18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్ పై ఈటెల క్లారిటీ..!

18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్ పై ఈటెల క్లారిటీ..!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వలేమని స్పష్టం చేశారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్. కేంద్రం కేటాయించే వ్యాక్సిన్లను బట్టి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఉంటుందన్నారు. మే రెండవ వారంలో మాకు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలని కేంద్రాన్ని కోరామన్నారు. మా దగ్గర ఉన్న రాష్ట్రాల నుండి మాకు ఆక్సిజన్ అందించాలని.. రాష్ట్రాలకు ఆక్సిజన్ పంపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదే ఉందన్నారు. కేంద్రం కావాలంటే ఆక్సిజన్ కు డబ్బులు కూడా చెల్లిస్తామన్నారు. మాకు 3 కోట్ల.60లక్షల వ్యాక్సిన్ డోసులు కావాలి కాబట్టి..మాకు ఎప్పటి వరకు ఇస్తారో చెప్పాలన్నారు. వ్యాక్సిన్ తక్కువ కాకుండా మాకు వ్యాక్సిన్ ఇవ్వాలని.. రేమిడిసివర్ ఇంజక్షన్లు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని తెలిపారు. రేమిడిసివర్ ఇంజక్షన్లు దేశానికి ఎంత ఉత్పత్తి అవసరమో.. అంత ఉత్పత్తి చేయించాలన్నారు. దేశానికి అవసరమైన వ్యాక్సిన్, రేమిడిసివర్, ఆక్సిజన్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రేమిడిసివర్ ను ఉన్న రేట్ కంటే ఎక్కువ డబ్బులను అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
 
సెకండ్ వేవ్ ఇంత దారుణంగా ఉంటుందని రాష్ట్రాలకు కేంద్రం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు ఈటెల రాజేందర్.  రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మేము పాటిస్తున్నామన్నారు. కొంత మంది కేంద్రానికి సంబంధించిన నాయకులు మేము అన్ని ఇస్తున్నాం.. కానీ రాష్ట్రం వినియోగించుకోవడం లేదని అంటున్నారన్నారు. కొంత మంది నాయకులు బాధ్యత మరిచి మాట్లాడుతున్నారని.. ఆక్సిజన్, రేమిడిసివర్, వ్యాక్సిన్ అన్ని కేంద్రం చేతిలో పెట్టుకుని మాపై నిందలు వేస్తే ఎలా అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఆక్సిజన్ లేకుండా చనిపోతున్నారని వార్తలు వస్తున్నాయి కానీ.. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఇతర రాష్ట్రాల పేషెంట్లకు కూడా వైద్యం అందిస్తున్నామన్నారు. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం చేసుకుంటున్నామని.. గురి గింజ సామెత లాగా మమ్ములను అనడం ఎంత వరకు కరెక్ట్ అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నా కుంభమేళాకు కేంద్రం ఎందుకు పర్మిషన్ ఇచ్చిందని ప్రశ్నించారు ఈటెల రాజేందర్.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పేషెంట్లు 95 శాతం వరకు హోం ఐసోలేషన్ లో ఉంటున్నారని..5 శాతం రోగులు మాత్రమే ఇబ్బంది పడుతున్నారన్నారు. ఏప్రిల్ 30 నుండి 19 సెంటర్లలో కరోనా టెస్టింగ్ సెంటర్లను ఓపెన్ చేస్తున్నామన్నారు. రూపాయి ఖర్చు లేకుండా రేపటి నుండి టెస్టింగ్ సెంటర్లలో టెస్టులు చేయించు కోవచ్చని తెలిపారు. హోం ఐసోలేషన్ లో ఉండే వారు 3 రోజుల తర్వాత రక్త పరిక్షలు చేయించుకోవాలని సూచించారు మంత్రి ఈటెల.