత్తి పెరిగిందని, రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్‌‌ అందే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు కరోనా కంట్రోల్‌‌లో ఉన్నా, భవిష్యత్‌‌లో ఇబ్బంది రాకుండా వ్యాక్సినేషన్‌‌ డ్రైవ్‌‌ చేపట్టాలన్నారు. విద్యాసంస్థలు ప్రారంభమైనా వాటిలో కరోనా ప్రభావం పెద్దగా లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వైరస్‌‌ వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశాలు కనిపించడం లేదని తెలిపారు. రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడివారు 2.80 కోట్ల మంది ఉండగా, ఇప్పటి వరకు1.42 కోట్ల మందికి ఫస్ట్‌‌ డోస్‌‌, 53 లక్షల మందికి సెకండ్‌‌ డోస్‌‌ వ్యాక్సినేషన్‌‌ పూర్తి చేశామని వివరించారు.
హెల్త్ సిబ్బందికి సహకరించాలె.. 
సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ స్పెషల్‌‌ వ్యాక్సినేషన్‌‌ డ్రైవ్‌‌ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎంపీవోలు, ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, డీపీవోలు, జెడ్పీ సీఈవోలు, ఇతర సిబ్బందితో సమన్వయం చేసుకొని హెల్త్‌‌ సిబ్బందికి సహకరించాలని చెప్పారు. లాక్‌‌డౌన్‌‌ కాలంలో సర్పంచులు కరోనా పేషంట్ల కోసం స్కూళ్లలో ఐసోలేషన్‌‌ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిలిచారని, ఇప్పుడు వ్యాక్సినేషన్‌‌ డ్రైవ్‌‌లోనూ భాగస్వాములు కావాలన్నారు. కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌‌లు, ఎప్పటికప్పుడు రివ్యూలు చేసి ఈ డ్రైవ్‌‌ ను విజయవంతం చేయాలని సీఎస్‌‌ను ఆదేశించారు. వ్యాక్సిన్‌‌ వేసే సిబ్బందికి భోజనం, వసతి, ఇతర సదుపాయాలు కల్పించాలన్నారు. స్కూళ్లు, కాలేజీలు, రైతు వేదికలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను వ్యాక్సినేషన్‌‌ సెంటర్లుగా వాడుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో టెంట్లు వేసి క్యాంపులు పెట్టాలన్నారు.