మిట్టపల్లి.. పప్పులకి బ్రాండ్​ 

మిట్టపల్లి.. పప్పులకి బ్రాండ్​ 

కూలీ పనులకు వెళ్తే  ఆర్థికంగా ఎదగలేమని గ్రహించారు వీళ్లు. సొంతంగా ఏదైనా బిజినెస్ చేస్తేనే కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని అనుకున్నారు. ఆ ఆలోచన రాగానే తలా కొన్ని డబ్బులు వేసుకున్నారు. నిత్యావసరాల్లో ఒకటైన పప్పుల వ్యాపారం మొదలుపెట్టారు. తమ ఊరి పేరునే బ్రాండ్​గా చేసుకుని రెండేండ్లుగా నాణ్యమైన పప్పులు అమ్ముతున్నారు. వీళ్లంతా సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన ‘శ్రీవల్లి’ మహిళా సంఘం సభ్యులు. కలిసికట్టుగా పనిచేస్తే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కూడా వ్యాపారంలో రాణించగలరని చాటి చెప్తున్న వీళ్ల గురించి...   

పప్పుల తయారీ మొదలుపెట్టక ముందు... ఈ మహిళల్లో కొందరు పొలం పనులకు వెళ్లేవాళ్లు, మరికొందరు బీడీలు చుట్టేవాళ్లు. చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకురావడం, పిల్లల్ని చదివించడం కష్టంగా ఉండేది. దాంతో  మహిళా సంఘంలో చేరితే, అప్పు దొరుకుతుంది. ఏదైనా వ్యాపారం  కూడా పెట్టుకోవచ్చు అనుకున్నారు వీళ్లు. 15 మంది మహిళలు కలిసి ఒక గ్రూప్​గా ఏర్పడ్డారు. వీళ్ల గ్రూప్​ పేరు ‘శ్రీవల్లి’.   ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నిత్యావసరాల్లో ఒకటైన పప్పుల వ్యాపారం చేయాలనుకున్నారు. రుచిగా ఉండే పప్పుల్ని, మార్కెట్ ధర కంటే తక్కువకే అమ్మాలి అనుకున్నారు ఈ మహిళలు. 2020 మార్చి నెలలో తలా 20 వేల రూపాయలు  వేసుకున్నారు.  

మార్క్​ఫెడ్ డిస్కౌంట్​తో...
పప్పుల తయారీ మెషిన్లు, ఇతర సామాన్లు కొనేందుకు డబ్బులు చాలకపోవడంతో బ్యాంకు నుంచి 10 లక్షల రూపాయల అప్పు తీసుకున్నారు. మహారాష్ట్ర నుంచి మెషిన్లు తెప్పించి,  ‘శ్రీవల్లి ఫుడ్​ ప్రాసెసింగ్ యూనిట్’ మొదలుపెట్టారు.  పప్పుల తయారీతో పాటు మెషిన్లు మధ్యలో ఆగిపోతే ఎలా రిపేర్​ చేయాలో కూడా తెలుసుకున్నారు.  మొదటగా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (మార్క్​ఫెడ్)​ సాయంతో 20 లక్షలు విలువ చేసే కందుల్ని రాయితీపై కొన్నారు. పప్పుల తయారీ మొదలుపెట్టారు.  నాణ్యమైన కందిపప్పుని  మార్కెట్  కంటే తక్కువ ధరకే అమ్మారు.  దీంతో చాలామంది మిగతా పప్పులు కూడా అడిగేవాళ్లు. వ్యాపారం బాగా నడుస్తుందనే నమ్మకం వచ్చాక ఐదు మెషిన్లు తెప్పించి మినప, పెసర, శెనగ పప్పుల తయారీ కూడా మొదలుపెట్టారు.  

రైతుల దగ్గర కొని..
రైతుల దగ్గర  నేరుగా కందులు, మినుములు, పెసలు, శనగలు కొంటారు వీళ్లు. వాటిని 12 శాతం తేమ వచ్చే వరకు ఆరబెడతారు. తర్వాత వాటిని మెషిన్​లో పోస్తారు. అందులో పప్పు గింజల మీది తాలు, మట్టి విడిపోతాయి. తర్వాత వాటిని బాయిలింగ్ చేసి, ఆరబెట్టాక సంచుల్లో నింపి రోలింగ్ మెషిన్​లో పోస్తారు. రోలింగ్ అయ్యాక పప్పు గింజల్ని ఆరబెట్టి, పొట్టు తీసి మెషిన్ల సాయంతో పప్పులు తయారుచేస్తారు.   వీళ్లు తయారు చేసిన పప్పులు అమ్మడం కోసం సిద్దిపేట రైతుబజార్​లో ప్రత్యేక కౌంటర్ పెట్టించారు అధికారులు. గత రెండేండ్లలో500 క్వింటాళ్ల కందిపప్పు, 500 క్వింటాళ్ల ఇతర పప్పులు అమ్మారు.  ఇప్పటి వరకు 16 లక్షల రూపాయలకు పైగా  ఆదాయం,  పెట్టుబడి పోను 6 లక్షల రూపాయల లాభం వచ్చింది. ప్రతిరోజు 8 నుంచి 10 వేల రూపాయల పప్పులు అమ్ముతూ నెలకు దాదాపు 3 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. వీళ్ల దగ్గర అన్ని రకాల పప్పులు మార్కెట్ కంటే ఐదు రూపాయలు తక్కువకే దొరుకుతాయి. రుచి బాగుండడంతో  మిట్టపల్లి పప్పులకి డిమాండ్ పెరిగింది. దాంతో, వీళ్లతో  పసుపు , కారంపొడి, వంట నూనెలు కూడా తయారు చేయించాలని అనుకుంటున్నారు అధికారులు. అంతేకాదు త్వరలోనే సిద్దిపేట కలెక్టరేట్​లో కూడా ఈ మహిళలు తయారు చేసిన పప్పులు అమ్మాలనే ఆలోచనలో ఉన్నారట. 

బీడీలు చేసేదాన్ని 
ఇంతకుముందు కుటుంబ అవసరాల కోసం బీడీలు చుట్టేదాన్ని. రోజంతా బీడీలు చేసినా కొన్ని డబ్బులే వచ్చేవి. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మహిళా సంఘం సభ్యులు అందరం కలసి పప్పుల తయారీని మొదలుపెట్టాం. దీన్నే కుటీర పరిశ్రమగా మార్చుకున్నాం. పప్పుల తయారీ ద్వారా మా సంఘంలోని వాళ్లం మునపటి కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాం.           
–  అంబటి సావిత్రి, సభ్యురాలు                       

కలిసికట్టుగా పనిచేస్తూ..
మా ‘మిట్టపల్లి పప్పుల’కు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. మా పప్పుల్ని ఎక్కువమంది కొంటుండ డంతో సంఘం సభ్యుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మహిళలు కలిసికట్టుగా పనిచేస్తే, ఏ వ్యాపారంలోనైనా రాణించగలరని  నిరూపిస్తున్నాం. అందరి సహకారంతో  ‘మిట్టపల్లి పప్పుల’ అమ్మకాలు మరింత పెంచేందుకు కృషి చేస్తున్నా.
– జంపల్లి లక్ష్మి, 
ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్ ప్రెసిడెంట్​.

కుటుంబానికి ఆసరా 
మాది వ్యవసాయ కుటుంబం. ఆరుగాలం కష్టడినా కూడా పండించిన ధాన్యానికి సరైన ధర రాక, అప్పుల పాలయ్యేవాళ్లం. పప్పుల తయారీ మొదలుపెట్టినప్పటి నుంచి నెలనెలా మంచి ఆదాయం వస్తోంది. పప్పుల యూనిట్ వల్ల మా కుటుంబాలకి ఆర్థికంగా ఆసరా అవుతున్నందుకు సంతోషంగా ఉంది.  
కేశవుల లక్ష్మీ, సభ్యురాలు

::: హెచ్.రఘునందన స్వామి, సిద్దిపేట, వెలుగు.