జ్ఞానవాపి సర్వే గడువు మరోసారి పొడిగింపు.. 8 వారాల సమయం ఇచ్చిన వారణాసి కోర్టు

జ్ఞానవాపి సర్వే గడువు మరోసారి పొడిగింపు.. 8 వారాల సమయం ఇచ్చిన వారణాసి కోర్టు

కాశీవిశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) ఆవరణలో శాస్త్రీయ సర్వేకు మరో 8 వారాలు గడువు ఇవ్వాలంటూ భారత పురాతత్వశాఖ దాఖలు చేసిన పిటిషన్‌పై వారణాసి జిల్లా కోర్టు సానుకూలంగా స్పందించింది. సర్వే సమయం పొడిగించేందుకు అనుమతించింది. భారత పురాతత్వశాఖకు (ఏఎస్ఐ) తొలుత నాలుగు వారాలు మాత్రమే గడువు ఇచ్చారు. సెప్టెంబర్​2వ తదీతో ఆ గడువు పూర్తయింది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా సర్వే నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ.. మసీదు ప్రాంగణంలోని శిథిలాలను తొలగించడం కష్టమవుతోందని, అందువల్ల సర్వే పూర్తి చేసేందుకు మరో 8 వారాలు గడువు పొడిగించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఏఎస్‌ఐ తరఫున రాజేశ్‌ మిశ్రా వారణాసి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సోమవారం మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ రెండిటిపై వారణాసి జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. తవ్వకాల పేరుతో పునాదులను ధ్వంసం చేస్తున్నారని మసీదు నిర్వాహకులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పశ్చిమ గోడ పక్కన ఉన్న శిథిలాలను తొలగిస్తున్నారని, నిర్మాణాన్ని ప్రమాదంలో పడేస్తున్నారంటూ వాదనలు వినిపించారు. కేవలం సాంకేతిక పద్ధతుల్లోనే సర్వే నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించిందని, మసీదు పునాదులను తవ్వేందుకు, అక్కడి శిథిలాలను తొలగించేందుకు ఏఎస్‌ఐ అధికారులకు అనుమతి లేదని చెప్పింది. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి ఏకే విశ్వేష్‌ మసీదు కమిటీ అభ్యంతరాలను తోసిపుచ్చారు. సర్వేను కొనసాగించడానికి అనుమతి ఇచ్చారు. 

మొఘల్‌ కాలంలో హిందూ ఆలయ స్థానంలో ఈ మసీదు నిర్మించారని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించి తేల్చాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు ఇటీవల పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్‌ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి.. మసీదు ప్రాంగణమంతా కార్బన్‌ డేటింగ్‌, ఇతర పద్ధతుల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.