
ఓటు ఒక్కో దేశంలో ఒక్కోలా
ఓటు హక్కు పద్దెనిమిదేళ్లకు వస్తుంది. ఐదేళ్లకోసారి ఎలక్షన్స్ జరుగుతాయి. నాయకులను ఎన్నుకుంటారు. ఇవన్నీ తెలిసిన విషయాలే కదా! అవును మన దేశంలో అయితే ఇదే పద్ధతి. కానీ, వేరే దేశాల్లో పరిస్థితి ఇలా లేదు. పదహారేళ్లకు ఓటేయొచ్చు. ఓటును ఆన్లైన్లో వేయొచ్చు. కొన్ని దేశాల్లో అయితే ఓటు వేయకపోతే ఫైన్ కూడా వేస్తారు. భలే రూల్స్ కదా! ఈ రూల్స్ ఉన్న దేశాలేంటి? ఆ రూల్స్వెనక ఉన్న కారణాలేంటి?
ఎక్కువశాతం ఆదివారాల్లోనే..
ఆసియా, యూరప్ దేశాల్లో ఎక్కువశాతం ఆదివారాల్లోనే పోలింగ్ జరుగుతుంది. కానీ, అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఎలక్షన్స్ మంగళవారం జరుగుతాయి. ఇంగ్లీష్ మెయిన్ లాంగ్వేజ్‌గా ఉన్న దేశాలన్నీ ఆదివారం ఎలక్షన్స్ అనే రూల్ పాటించవు. అలా పాటించని వాటిలో కెనడా ఒకటి. కెనడాలో ఓటింగ్ సోమవారం జరుగుతుంది. యు.కె.లో గురువారం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో శనివారం ఎలక్షన్స్ జరుగుతాయి. అమెరికాలో మంగళవారమే ఎలక్షన్స్ జరగాలని కచ్చితమైన రూల్ కూడా లేదు. దూర ప్రాంతం నుంచి వచ్చే రైతులు వాళ్ల పనులు మానుకోకూడదనే ఉద్దేశంతో బుధవారం కూడా ఎలక్షన్స్ పెడతారు.
ఆటోమెటిక్ రిజిస్ట్రేషన్
స్వీడన్, ఫ్రాన్స్ దేశస్తులు ఓటు... రిజిస్ట్రేషన్ చేసుకోలేదే... ఎలక్షన్స్ దగ్గరకొచ్చేశాయ్? అని ఆందోళన పడాల్సిన పనిలేదు. ఎందుకంటే అక్కడి గవర్నమెంట్స్ ఆటోమెటిక్ రిజిస్ట్రేషన్ పద్ధతిని పెట్టారు. ఫ్రాన్స్‌లో18 ఏండ్లు నిండిన, నిండబోతున్న వాళ్ల పేర్లను ఆటోమెటిక్‌గా రిజిస్టర్ చేస్తుంది అక్కడి గవర్నమెంట్. స్వీడన్లో అయితే ట్యాక్స్ కడుతున్న వాళ్ల పేర్లు రిజిస్టర్ అయి ఉంటాయి. కాబట్టి వాటిని బట్టి ఓటర్ లిస్ట్‌లో చేరుస్తారు.
ఓటు వేయడం తప్పనిసరి
ఆస్ట్రేలియాలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు రిజిస్టర్ చేసుకోవాల్సిందే. ఫెడరల్ ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేసి, ఓటు వేయాల్సిందే. ఓటు వేయని వాళ్లకి 20 ఆస్ట్రేలియన్ డాలర్లు ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ కట్టకపోతే 180 ఆస్ట్రేలియన్ డాలర్‌ల వరకు జరిమానాలు విధిస్తారు. జరిమానా వేసి వదిలేస్తారనుకునేరు... దాంతోపాటు క్రిమినల్ చార్జ్ కూడా పెడతారు.
పదహారేండ్లకే ఓటు
బ్రెజిల్ దేశస్తులకు పదహారేండ్లకే ఓటు హక్కు వస్తుంది. ఇది 1988 నుంచి పాటిస్తున్న రూల్. ఆస్ట్రియా, కరగువా, అర్జెంటీనా, ఇండోనేసియా, సూడాన్ దేశాల్లో అయితే పదిహేడేండ్లకు ఓటు హక్కు వస్తుంది. జర్మనీలో కూడా పదహారేండ్లకు ఓటు వేయొచ్చు. కానీ, అవి లోకల్ ఎలక్షన్స్‌కి మాత్రమే. 2014లో మొట్టమొదటిసారిగా స్కాట్లాండ్ కూడా 16 ఏండ్ల టీనేజర్స్‌కి ఓటు హక్కు ఇచ్చింది. 18 ఏండ్లు నిండకుండానే ఓటు హక్కు ఇవ్వడానికి కారణం... చిన్నవయసులోనే ఓటు వేయడం అలవాటైతే, పెద్దయ్యాక ఓటు విలువ తెలుస్తుందని. దానితోపాటు నాయకుల గురించి, వాళ్ల పాలన గురించి అవగాహన వస్తుందనేది ఆయా దేశాల మాట.
ఆన్లైన్లో ఓటేయొచ్చు
ఈస్టోనియాలో 2005 నుంచి ఆన్లైన్లో ఓటు వేసే అవకాశం కల్పించారు. అయినప్పటికీ పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటు వేసే వాళ్ల సంఖ్య ఎక్కువే. 2015లో దాదాపు 30 శాతం మంది ఓటర్లు ఆన్లైన్లో ఓటు వేశారు. ఈస్టోనియాలో ఓటరు కార్డే ఐడి కార్డు. అదెలాగంటే ఓటరు కార్డు ఉన్న ప్రతి పౌరుడికి ఐడి కార్డ్, పిన్ వస్తుంది. మనదేశంలో ఆధార్ నెంబర్ లాగానే.. ఈ నెంబర్‌తో ట్యాక్స్‌ల నుంచి ఇతర ఫైన్ల వరకు కట్టుకోవచ్చు.
అమెరికాలో ఓట్లు వేసేవాళ్లు తక్కువ
2016వ సంవత్సరం రిపోర్ట్స్ ప్రకారం, మిగతా డెవలప్డ్ కంట్రీస్‌తో పోల్చితే అమెరికాలో ఓట్లు వేసే వాళ్ల సంఖ్య చాలా తక్కువ. 2012లో కూడా 53.6 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారు. 35 ఓఈసిడి(ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్) దేశాల్లో అమెరికా 31వ స్థానంలో ఉంది. 2014 ఎలక్షన్స్ చూస్తే బెల్జియంలో ఎక్కువశాతం మంది ఓటు అర్హత కలిగి ఉన్నారు. అంతేకాకుండా దాదాపు 87.2 శాతం బెల్జియం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మహిళల తర్వాతే పురుషులు
చిలీలో మహిళలకి మొట్టమొదటి ఓటు హక్కు 1930 మొదట్లో లోకల్ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చారు. అప్పుడు ఆడ, మగ ఇద్దరికీ వేరు వేరు ప్రాంతాల్లో పోలింగ్ ఏర్పాట్లు చేసేవారు. అదే ఏడాది కొత్తగా ఓటు హక్కు వచ్చిన మహిళలకోసం ప్రత్యేకంగా ఒక రిజిస్ట్రీ పెట్టారు. అయితే నేషనల్ ఎలక్షన్లలో మాత్రం మహిళలకు ఓటు వేసే హక్కు ఉండేది కాదు. దేశవ్యాప్తంగా మహిళల ఓటింగ్‌కు అనుమతి ఇచ్చినప్పటికీ 1949 వరకు ఆడవాళ్లను, మగవాళ్లను మాత్రం ఎన్నికల రోజున సెపరేట్‌గానే ఉంచారు. కానీ ఓటింగ్ రిజిస్ట్రీలను కలిపేశారు. అలాంటిది అరవైమూడేళ్ల తరువాత ఓటింగ్‌ను జెండర్ ఆధారంగా వేరు చేయొద్దని చిలీ ప్రభుత్వం నిర్ణయించింది. అయినా... ఇప్పటికీ ఆడ, మగ ఓటింగ్ సెపరేట్‌గానే జరుగుతోంది చాలా చోట్ల.